ధాన్యం దిగుబడిలో తెలంగాణ ఆల్ టైమ్ రికార్డు – మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయం నుండి – ప్రచురణార్థం
తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో మరో చరిత్ర సృష్టించింది. ఈ వానాకాలంలో 148.03 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడితో రాష్ట్రం ఆల్ టైమ్ రికార్డు సాధించిందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
బుధవారం ఆయన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయం నుండి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేశంలోని 29 రాష్ట్రాలలోనూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనూ ఇంత పెద్ద మొత్తంలో దిగుబడి రాలేదని అన్నారు. ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ప్రభుత్వం రైతు స్నేహపూర్వక విధానాలు అమలు చేయడం వలన ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని చెప్పారు.
మొత్తం 66.8 లక్షల ఎకరాలలో ఉత్పత్తి అయిన ధాన్యం కొనుగోలుకు రాష్ట్రవ్యాప్తంగా 8,342 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. వీటిలో 4,259 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా, 3,517 ఐకేపీ కేంద్రాల ద్వారా, 566 ఇతర సంస్థల ద్వారా ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఈ వానాకాలం కొనుగోళ్లకు 22 నుంచి 23 వేల కోట్లు వెచ్చించనున్నట్టు తెలిపారు. 80 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యాన్ని నిర్ణయించామని, అందులో 40 లక్షల టన్నుల సన్నాలు, 40 లక్షల టన్నుల దొడ్డు రకాలు కొనుగోలు చేస్తామని వివరించారు.
కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పౌర సరఫరాల శాఖ, వ్యవసాయ శాఖ, రవాణా శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం, డేటా ఎంట్రీ, ధాన్యం తరలింపు వంటి ప్రక్రియలు 48 నుండి 72 గంటల్లో పూర్తయ్యేలా సమయపాలన పాటించాలి అని ఆదేశించారు.
ధాన్యం కొనుగోలు వివరాలు నమోదు అయిన 48 గంటల్లో రైతులకు చెల్లింపులు జరగాలని తెలిపారు. అలాగే, మద్దతు ధరతో పాటు సన్నాలకు బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
వర్ష సూచనలు, వాతావరణ మార్పులను అధికారులు గమనిస్తూ ధాన్యం చెడిపోకుండా టార్పాలిన్ షీట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో పౌర సరఫరాల శాఖ కమిషనర్ లేదా తనను నేరుగా సంప్రదించవచ్చు, తాను 24 గంటలు అందుబాటులో ఉంటానని తెలిపారు.
ఇప్పటికే కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, సిద్దిపేట, నల్లగొండ జిల్లాల్లో 1,205 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని మంత్రి తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ఎక్కువసేపు నిరీక్షించాల్సిన అవసరం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు తలెత్తిన పక్షంలో హెల్ప్‌లైన్ నంబర్లు 1800-425-00333 / 1967 కు ఫోన్ చేయవచ్చని తెలిపారు. జిల్లా కేంద్రాల నుండి కొనుగోలు కేంద్రాల వరకు ప్రత్యేక పర్యవేక్షణ బృందాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు.
వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, గత రెండు సంవత్సరాల్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ధాన్యం కొనుగోలు ప్రక్రియను విజయవంతంగా నిర్వహించామని అన్నారు. ప్రస్తుత వానాకాలంలో వచ్చిన అధిక దిగుబడి దృష్ట్యా పౌర సరఫరాలు, వ్యవసాయ, సహకార శాఖలు సమన్వయంతో పని చేస్తే మరింత మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు.