ఐలమ్మ స్ఫూర్తితో రాజ్యంలో వాటాకై పోరాడాలి
రచయిత్రి దాసోజు లలిత
తెలంగాణ శ్రామిక కులాలు తెలంగాణ కోసం పోరాడినారు కానీ అధికారంలో వాటా అడగలేదని నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడినారు కానీ నిధుల్లో, వనరుల్లో, భూమిలో బహుజనుల వాటా అడగలేదని విద్యార్థులు, మహిళలలు చాకలి ఐలమ్మ స్ఫూర్తితో రాజ్యంలో వాటాకై పోరాటం చేయాలని సహజ రచయిత్రి దాసోజు లలిత పిలుపునిచ్చారు. చాకలి ఐలమ్మ 40 వ వర్ధంతి సందర్భంగా ఆర్గనైజేషన్ ఫర్ బ్యాక్వార్డ్ క్లాసెస్ (ఒబిసి) ఉపాధ్యక్షురాలు డాక్టర్ టి విజయలక్ష్మి అధ్యక్షతన హనుమకొండ జిల్లా కేంద్రం హరిత కాకతీయ హోటల్ లో జరిగిన మహిళా చైతన్య సదస్సులో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కల్వకుంట్ల కవిత లాంటి వారు 10 ఏండ్లు అధికారం అనుభవించి సామాజిక న్యాయం జరగలేదని, సామాజిక తెలంగాణ ఏర్పడలేదని మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు.

సబ్బండ కులాలు ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణలో బి.సి లకు తీరని అన్యాయం జరిగిందని అన్నారు. రాత్రికి రాత్రే ఇ డబ్ల్యు ఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చి బి.సి విద్యావంతులకు అన్యాయం చేస్తున్న స్థితిని గమనించి పోరాటం చేయాలని అన్నారు. ధిక్కార స్వరం చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తితో మహిళా బిల్లులో బి.సి వాటా కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణంతో బి.సి కుల వృత్తులు నాశనమై బతకలేక బలిదానాలు చేసుకుంటున్నారని, రెక్కల కష్టం మీద బతుకులేడుస్తున్న బి.సి ల బతుకులు బాగుపడాలంటే రాజ్యములో వాటా కోసం యుద్ధం చేయాలని అన్నారు.
ఎదిగిన మహిళలు బహుజన విలాసాలను వీడి రాజ్యాధికారం కోసం చర్చలు చేయాలని, ఆధిపత్య పాలకుల ప్రలోభాలకు లొంగి జీవించినంత కాలం విముక్తి సాధ్యం కాదని అన్నారు. విద్యార్థినులు, మహిళలు చట్టసభల్లోకి చేరిన నాడే సమసమాజ ఏర్పడుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిట్ ప్రొఫెసర్ రమాదేవి మాట్లాడుతూ ఆనాటి కాలంలో చాకలి ఐలమ్మ తిరగబడిన తెగువ స్పూర్తితో నేటి ప్రజాస్వామ్య వ్యవస్థలో యుద్ధం చేయాలని, అంబేద్కర్ ఇచ్చిన ఓటు ద్వారా రాజ్యాధికారం చేపట్టాలని, రాజ్యాధికార యుద్ధంలో మహిళలు కీలకపాత్ర పోషించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఒబిసి అధ్యక్షులు సుందర్ రాజ్ యాదవ్ మాట్లాడుతూ నేటి యువత, విద్యార్థి లోకం పాలకవర్గాల కుట్రలను తెలుసుకోవాలని, ఇ డబ్ల్యు ఎస్ ద్వారా ఎదుగుతున్న బి.సి లకు జరుగుతున్న నష్టాన్ని ఎదురించాలంటే రాజ్యాధికారమే లక్ష్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఒబిసి ప్రధాన కార్యదర్శి గడ్డం భాస్కర్, నాయకులు వేణుమాదవ్, ఎం ఎన్ మూర్తి, సరిత, పద్మజాదేవి, నాయిని సరస్వతి, మౌనిక, భవాని, మేదరి సంఘం రాష్ట్ర నాయకులు దీకొండ సరిత, అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ రాష్ట్ర నాయకురాలు సామనపల్లి లక్ష్మీ, కార్పొరేటర్లు రావుల కోమల, చీకటి శారద, బైరి లక్ష్మీ, ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్, న్యాయవాదులు కన్నూ పద్మ, శ్రీలత, వివిధ సంఘాల నాయకులు తాడిశెట్టి క్రాంతి కుమార్, శంకరాచారి, గొల్లపల్లి వీరస్వామి, గడ్డం కేశవమూర్తి, కొలిపాక దేవిక, చిలువేరి రమ్య, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.