*ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో లంచగొండులపై కఠినచర్యలు*
ఇండ్లు ఇవ్వకుండానే చెల్లింపులు చేసిన నలుగురు అధికారులు సస్పెన్షన్
10 వేలు డిమాండ్ చేసిన ఇందిరమ్మ కమిటీ సభ్యుడు తొలగింపు
30 వేలు డిమాండ్ అంశంపై తక్షణ నివేదికకు ఆదేశం
లంచమడిగితే టోల్ ఫ్రీ నెంబర్ 18005995991కు కాల్ చేయండి
డబ్బుల కోసం పేదలను వేధిస్తే 24 గంటల్లో క్రిమినల్ కేసుల నమోదు
ఇండ్ల కోసం ఇచ్చిన నిధులను పాతబాకీకి జమ చేసే బ్యాంకులపై చర్యలు
కాల్‌సెంటర్‌కు వచ్చిన ఫిర్యాదులపై సుదీర్ఘంగా సమీక్షించిన
రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ , సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్ :- పేదవాడి సొంతింటి కలను నెరవర్చే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, చెల్లింపుల విషయంలో అవినీతికి పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించబోమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ , సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు.
ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల సమస్యలు, సందేహాలకోసం గత వారం హౌసింగ్ కార్పోరేషన్‌లో ప్రారంభించిన కాల్‌సెంటర్‌కు వచ్చిన ఫిర్యాదులపై డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్‌లో శుక్రవారం నాడు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ విపి గౌతమ్, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెస్ ( సిజిజి) ఎడిజీ సంగ్రామ్ సింగ్ పాటిల్ తోకలిసి మంత్రిగారు సుదీర్ఘంగా సమీక్షించారు. ఏ ఏ అంశాలపై కాల్ సెంటర్‌కు ఫిర్యాదులు వస్తున్నాయని అధికారులను అడిగి తెలుసుకొని తక్షణ చర్యలకు ఉపక్రమించారు.
ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు లబ్దిదారుల నుంచి లంచం అడిగే ఇందిరమ్మ కమిటీ సభ్యులను తక్షణం కమిటీ నుంచి తొలగించి క్రిమినల్ కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి సూర్యాపేట జిల్లా మధిరాల మండలం పోలుమల్ల గ్రామంలో కొండ లింగయ్య అనే వ్యక్తికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కోసం పదివేల డిమాండ్ చేసిన ఇందిరమ్మ కమిటీ సభ్యుడు సత్తెయ్యను, జనగాం జిల్లా దేవరుప్పల మండలం పడమటి తండాలో శివమ్మ అనే లబ్దిదారురాలి నుంచి 30 వేల రూపాయిలు ఇవ్వాలని గ్రామ పంచాయితీ సెక్రటరీ డిమాండ్ చేశారని ఫిర్యాదురాగా విచారణలో ఇందిరమ్మ కమిటీ సభ్యుని పాత్ర ఉందని తేలింది. దీంతో ఈ అంశంపై పూర్తిస్ధాయి విచారణ జరిపి 24గంటల్లో నివేదిక ఇవ్వాలని మంత్రిగారు ఆదేశించారు. కాల్‌సెంటర్ కు వచ్చిన ఫిర్యాదులపై మంత్రిగారు పై విధంగా స్పందించారు.
అదేవిధంగా ఖమ్మం, జగిత్యాల, కొత్తగూడెం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇండ్లు మంజూరుకాని నలుగురికి వారి ఖాతాలో నిధులు జమచేసిన గ్రామ పంచాయితీ సెక్రటరీలను తక్షణమే సస్పెండ్ చేసి ఈసంఘటనపై పూర్తిస్ధాయి విచారణ జరిపించాలని అధికారులకు సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు ఇంటి నిర్మాణ దశలను బట్టి ప్రతి సోమవారం నిధులు మంజూరు చేస్తున్నామని, అయితే కొన్ని బ్యాంకులు ఈ నిధులను లబ్దిదారుల ఖాతాలో జమచేసి పాత బకాయి కింద జమ చేసుకుంటున్నాయని, ఇటువంటి చర్యలను సహించేదిలేదని, సదరు బ్యాంకులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీనిపై రాష్ట్ర స్దాయి బ్యాంకర్ల కమిటీకి లేఖ రాయాలని హౌసింగ్ ఎండీని ఆదేశించారు.
ఆధార్ నెంబర్ ఆధారంగా చెల్లింపుల్లో ఎదురవుతున్న సమస్యలను ఈనెల 25వ తేదీలోగా పరిష్కరించి దసరా పండగలోపు చెల్లింపులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఏఈ లు కూడా ప్రతిగ్రామంలో లబ్దిదారుని వద్దకు వెళ్లి ఆధార్, బ్యాంకు వివరాలను పరిశీలించాలని లబ్దిదారుడు కూడా బ్యాంకుకు వెళ్లి ఆధార్‌నెంబర్‌తో బ్యాంకు ఖాతాను అనుసంధానం చేసుకోవాలని సూచించారు. ఆధార్ నెంబర్ గాని, పేరుగాని తప్పు ఉంటే గ్రామ కార్యదర్శి ఎంపీడీవో దృష్టికి తీసుకువెళ్లి సరిచేసుకోవాలన్నారు. త్వరలో లబ్దిదారుడే స్వయంగా ఈ దిద్దుబాటు చేసుకొనేలా యాప్‌ను తయారుచేశామని, ఒకటి రెండు రోజుల్లో ఇది అందుబాటులోకి వస్తుందన్నారు. సాంకేతికపరంగా మరింత పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల విషయంలో పేదలను ఇబ్బందిపెట్టి డబ్బుల వసూళ్లకు పాల్పడితే ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే చర్యలు తీసుకుంటామని కాల్ సెంటర్‌కు వచ్చిన ఫిర్యాదును తక్షణం ఆయా జిల్లా కలెక్టర్ , ఎస్పీకి పంపడంతోపాటు సచివాలయంలోని తన కార్యాలయానికి కూడా పంపించాలని అధికారులకు సూచించారు. ఇటువంటి ఫిర్యాదులపై తమ కార్యాలయం కూడా మానిటరింగ్ చేస్తుందని తెలిపారు. లంచమడిగితే టోల్ ఫ్రీ నెంబర్ 18005995991కు కాల్ చేసి వివరాలను తెలియజేస్తే 24 గంటల్లో యాక్షన్ తీసుకుంటామని భరోసా ఇచ్చారు.