కిస్మత్ అంటే ఇదే మరి…….
అబుదాబి: తల్లి పుట్టినరోజు ఆధారంగా లాటరీ టికెట్ కొనడం వల్ల ఓ భారతీయ యువకుడి జీవితమే మారిపోయింది — ఇది యుఏఈలో నివసిస్తున్న భారత యువకుడి నిజజీవిత కథ. అబుదాబిలో పనిచేస్తున్న 29 ఏళ్ల అనిల్‌కుమార్ బోల్లా రూ.240 కోట్ల విలువైన లాటరీ జాక్‌పాట్ గెలుచుకుని రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు.
అక్టోబర్ 18న జరిగిన 23వ ‘లక్కీ డే డ్రా’లో అనిల్‌కుమార్ 100 మిలియన్ దిర్హామ్‌ల (సుమారు రూ.240 కోట్లు) బంపర్ ప్రైజ్ గెలుచుకున్నారు. ఇది యుఏఈ లాటరీ చరిత్రలోనే అత్యధిక బహుమతి. ఈ విజయం తనకు పూర్తిగా ఊహించని విషయమని, విజేతగా తన పేరు ప్రకటించినప్పుడు షాక్‌కు గురయ్యానని అనిల్‌కుమార్ తెలిపారు.
తల్లి పుట్టినరోజే తనకు అదృష్టం తెచ్చిందని ఆయన చెప్పారు. “లాటరీ టికెట్‌లో చివరి సంఖ్య అమ్మ బర్త్‌డే ఆధారంగా వచ్చింది. అదే నా లక్ టర్నింగ్ పాయింట్ అయింది” అని ఆనందం వ్యక్తం చేశారు.
విజయం తర్వాత తన భవిష్యత్ ప్రణాళికల గురించి కూడా అనిల్ మాట్లాడారు. వచ్చిన డబ్బును జాగ్రత్తగా పెట్టుబడి పెట్టి, వాటి లాభాలతో పెద్ద ప్రయోజనకరమైన పనులు చేయాలనుకుంటున్నానని చెప్పారు. “ఇంత పెద్ద మొత్తం వచ్చినా దాన్ని వృథా చేయను. సరిగ్గా ప్లాన్ చేసుకుని, భవిష్యత్‌కు ఉపయోగపడేలా ఖర్చు చేస్తాను” అని చెప్పారు.
లాటరీ విజయాన్ని జరుపుకోవడానికి ఒక సూపర్ కారు కొనాలని అనిల్‌కుమార్ భావిస్తున్నారు. అలాగే ఒక లగ్జరీ రిసార్ట్‌లో కుటుంబంతో కలిసి ఈ సక్సెస్‌ను సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారు. కుటుంబం ఎప్పుడూ తనకు ప్రధానమని, వారిని యుఏఈకి తీసుకువచ్చి కలసి జీవించాలని కోరుకుంటున్నానని చెప్పారు. అంతేకాకుండా, ఈ బహుమతిలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు విరాళంగా ఇవ్వాలనుకుంటున్నట్లు వెల్లడించారు.
లాటరీ కొనేవారికి కూడా అనిల్‌కుమార్ ఒక సలహా ఇచ్చారు — “ప్రతి విషయం ఒక కారణం కోసమే జరుగుతుంది. ఆశను వదలకండి, ఒక రోజు అదృష్టం మీ తలుపు తడుతుంది” అని అన్నారు.
ఇటీవల సెప్టెంబర్‌లో దుబాయ్‌లో నివసిస్తున్న మరో భారతీయుడు సందీప్ కుమార్ ప్రసాద్ కూడా అబుదాబి బిగ్ టికెట్ డ్రాలో 15 మిలియన్ దిర్హామ్‌లు (సుమారు రూ.35 కోట్లు) గెలుచుకున్నారు. భారత్ నుంచి యుఏఈలో పనిచేస్తున్నవారికి ఈ లాటరీలు అదృష్టం తలుపులు తెరుస్తున్నాయి.

