పోలీసు శాఖలో కలకలం
అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ ఎస్‌ఐగా పనిచేస్తున్న భానుప్రకాష్ వ్యవహారం ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ వర్గాల్లో పెద్ద సంచలనంగా మారింది. దర్యాప్తు అధికారి చేయకూడని పనులకు పాల్పడటంతో మొత్తం పోలీస్ శాఖ ప్రతిష్టకే భంగం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది.
రికవరీ బంగారం దుర్వినియోగం
2020 బ్యాచ్‌కు చెందిన భానుప్రకాష్ ఇటీవల 4 తులాల బంగారం దొంగతనం కేసును విచారించాడు. కేసులో రికవరీ చేసిన బంగారాన్ని బాధితులకు ఇవ్వకుండా, “త్వరలో ఇస్తా” అని నమ్మబలికి, లోక్ అదాలత్‌లో ఇరు వర్గాలతో చర్చించి కేసును క్లోజ్ చేయించాడు.
కానీ కేసు మూసిన తర్వాత కూడా బంగారం బాధితులకు తిరిగి ఇవ్వకుండా… దానిని తాకట్టు పెట్టుకున్నట్టు విచారణలో బయటపడింది. ఈ విషయం పైస్థాయికి చేరడంతో అతడిపై కేసు నమోదు చేసి, సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.
సర్వీస్ పిస్టల్ మాయం… మరో సంచలనం
ఇంతకే ఆగకుండా, భానుప్రకాష్ పై మరో కీలక ఆరోపణ బయటకు వచ్చింది. తనకు కేటాయించిన 9MM సర్వీస్ పిస్టల్ కనిపించడంలేదని స్టేషన్‌కు వచ్చి గోల చేశాడు.
డ్రా చెక్ చేయగా బుల్లెట్లు మాత్రమే ఉండగా, గన్ మాత్రం కనిపించలేదు. సీసీ కెమెరా ఫుటేజీ చెక్ చేస్తే… రికవరీ చేసిన బంగారాన్ని డ్రాలో పెట్టి తీసుకెళ్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి.
పిస్టల్ విషయమై అడిగితే, “డ్రాలోనే పెట్టా… తర్వాత ఏమైందో తెలియదు” అని భానుప్రకాష్ విచారణలో చెప్పినట్టు సమాచారం.
బెట్టింగ్ వ్యసనం… అప్పుల ఒత్తిడి
విచారణలో మరిన్ని షాకింగ్ వివరాలు బయటకు వస్తున్నాయి. బెట్టింగ్‌కు బానిసైన భానుప్రకాష్ దాదాపు రూ.70–80 లక్షలు పోగొట్టుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ అధికారులకు తెలిసింది. ఆర్థిక సమస్యలు, అప్పుల ఒత్తిడే అతడిని ఈ అక్రమాలకు నెట్టినట్టు అనుమానిస్తున్నారు.
ఈ మధ్యే “ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 ఉద్యోగం వచ్చింది” అని చెప్పి స్టేషన్‌కు వచ్చి వస్తువులు తీసుకెళ్లే సమయంలోనే పిస్టల్ మిస్సింగ్ విషయం బయటపడింది. గన్‌ను రాయలసీమ లేదా ఇతర ప్రాంతాల ముఠాలకు అమ్మేశాడా? అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
కొనసాగుతున్న విచారణ… పిస్టల్ మిస్టరీ ఇంకా వీడలేదు
ప్రస్తుతం రికవరీ సొత్తు దుర్వినియోగం కేసులో భానుప్రకాష్‌ను విచారిస్తున్నట్టు టాస్క్‌ఫోర్స్ అధికారులు తెలిపారు. అయితే సర్వీస్ పిస్టల్ మిస్సింగ్ మిస్టరీ ఇప్పటికీ క్లియర్ కాలేదు.
ఈ ఘటనల నేపథ్యంలో అతన్ని నాలుగు రోజుల క్రితమే విధుల నుంచి తొలగించినట్లు (సస్పెండ్ చేసినట్లు) కాచిగూడ డివిజన్ ఏసీపీ హరీష్‌కుమార్ తెలిపారు.

