రెండు జిల్లాలను కలిపి వరంగల్ జిల్లాగా మార్చండి
మహానగర ప్రజా సంఘాల, మేధావుల విజ్ఞప్తి
చారిత్రక నగరంగా ఉన్న వరంగల్ ను హనుమకొండ, వరంగల్ జిల్లాలుగా విభజించి వరంగల్ మహానగరంతో పాటు, హనుమకొండ, వరంగల్ జిల్లాల అభివృద్ధిని కుంగ దీసారని రెండు జిల్లాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని హనుమకొండ, వరంగల్ జిల్లాలను కలిపి వరంగల్ జిల్లాగా మార్చాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ అన్నారు. రెండు జిల్లాల ప్రజా సంఘాలు, మేధావులు బుధవారం హనుమకొండ జిల్లా కేంద్రం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే వరంగల్ నగరం అభివృద్ధి కేంద్రంగా హైదరాబాద్ మహానగరం లాగా ఎదిగి అతిపెద్ద అభివృద్ధి కేంద్రంగా ఏర్పడి అభివృద్ధి చెందుతుందని నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగులు బుద్ధి జీవులు ఆశించారని, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో వరంగల్ కేంద్రంగా ఉద్యమకారులు, వ్యాపారస్తులు పారిశ్రామిక వేత్తలు, యువత ఆశలు పెంచుకున్నారు కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత కల్వకుంట్ల పాలనలో వరంగల్ ను ఆరు జిల్లాలుగా ముక్కలు చుక్కలుగా చేసి చారిత్రక నేపథ్యాన్ని, భౌగోళిక ఐక్యతను, అభివృద్ధి క్రమాన్ని, రాజకీయ చైతన్యాన్ని సాంస్కృతిక గంభీరత్వాన్ని ధ్వంసం చేశారని, ఆశాస్త్రీయ చర్యకు పాల్పడి రెండు ముక్కలుగా విభజించి ఈ ప్రాంత ప్రజలకు తీవ్ర అన్యాయం చేసారని అన్నారు. వరంగల్ నగరాన్ని ముక్కలు చేయకూడదని 2017 సంవత్సరంలో ఉద్యమకారులు, మేధావులు, విద్యార్థులు ర్యాలీలు నిర్వహించినప్పటికీ ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అహంకారంతో లెక్కచేయ లేదని అన్నారు. ప్రజా వ్యతిరేకమైన ఈ చర్యను ఆనాటి ప్రజా ప్రతినిధులు కూడా ప్రశ్నించ లేకపోయారని, వరంగల్ ఉనికిని, అభివృద్ధిని అణిచి వేయాలని వరంగల్ ఉమ్మడి జిల్లా నాయకత్వాన్ని నిర్వీర్యం చేసే రాజకీయ కుట్రతో ఈ జిల్లాను విధ్వంసం చేయడం జరిగిందన్నారు. జిల్లాను ఆరు జిల్లాలుగా ఏర్పాటు చేయడం వల్ల గత కాలము నుండి వారసత్వంగా వస్తున్న వృత్తులు, పరిశ్రమలు ధ్వంసం చేయబడ్డాయని అజమ్ జాహి మిల్లు భూములను అమ్మకానికి పెట్టారని, తోళ్ళ పరిశ్రమ మూసివేసినారని, బీడీ పరిశ్రమ అంతరించిపోయిందని, కాకతీయ టెక్స్ టైల్ పార్క్ నామమాత్రంగా మిగిలిపోయిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఫోరం ఫర్ బెటర్ వరంగల్ అధ్యక్షులు పుల్లూరి సుధాకర్ మాట్లాడుతూ సకల అభివృద్ధి రంగాలను సమ ఉజ్జిగా అభివృద్ధి జరిగినప్పుడే సమగ్ర అభివృద్ధి జరుగుతుందని, హైదరాబాద్ వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ ను కాలగర్భంలో కలిసిపారని, కాకతీయ యూనివర్సిటీ, ఎల్బీ కళాశాల, సికెఎం లాంటి విద్యా కేంద్రాలు నిర్లక్ష్యానికి గురి అయ్యాయనని, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న వరంగల్ ప్రజలకు మిగిలింది ఏంటో ఈ ప్రాంత పాలకులు ఆలోచించాలని అన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలందరూ పెద్ద మనసుతో అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయే దిశలో రెండు జిల్లాలను కలిపి ఒకే జిల్లా చేసే పోరాటంలో కలిసిరావాలని అన్నారు. వరంగల్ మహా నగరాన్ని ఒకే జిల్లాగా చేసి కోయంబత్తూర్, నాగపూర్ పూణే, విశాఖపట్నం లాగా హైదరాబాదు నగరానికి సమాంతరంగా ఎదిగే విధంగా చేయకుంటే ఈ ప్రాంతం నిరుద్యోగులతో ఎడారిగా మారే ప్రమాదమున్నదని అన్నారు. గత పది సంవత్సరాలలో మొత్తం ఉమ్మడి జిల్లాలో ఎలాంటి పెట్టుబడులు రాక నిర్లక్ష్యానికి గురై ఉపాధి, ఉద్యోగ, ఆదాయ వృద్ధిలో రాష్ట్రంలో కరీంనగర్, ఖమ్మం సిద్దిపేట పట్టణాల కంటే వరంగల్ నగరం వెనుకబడి పోయిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర కన్వీనర్ సోమ రామమూర్తి మాట్లాడుతూ 33 జిల్లాల అభివృద్ధిని సూచిలో 25 నుండి 33 స్థానాల్లో వరంగల్ ఉమ్మడి జిల్లాలు కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాను నిర్లక్ష్యం చేయడం వల్లనే గత పాలకులను శాసనసభ ఎన్నికలలో ఓడించడం జరిగిందని, ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు సమిష్టిగా కృషిచేసి వరంగల్ మహానగరాన్ని ఒకే జిల్లాగా మార్చి ఉత్తర తెలంగాణ ప్రాంత అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులందరూ విభేదాలను విస్మరించి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశలో సమిష్టిగా కృషి చేయాలని, హైదరాబాద్ జిల్లాలో 19 నియోజకవర్గాలు ఉన్నాయని, ఏ ఇతర జిల్లాను విధంగా విభజించలేదని, వరంగల్ కార్పొరేషన్ ను మహానగరంగా మార్చడం కోసం 40 గ్రామాలను విలీనం చేశారని, తర్వాత ఆ మహానగరాన్ని జిల్లాల పేరుతో ముక్కలు చేయడం సరికాదని అన్నారు. వరంగల్ మహానగరాన్ని ఒకే జిల్లా గొడుగు కిందకి తేవడానికి ప్రొఫెషనల్స్, ఇతర సంఘాలను అన్ని రాజకీయ పార్టీల సహకారము తీసుకొని ప్రజా ఉద్యమం చేయడానికి త్వరలోనే సమాయత్తం చేస్తున్నామని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా వరంగల్ తూర్పు నియోజకవర్గ మేధావులు, కార్మిక సంఘాలు కర్షక, వ్యాపార, పారిశ్రామిక వేత్తలు పెద్ద మనసుతో ఆలోచించాలన్నారు. వరంగల్ తూర్పు అభివృద్ధికి కావలసిన అన్ని చర్యలు తీసుకోవలసిన అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలన్నారు.
ఈ పాత్రికేయ సమావేశంలో ఫోరమ్ ఫర్ బెటర్ వరంగల్ అధ్యక్షులు పుల్లూరు సుధాకర్, తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర కన్వీనర్ సోమ రామమూర్తి, ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్, హనుమకొండ రెడ్ క్రాస్ నాయకులు బొమ్మినేని బాపిరెడ్డి, జాతీయ బి.సి సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బట్టి శ్యామ్ యాదవ్, రిటైర్డ్ అధ్యాపకులు వీరమల్ల బాబురావు, జి యాదగిరి తదితరులు పాల్గొన్నారు