Site icon MANATELANGANAA

హనుమకొండలో “అద్భుత ప్రపంచంలోకి మా ప్రయాణం” యాత్రా రచన ఆవిష్కరణ

హనుమకొండ: మిత్రమండలి వరంగల్ ఆధ్వర్యంలో ఆదివారం (మార్చి 15, 2026) ఉదయం పోస్టల్ కాలనీ సుబేదారి హనుమకొండలోని అభయాంజనేయ స్వామి ఆలయ ఆవరణలో ప్రముఖ సామాజికవేత్త రంగరాజు శ్యామ్ సుందర్ రావు రచించిన “అద్భుత ప్రపంచంలోకి మా ప్రయాణం” యాత్రా రచన గ్రంథాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా అంపశయ్య నవీన్ మాట్లాడుతూ యాత్రా రచనల ద్వారా కేవలం ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడం మాత్రమే కాకుండా, ఆ ప్రాంతాల సంస్కృతి, జీవన విధానాలను పాఠకుల ముందుకు తీసుకురావడం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఆ దిశగా అందరూ చదివేలా ఈ రచనను అందించిన శ్యామ్ సుందర్ అభినందనీయులని అన్నారు.

సభకు అధ్యక్షత వహించిన వి.ఆర్. విద్యార్థి మాట్లాడుతూ తాను కూడా అనేక ప్రాంతాలు సందర్శించిన అనుభవంతో ఈ పుస్తకాన్ని చదివినప్పుడు రచయిత అక్కడి సంస్కృతిని సమగ్రంగా ప్రతిబింబించారని పేర్కొన్నారు.

గిరిజ మనోహర్ బాబు మాట్లాడుతూ యాత్రా రచనలకు తెలుగు సాహిత్యంలో ఎంతో గొప్ప సంప్రదాయం ఉందని తెలిపారు. అల్లసాని పెద్దన కాలంలోనే ఇలాంటి రచనలకు అంకురార్పణ జరిగిందని, తరువాతి కాలంలో కూడా పలువురు రచయితలు ఈ ప్రక్రియను కొనసాగించారని చెప్పారు. యాత్రా రచయితలు ఒక విధంగా సంస్కృతిక రాయబారులని అభిప్రాయపడ్డారు.

నాగిళ్ల రామశాస్త్రి మాట్లాడుతూ యాత్రా రచనలను చదవడం ద్వారా పాఠకులకు అక్కడికి వెళ్లిన అనుభూతి కలుగుతుందని తెలిపారు.

మల్యాల మనోహర్ రావు మాట్లాడుతూ రచయిత శ్యామ్ సుందర్‌తో తనకు ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

పొట్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ జీవితం ఒక ప్రయాణమైతే, ఆ ప్రయాణంలో చూసిన అనుభవాలను రచనగా మలిచినప్పుడు ఆ రచయిత పేరు తరతరాలకు నిలిచిపోతుందని అన్నారు.

వేముగంటి శుక్తిమతి మాట్లాడుతూ సహ రచయితగా తనకు ఉన్న అనుబంధాన్ని వివరించి, ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు ఎన్నో నరసింహారెడ్డి, వాసిరెడ్డి కృష్ణారావు, మండవ రవీందర్ రావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

Share this post
Exit mobile version