Site icon MANATELANGANAA

భారత్–పాక్ కాల్పుల విరమణపై కలకలం రేపిన బ్రహ్మ చెల్లానే విమర్శలు

brmha chelline

న్యూఢిల్లీ,మే12,2025 : భారత్–పాక్ మధ్య తాజా కాల్పుల విరమణ ఒప్పందంపై ప్రముఖ జియో స్ట్రాటెజిస్టు బ్రహ్మ చెల్లానే చేసిన వ్యాఖ్యలు కల కలం రేపాయి. ఇప్పటికే ఈ నిర్ణయంపై భారత ప్రజలలో అసంతృప్తి వ్యక్తమవుతుండగా, చెల్లానే వ్యాఖ్యలు మరింత ధృడమైన చర్చకు దారితీశాయి.

ఇండియా టుడేతో ప్రత్యేకంగా మాట్లాడిన బ్రహ్మ చెల్లానే, “మోదీ ప్రభుత్వం కాల్పుల విరమణకు ఒప్పుకుంటుందని అసలు ఊహించలేదు. ఇది దేశానికి ఒక వ్యూహాత్మక వెనకడుగుగా కనిపిస్తోంది,” అని అన్నారు. శనివారం ఉదయం సరిహద్దులో పాక్ సైన్యం కదలికలు ప్రారంభించగా, భారత సైన్యం హై అలర్ట్‌కు వెళ్లిందని, అప్పటి వాతావరణం యుద్ధానికి మించి లేదన్నంత తీవ్రంగా మారిందని గుర్తు చేశారు. అయితే, అదే సమయంలో అకస్మాత్తుగా కాల్పుల విరమణ ప్రకటించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

“ప్రస్తుతం పరిస్థితులు భారత్‌కు అనుకూలంగా ఉన్నాయి. పాకిస్థాన్ సైన్యం బలహీనతలు బహిరంగమయ్యాయి. వారు ప్రయోగించిన మిస్సైళ్లు, డ్రోన్లను భారత సైన్యం సమర్థవంతంగా ఎదుర్కొంది. అంతే కాక, భారత్ ప్రయోగించిన పరిమిత మిస్సైళ్లు, డ్రోన్లు లక్ష్యాలను విజయవంతంగా ఛేదించాయి. ఇలా మన సైన్యం స్పష్టంగా పైచేయి సాధిస్తున్న సమయంలో విరమణ ఒప్పందానికి మోదీ ప్రభుత్వం ఎందుకు సిద్ధపడింది అనేది అర్థం కావడం లేదు,” అంటూ ప్రశ్నలు సంధించారు.

చెల్లానే వ్యాఖ్యానిస్తూ, “ఇది భారత రాజకీయాల చరిత్రలో ఒక తరచుగా పునరావృతమయ్యే తత్వానికి నిదర్శనం. గెలుపు అంచుల వద్ద వెనక్కి తగ్గడం మనకి అలవాటైపోయింది,” అన్నారు. భారత ప్రభుత్వం చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోలేకపోతోందని, గతంలో చేసిన వ్యూహాత్మక తప్పిదాలను మళ్లీ పునరావృతం చేస్తున్నదని విమర్శించారు.

ఈ సందర్భంగా ఆయన పలు ఉదాహరణలు కూడా ఇచ్చారు. 1972లో పాకిస్థాన్‌తో చర్చలు చేసినా ఎలాంటి లాభం లభించలేదని, 2021లో కైలాశ్ పర్వతాలను ఎటువంటి ఒప్పందం లేకుండానే ఖాళీ చేశామన్నారు. లద్దాఖ్‌లో చైనా సూచించిన బఫర్ జోన్లను స్వీకరించడమూ ఒక వ్యూహాత్మక తప్పిదమేనని అన్నారు.

పహల్గాం దాడిలో 26 మంది జవాన్లు అమరులైన తర్వాత ప్రారంభించిన “ఆపరేషన్ సిందూర్‌”కు ఇంత త్వరగా ముగింపు ఇవ్వడం అనేక సందేహాలకు తావిస్తోందని తెలిపారు. “పాకిస్థాన్ నుంచి మిస్సైళ్లు వచ్చినా, కాల్పులు జరిగినా పట్టించుకోకుండా విరమణకు ఒప్పుకోవడం అత్యంత ఆశ్చర్యకరం. చరిత్ర ఈ నిర్ణయాన్ని క్షమించదు,” అని తీవ్రంగా స్పందించారు.

మొత్తానికి బ్రహ్మ చెల్లానే వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వ వైఖరిపై వ్యూహాత్మకంగా పలు ప్రశ్నలు లేవనెత్తినట్టు స్పష్టమవుతోంది. కాల్పుల విరమణ అనేది శాంతికి పిలుపు కాదా, లేదా వ్యూహాత్మక వెనకడుగా అన్నది దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపింది.

Share this post
Exit mobile version