ధాన్యం కొనుగోలులో జాప్యం చేయొద్దు: రెండు మండలాల్లో కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ స్నేహ శబరీష్
హనుమకొండ: రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు వేగవంతంగా, పారదర్శకంగా కొనసాగాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులు, కొనుగోలు కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు. బుధవారం, గురువారం వరుసగా కలెక్టర్ కమలాపూర్ మండలం గూడూరు, శాయంపేట మండలం పత్తిపాక గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా పరిశీలించారు.

గూడూరు పీఏసీఎస్ ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రంలో ధాన్య తేమశాతం, తూకాలు, మిల్లులకు తరలింపులపై వివరాలు తెలుసుకున్నారు. ఆరబోసిన ధాన్యం, సంచుల్లో నింపిన స్టాక్ లెక్కలను పరిశీలించిన కలెక్టర్, పారదర్శకతను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ధాన్యం రవాణాను వేగవంతం చేసి నిల్వ సమస్యలను నివారించాలని అధికారులకు తెలిపారు. పీఏసీఎస్ చైర్మన్ సంపత్‌రావు మరియు రైతులతో కూడా కలెక్టర్ మాట్లాడారు.
గురువారం పత్తిపాకలో జరిగిన పరిశీలనలో కలెక్టర్ స్నేహ శబరీష్ మరింత కఠినంగా వ్యవహరించారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు వివరాలు, టోకెన్లు, రోజువారీ మిల్లులకు తరలింపులపై వివరాలు కోరారు. ట్యాబ్ పనిచేయక ఆరు రోజులుగా రైతుల వివరాలను నమోదు చేయకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
“రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావాలంటే ట్యాబ్ ఎంట్రీ తప్పనిసరి. ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు?” అని ఏపీఎం, కొనుగోలు కేంద్రం ఇంచార్జిని ప్రశ్నించారు. అదే సమయంలో రైతులు కూడా ఎందుకు వివరాలు అడగలేదని కలెక్టర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అక్కడే రైతుల వివరాలను ట్యాబ్‌లో ఎంట్రీ చేస్తుండగా స్వయంగా పరిశీలించారు. ట్యాబ్ ఎంట్రీల్లో నిర్లక్ష్యం కారణంగా సంబంధిత ఏపీఎంకు, ఇంచార్జికి షోకాజ్ నోటీసు జారీ చేయాలని అధికారులకు ఆదేశించారు.
రైతుల కోసం కొనుగోలు కేంద్రంలో టెంట్లు, తాగునీరు వంటి సౌకర్యాలు లేకపోవడంపై నిర్వహకులను నిలదీశారు.
“రైతులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనుగోలు జరగాలి. ట్యాబ్ వెంటనే బాగు చేయించాలి. రైతుల వివరాలను తక్షణమే నమోదు చేయాలి” అని కలెక్టర్ స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఎంపీడీవో, ఏపీఎంకు ఆదేశించారు.
ఈ పరిశీలనల్లో తహసీల్దార్లు ప్రవీన్‌కుమార్, సురేష్‌కుమార్, ఎంపీడీవోలు ఫణిచంద్ర, బాబు, ఏఈఓ ప్రశాంత్ తదితరులతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.

