జయ జయహే తెలంగాణ గీతం ద్వారా రాష్ట్ర ప్రజలను ఏకం చేసిన అందెశ్రీకి ప్రభుత్వ గౌరవం
అందెశ్రీ కుమారుడికి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
హైదరాబాద్:
జయ జయహే తెలంగాణ గీతం ద్వారా తెలంగాణ ప్రజలను ఏకం చేయడంలో కీలక పాత్ర పోషించిన విప్లవ కవి, గేయ రచయిత అందెశ్రీ సేవలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించిందని డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. అందెశ్రీ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలనే నిర్ణయంలో భాగంగా ఆయన కుమారుడు దత్త సాయికి ఉన్నత విద్యాశాఖ పరిధిలోని డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియామకం చేసినట్లు శాసన మండలిలో వెల్లడించారు.
- సమ్మక్క సారలమ్మ లను దర్శించుకున్న ప్రముఖులు
- ప్రసిద్ధ పుణ్య క్షేత్రంగా మేడారం -మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- తల్లుల రాకతో పులకించిన మేడారం
- జాతరలో హిజ్రాల హల్ చల్
- సమ్మక్క తల్లి ఆగమనం
సిద్దిపేట జిల్లా రేపర్తి గ్రామానికి చెందిన అందెశ్రీ (అందే ఎల్లయ్య) అనాధగా, పశువుల కాపరిగా జీవితాన్ని ప్రారంభించి అనేక కష్టనష్టాలను అధిగమిస్తూ గేయ రచయితగా ఎదిగారని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. ఎటువంటి అధికారిక విద్యా అర్హతలు లేకున్నా, తెలంగాణ గ్రామీణ జీవనం, అణగారిన వర్గాల జీవితాలను ప్రతిబింబించేలా దాదాపు మూడు వేల కవితలు, గేయాలు రచించారని తెలిపారు.
తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు, పోరాటాలకు స్వరంగా నిలిచిన అందెశ్రీ రచించిన “జయ జయహే తెలంగాణ” గీతం ఉద్యమ కాలంలో రాష్ట్ర ప్రజలను ఒక్కతాటిపైకి తీసుకువచ్చిందన్నారు. కార్మికులు, రైతులు, పీడిత వర్గాల భావోద్వేగాలను ప్రతిబింబించిన ఆయన గేయాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచాయని పేర్కొన్నారు. అందెశ్రీ వారసత్వం తెలంగాణ అంతటా చిరస్థాయిగా కొనసాగుతుందని భట్టి విక్రమార్క తెలిపారు.
అందెశ్రీ రచించిన జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2024 జూన్ 2న జీఓ నంబర్ 783 ద్వారా ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. ఆయన అకాల మరణంతో కుటుంబం ఎదుర్కొన్న సామాజిక, ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మానవీయ దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇది సామాజిక న్యాయం, పరిపాలనా ప్రమాణాలకు అనుగుణమైన చర్యగా వివరించారు.
తెలంగాణ సమాజంలో కవులు, కళాకారులు పీడిత ప్రజల విముక్తి, సమ సమాజ నిర్మాణం కోసం తమ జీవితాలను అంకితం చేశారని, అలాంటి ఆశయాలను రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే అనేక మంది కళాకారులను ప్రభుత్వం గౌరవిస్తూ వచ్చిందన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో విస్తృతంగా వినిపించిన జయ జయహే తెలంగాణ గీతానికి, ఆ గేయాన్ని రచించిన వ్యక్తికి గత పాలకులు తగిన గౌరవం ఇవ్వలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ గేయాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించి అందెశ్రీకి తగిన గుర్తింపు కల్పించిందని చెప్పారు. అందెశ్రీ రచించిన “మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు” అనే భావనను స్ఫూర్తిగా తీసుకుని ఈ ప్రభుత్వం మానవత్వంతో పనిచేస్తుందని అన్నారు.
అందెశ్రీ కుమారుడు దత్త సాయికి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం కల్పిస్తూ 2025 నవంబర్ 25న ఆర్డినెన్స్ నంబర్ 7 జారీ చేశామని తెలిపారు. ఆ రోజు శాసన మండలి సమావేశం లేకపోవడంతో, ఈ రోజు ఆ ఆర్డినెన్స్‌ను సభ్యులందరి ఏకగ్రీవ ఆమోదంతో ధృవీకరించడం హర్షణీయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పేర్కొన్నారు.

