Site icon MANATELANGANAA

వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో తగ్గిన మహిళల పై నేరాలు

వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో నియంత్రణలో నేరాలు – సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌

వరంగల్‌:
వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో సమర్థంగా పనిచేయడం వల్ల నేరాలు పెద్దగా పెరగకుండా నియంత్రణలోనే ఉన్నాయని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ తెలిపారు. శనివారం భీమారంలోని శుభం కళ్యాణ వేదికలో వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ వార్షిక నివేదిక–2025 సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా శాంతి భద్రతలపై వార్షిక నివేదిక వివరాలను వెల్లడించిన సీపీ, గత ఏడాదితో పోలిస్తే నేరాలు కేవలం 0.53 శాతం మాత్రమే స్వల్పంగా పెరిగాయని తెలిపారు. గత ఏడాది 14,412 కేసులు నమోదు కాగా, 2025 సంవత్సరంలో 14,456 కేసులు నమోదయ్యాయని చెప్పారు.

నమోదైన కేసుల్లో హత్య చేసి దోపిడీ చేసిన కేసులు 4, దారి దోపిడీ 3, దోపిడీలు 16, దొంగతనాలు 355 ఉన్నాయని వివరించారు. హత్య కేసులు 36 నమోదు కాగా, మానభంగానికి సంబంధించిన కేసులు గత ఏడాది 145 ఉండగా, ఈ ఏడాది 132కు తగ్గినట్లు తెలిపారు. వరకట్న మరణాలు, గృహ హింస వంటి డొమెస్టిక్‌ నేరాలు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. అయితే పోక్సో కేసులు గత ఏడాది 364 ఉండగా, ఈ ఏడాది 405కు పెరిగాయని సీపీ పేర్కొన్నారు.

మహిళలపై నేరాలు తగ్గుముఖం
మహిళలపై నేరాలకు సంబంధించి గత ఏడాది 1,504 కేసులు నమోదయ్యగా, ఈ ఏడాది 1,453 కేసులు మాత్రమే నమోదయ్యాయని తెలిపారు. దీంతో మహిళలపై నేరాలు మొత్తం మీద 3.6 శాతం తగ్గినట్లు సీపీ వెల్లడించారు.

రూ.8.62 కోట్ల మత్తు పదార్థాల స్వాధీనం
ఈ ఏడాది వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో మత్తు పదార్థాల కేసుల్లో 195 కేసులు నమోదు చేసి 482 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి నుంచి రూ.8 కోట్ల 62 లక్షల విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని, ఇందులో సుమారు 1,700 కిలోల గంజాయి ఉన్నట్లు వివరించారు.

చోరీల కేసుల్లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 14 గ్యాంగ్‌లకు సంబంధించి 33 కేసుల్లో 52 మంది నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. ముఖ్యంగా సీసీఎస్‌ విభాగం 84 చోరీ కేసుల్లో సుమారు రూ.79 లక్షల విలువైన చోరీ సొత్తును తిరిగి స్వాధీనం చేసుకుందని తెలిపారు.

ట్రాఫిక్‌, సైబర్‌ నేరాలపై చర్యలు
ట్రాఫిక్‌ కేసుల్లో ఈ ఏడాది 1,424 కేసులు నమోదు కాగా, 430 మంది మృతి చెందగా, 1,446 మంది తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు 34,282 నమోదు కాగా, అందులో 887 మందికి జైలు శిక్ష విధించామని తెలిపారు. సైబర్‌ క్రైమ్‌కు సంబంధించి 630 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

మొత్తంగా వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో 6,040 కేసులు పరిష్కరించగా, 2,573 మందికి శిక్షలు ఖరారయ్యాయని సీపీ తెలిపారు. ఇందులో 16 మందికి జీవిత ఖైదు, మరో ముగ్గురికి 20 సంవత్సరాల జైలు శిక్షలు విధించబడ్డాయని చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే నేరస్తులకు విధించిన శిక్షలు 3 శాతం పెరిగాయని వివరించారు.

టాస్క్‌ఫోర్స్‌ పనితీరు ప్రశంసనీయం
ప్రధాన నేరాల నియంత్రణలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల పనితీరు అభినందనీయమని సీపీ ప్రశంసించారు. ఈ విభాగం 418 కేసుల్లో 978 మందిని అరెస్టు చేసి, సుమారు రూ.14.80 కోట్ల విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

రాబోయే నూతన సంవత్సరంలో ప్రజల సహకారంతో మరింత సమన్వయంతో పనిచేస్తూ నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, శాంతి భద్రతల పరిరక్షణే వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ప్రధాన లక్ష్యమని సీపీ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో డీసీపీలు రాజమహేంద్ర నాయక్‌, కవిత, ఏఎస్పీ చేతన్‌, అదనపు డీసీపీలు రవి, ప్రభాకర్‌, శ్రీనివాస్‌తో పాటు ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు పాల్గొన్నారు.

Share this post
Exit mobile version