మాజి ఐఏఎస్ కు దక్కిన పాదాభివందన ప్రతిఫలం
రెడ్కో చైర్మన్‌గా శరత్ నియామకం
హైదరాబాద్: నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లు ఉంది కొందరు ఐఏఎస్ ల వ్యవహారశైలి.వీరిని అసలు ఐఏఎస్ లు అని అనలేం అయ్యాఎస్ అనడం కరెక్టుగా సరిపోతుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళ్లు మొక్కిన విశ్రాంత ఐఏఎస్ అధికారి శరత్‌కు సర్కార్ కీలక పదవి కట్టబెట్టింది. తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (రెడ్కో) చైర్మన్‌గా ఆయనను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.
రిటైర్ మెంట్ దగ్గర పడిన శరత్ నాగర్ కర్నూల్ లో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రికి మెమెంటో ఇచ్చి వంగి కాళ్లు పట్టుకుని దండం పెట్టాడు. అప్పట్లో ఇది చర్చలకు, విమర్శలకు దారితీసింది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు సీరియస్ అయ్యారు.అధికారుల తీరుపై అభ్యంతరాలు తెలుపుతూ అంతర్గత ఉత్తర్వులు జారి చేశారు.

ఐఏఎస్ అధికారులు రాజకీయ నాయకులతో ఉన్నప్పుడు బాధ్యతగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఇటీవల ప్రభుత్వ అధికారులు ఆల్ ఇండియా సర్వీసెస్ ప్రతిష్ఠ దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఐఏఎస్ అధికారులు ఆల్ ఇండియా సర్వీసెస్ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించరాదని, ఇకమీదట రాజకీయ సమావేశాలలో ఇలాంటి చర్యలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.
గమ్మత్తేమంటే ముఖ్యమంత్రికి పాదాభివందనం చేసిన శరత్ కు అదేసిఎస్ ఉత్తర్వులు జారి చేయక తప్పలేదు. అది పొలిటికల్ పవర్ మరి. సిఎంవో నుండి వచ్చిన ఫైళును కాదు కూడదు అన లేరు…తిప్పిపంపడమూ చేయలేరు. అలాంటి పరిస్థితి చీఫ్ సెక్రటరీది. ఏం చేస్తాడు పాపం పోస్టాఫీసులో జరిగే పనిచేశాడు.
శరత్‌ను రెడ్కో చైర్మన్‌గా రెండేళ్ల పాటు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. ఈ పరిణామం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేక వర్గాలు సోషల్ మీడియా వేదికగా ఈ నిర్ణయంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.