యూపీలో నేరగాళ్ల పాలిట సింహస్వప్నం యోగి : 30 వేలకు పైగా అరెస్టులు, 15 వేల ఎన్‌కౌంటర్లు!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో నేరస్థుల ఆట కట్టిస్తున్నారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఆయన ఆదేశాల మేరకు రాష్ట్రంలో నేరాలపై ఉక్కుపాదం మోపుతున్నామని ఉత్తరప్రదేశ్ పోలీసు అధికారులు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన 2017 నుండి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 15 వేల ఎన్‌కౌంటర్ కేసులు నమోదైనట్లు డీజీపీ రాజీవ్ కృష్ణ వెల్లడించారు.
కీలక ఆపరేషన్లలో 238 మంది నేరగాళ్లు మృతి
ఈ కీలక ఆపరేషన్లలో 238 మంది నేరగాళ్లు మరణించారని డీజీపీ రాజీవ్ కృష్ణ తెలిపారు. దాదాపు 30 వేల మందికి పైగా నిందితులను అరెస్టు చేశామని, పోలీసులపై దాడికి ప్రయత్నించిన ఘటనల్లో 9 వేల మందికి కాలికి గాయాలయ్యాయని ఆయన పేర్కొన్నారు. పరారీలో ఉన్నవారు, పదేపదే నేరాలకు పాల్పడే వారి కోసం చేపట్టిన ఆపరేషన్‌లలో ఈ మరణాలు సంభవించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నేరస్థులపై తీవ్ర చర్యలు తీసుకుంటున్నామని ఆయన పునరుద్ఘాటించారు.
మీరట్ జోన్లో అత్యధిక ఎన్‌కౌంటర్లు
గత ఎనిమిదేళ్లలో 14,973 ఆపరేషన్లు చేపట్టి 30,694 మంది నేరస్థులను అరెస్టు చేసినట్లు డీజీపీ వివరించారు. ఇందులో పోలీసులపై దాడులకు పాల్పడిన 9,467 మందికి కాలికి గాయాలయ్యాయని తెలిపారు. మీరట్ జోన్‌లోనే అత్యధిక ఎన్‌కౌంటర్లు జరిగాయని, ఆ తర్వాత ఆగ్రా, బరేలీ, వారణాసిలలోనూ పెద్ద సంఖ్యలో నేరస్థులను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. నేర రహిత సమాజమే లక్ష్యంగా తాము పని చేస్తున్నామని ఆయన చెప్పారు.