Site icon MANATELANGANAA

ముత్యాలముగ్గు పడి యాభై

ముత్యాలముగ్గు పడి యాభై..!

(విడుదల..25.07.1975)

బాపూ.. రమణ ..
ఇద్దరూ కలిసి ముత్యాలముగ్గు వేసి యాభై..అంటే సరిగ్గా
అర్థశతాబ్దం పూర్తయింది.
నిశ్శబ్దం నుంచి పుట్టిన
ఆహ్లాదకరమైన శబ్దం
ఈ సినిమా.మాటలు తూటాలు కాదు.. కసాటాలు..
చూస్తున్నది సినిమానా..
కళ్లెదుట సహజంగా జరుగుతున్న కథా..
సంఘటనల సమాహారమా..
అన్నట్టు బాపూ చక్కగా
పేర్చిన ముగ్గు..
ముళ్ళపూడి గొప్పగా
పేల్చిన మాటలు..
పెద్దగా ప్రచారం లేదు..
ప్యాన్ ఇండియా కార్డు
అసలే లేదు.. కాని..
ఇంటింటి సినిమా..
అసలు సిసలైన తెలుగు సినిమా..పల్లెలో..పట్టణంలో..
నగరంలో..అన్ని చోట్లా
ఒకేలా ఆడిన ప్యానాంధ్ర బైస్కోప్..తెలుగు సినిమాల్లో అప్పటికి.. ఇప్పటికి..ఎప్పటికీ
ఎన్నదగిన కళాఖండం..
బాపూరమణీయం..
ఈ ముత్యాలముగ్గు
ఇప్పుడు ప్రసారం అవుతున్నా
టివికి అతుక్కుపోయేలా చేసే
అద్భుత చిత్రరాజం..

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

ముత్యాలముగ్గు..

ఈ సినిమాని..
బాపూని..
ముళ్ళపూడిని..
వేర్వేరుగా చూడలేము..

అలాగే ఈ సినిమా నుంచి వేరుచేసి చూడలేని
మరో వ్యక్తి ఉన్నారు..
నిజానికి ఈ సినిమాకి
ఆయనే ఊపిరి..
ఆయనే ప్రాణం..
ఆయనే జీవం..
ఆయనే జవం..
ఆయన రావు గోపాలరావు..

ఒక పాత్ర..
ఆ పాత్ర గురించి
యాభై ఏళ్ల తర్వాత కూడా
చెప్పుకుంటున్నామంటే..
ఆ పాత్ర పలికిన డైలాగులు
ఈరోజుకీ ఎక్కడో ఒక దగ్గర..
ఏదో ఒక సందర్భంలో
ఆ సందర్భానికి తగినట్టు
వాడుకుంటున్నామంటే..
అస్సలు ఒక క్యారెక్టర్.. అందునా విలన్ చెప్పిన డైలాగులు యాభై ఏళ్ల క్రితం
లాంగ్ ప్లే రికార్డుగా వచ్చాయంటే..
అదే ఒక రికార్డు..
ఆ రికార్డు..ఆ డైలాగులు
అంత గొప్పగా రాసిన ముళ్ళపూడి వెంకటరమణది..
అలాంటి డైలాగులు నడిపే
సన్నివేశాలను
సృష్టించిన బాపూది..
ఆ ఇద్దరూ కలిసి రూపుదిద్దిన
పాత్రకు ప్రాణం పోసిన
రావు గోపాలరావుది..
అంతటి విలక్షణమైన పాత్రగా
ఏనాటికీ నిలిచిపోయే
క్యారెక్టర్..కాంట్రాక్టర్..

పైనేదో మర్డర్
జరిగినట్టు లేదూ ఆకాశంలో..
సూర్యుడు
నెత్తుటి గడ్డలా లేడూ..
ఎప్పుడూ ఎదవ బిగినెస్సేనా..
ఊరికే తిని తొంగుంటే
మడిసికీ గొడ్డుకీ తేడా ఏటుంటాది..
మడిసన్నాక కాసింత కళాపోసన ఉండాలి..
సరిత్ర సింపేస్తే చిరిగిపోదు..
సెరిపేస్తే చెరిగిపోదు..

ఈ డైలాగులు
రావు గోపాలరావు చెబుతున్నప్పుడు
థియేటర్లు చప్పట్లతో మారుమోగిపోలేదు గాని
ప్రేక్షకుల గుండెలు మాత్రం
అదోలాంటి తమకంతో
మోత మోగిపోయాయి..
నిజానికి అవి నేటి సినిమాల మాదిరి పంచులు కావు..
కంచులు..డబ్బు సంచులు..!

ఒక కథ..మామూలు కథే కాని
మూస కధైతే కాదు…
ఈ కథ సాదాసీదా ఫ్యామిలీ డ్రామా కాదు..దానిలో బోలెడు ట్విస్టులు ఉన్నాయి..

జమిందారు ఇంటి అబ్బాయికి..పేదింటి పిల్లకి
చిత్రంగా జరిగిన పెళ్లి..
కొంత కొత్త ఒడిదుడుకులు ఎదుర్కొన్నా..అధిగమించి
చక్కగా కుదిరిన ఆ జంట కాపురం..అంతలోనే
అనుమానం..అదీ అంత బలంగా అనుమానం నాటుకునేలా అత్యంత
నాటకీయంగా సెట్ చేసిన
సన్నివేశం..సీతను రామయ్య
వనవాసానికి పంపినట్టు
భర్త ఎటువంటి రభస..రచ్చ లేకుండా మౌనంగా ఇంటి నుండి పంపేయడం..ఇక్కడికి వచ్చేపాటికి రామాయణాన్ని కథకు అచ్చం కుదిరేట్టు అటాచ్ చెయ్యడం..ఇంటి నుంచి పంపేసిన నాయికకు వాల్మీకి
ఆశ్రమంలా ఆశ్రయం దొరకడం..అక్కడ కవలలు పుట్టడం..ఒకనాడు హీరో హీరోయిన్ ఉండే ప్రాంతానికి రావడం..నిదురించే తోటలో పాట ఒకటి పుట్టడం..
తల్లిదండ్రుల కథ తెలుసుకుని
పిల్లలు తండ్రి దగ్గరికి బయలుదేరితే వారికి ఆంజనేయుడు తోడు కావడం..
మొత్తానికి ఎంత నాటకీయంగా
ఒక జంట విడిపోయిందో..
అంతే నాటకీయంగా మళ్ళీ కలిసిపోవడం..నవ్వులు పువ్వులు విరిసి..వెరసి చక్కని
సినిమాగా శుభం కార్డు పడిపోవడం అంతా ఒక చరిత్రగా మారిపోయింది..!

ఈ చరిత్రకు
కర్త బాపు అయితే..
కర్మ ముళ్ళపూడి కాగా..
క్రియ మాత్రం నిస్సందేహంగా
కాంట్రాక్టర్ రావు గోపాలరావు..!

బాపూ ఏమి చెప్పారో..
వెంకటరమణ ఎలా రాసారో..
వాటిని మించి ప్రాణం పోసి
ఆ సినిమాకి ఆయువు పట్టుగా
ఉండిపోయారు
రావు గోపాలరావు..!

ఫస్ట్ ఎప్పియరెన్స్ నుంచి చివరి సన్నివేశం వరకు
సినిమా మొత్తం
రావు గోపాలరావు
చుట్టూనే తిరుగుతుంది.
ఆయన ఒక ప్రత్యేకమైన
డిక్షన్ తో చెప్పిన డైలాగులు
ముత్యాలముగ్గు సినిమాని
వేరే లెవెల్ కి తీసుకుపోయాయి..

ఇక ఈ సినిమాలో ప్రతి పాత్ర
విలక్షణమే..రోజూ మన కళ్లెదుట కనిపించే మనుషులే పాత్రలు..కాకపోతే వాటి మొహాలకు బాపూ మాస్కు..
మాటల్లో ముళ్ళపూడి మార్కు..!

పాత్రలు వేటికీ పెద్దగా
మేకప్ ఉండదు..
అస్సలు ఇమేజ్ లేని
శ్రీధర్ హీరో..
పెద్ద కళ్ళు..నల్లని ఛాయ..
బొద్దు.. కాస్త పొట్టి..కొత్తమ్మాయి సంగీత నాయిక..
జమిందారు కాంతారావు..
ఆయనకో మేనేజర్ ముక్కామల..
ఆ ముక్కామల కూతురేమో
జయమాలిని..
ఈ మాలినిని శ్రీధర్ కి ఇచ్చి పెళ్లి చేస్తే మొత్తం జమిందారీ తన వశమవుతుందని ముక్కామల ఆశ..
అది కాస్త శ్రీధర్ ఆకస్మిక వివాహంతో చెదరిపోగా
ఎలాగైనా జమీందారు కొడుకు పెళ్ళి పెటాకులు చెయ్యాలనే దురుద్దేశంతో కాంట్రాక్టర్ రావు గోపాలరావు సాయం కోరితే..
ఆయన తన దగ్గర సదా సిద్ధంగా ఉండే నిత్య పెళ్ళికొడుకు నూతన్ ప్రసాద్ ను రంగంలోకి దింపి నాటకీయంగా శ్రీధర్ మనసులో
భార్య పట్ల అనుమానం పుట్టించిన వైనం..
అదంతా రామాయణానికి సాంఘిక వర్షన్..బాపూకి
వీజీ ట్రాన్స్మిషన్.. ముళ్ళపూడికి చెయ్యి తిరిగిన కాన్వర్సేషన్..
మధ్యలో మాడా మెరుపు..
దాని కెంత..దీని కెంత..
కన్సెషాన ఏమైనా ఉందా అంటూ ఓ విరుపు..
జిల్లా మొత్తం మీ చేతిలో పెట్టేస్తానని ఇంకో చరుపు..
చేతిలో సిగరెట్టు బలుపు..
కాంట్రాక్టర్ విన్నట్టు కనిపించినా
అనుమానం వచ్చి
ఆ అనుమానం
నిజమని తేలితే
డిక్కీలో తొంగోబెట్టీమని సెరెటరీకి హెచ్చరింపు..
అల్లో అల్లో అంటూ పక్కకి తప్పుకున్న రావు గోపాలరావు పంచె తెలుపు.. నడుమx ముక్కామలకు హలం నడుము చూసి మైమరపు..
సూరీకాంతానికి భర్త కాంట్రాక్టర్ క్యారెక్టర్ పై అంతులేని
వలపు..అల్లు పిచ్చెక్కి చేసిన కోతి చేష్టలు సినిమాకి మలుపు..!

మామ సంగీతంలో
అద్భుతంగా పండిన పాటలు..
ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు..గూటి పడవలో విన్నది కొత్త పెళ్లికూతురు..

గోగులు పూచే గోవులు కాచే ఓలచ్చ గుమ్మాడి..

ఎంతటి రసికుడవో తెలిసేలా..

శ్రీరామ జయరామ సీతారామ..

నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది..కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

ఇలా ముత్యాలముగ్గులో
ప్రతి పాటా
ఒక ఆణిముత్యమే..
శ్రీరామ చిత్రకు సిరుల సంపదే..
బాపూ కొట్టిన అతి పెద్ద హిట్టు..
రావు గోపాలరావు
యుగానికి శ్రీకారం..
నూతన్ ఎరాకు నుడికారం..
తెలుగు సినిమా చరిత్రలో
ఒక సువర్ణ అధ్యాయం..
ముత్యాలముగ్గు..!

(ఎలిశెట్టి సురేష్ కుమార్)
9948546286
7995666286

Share this post
Exit mobile version