Site icon MANATELANGANAA

సింగపూర్‌లో వెంకయ్య నాయుడుతో ఆత్మీయ సమావేశం

సింగపూర్‌లో శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో ఆత్మీయ సమావేశం జరిగింది. శుక్రవారం సాయంత్రం నేషనల్ పబ్లిక్ స్కూల్ ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 400 మంది పాల్గొన్నారు.

కార్యక్రమానికి సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్ అధ్యక్షత వహించారు. శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ ప్రారంభం నుంచే వెంకయ్య నాయుడి ఆశీస్సులు, మార్గదర్శకత్వం లభిస్తున్నాయని తెలిపారు. కుటుంబంతో విహారయాత్రగా సింగపూర్‌కు వచ్చినప్పటికీ తెలుగు ప్రజల కోసం సమయం కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి హాజరైన సింగపూర్ భారతీయ హైకమిషనర్ డా. శిల్పక్ అంబులేకు కూడా ధన్యవాదాలు తెలిపారు.

వెంకయ్య నాయుడు మాట్లాడుతూ కుటుంబం, సమాజం, దేశంలో ఐక్యత ఉంటేనే శాంతి, అభివృద్ధి సాధ్యమని చెప్పారు. ఎన్నికల వరకే రాజకీయ పోటీ ఉండాలని, ఆ తర్వాత అందరం భారతీయులమేనని అన్నారు. విదేశాల్లో నివసిస్తున్న వారు అక్కడి నిబంధనలను గౌరవిస్తూ, తమ మూలాలను మరిచిపోకూడదని సూచించారు.

ఆరోగ్యకర జీవనశైలిలో భాగంగా యోగా, వ్యాయామం, సంప్రదాయ ఆహారం ప్రాముఖ్యతను వివరించారు. పిల్లలను క్రీడలు, సంగీతం వంటి కళల్లో ప్రోత్సహించాలని అన్నారు. పండుగలు ఐక్యతకు వేదికలని పేర్కొన్నారు. చరిత్రలోని వక్రీకరణలను సరిచేసి మన వీరుల గాథలను నేటి తరానికి తెలియజేయాలని చెప్పారు. భారత ప్రజాస్వామ్యం, ఆర్థిక వ్యవస్థపై అవాంఛిత వ్యాఖ్యలను విమర్శించారు. ఏఐ వినియోగాన్ని ఆపలేమని, దుర్వినియోగాన్ని అరికట్టేందుకు నియంత్రణ అవసరమని సూచించారు.

“మా తెలుగు తల్లికి” గీతంతో కార్యక్రమం ప్రారంభమైంది. తెలంగాణ కల్చరల్ సొసైటీ, తెలుగుదేశం ఫోరమ్, కాకతీయ సంస్కృతిక పరివారం, APNRT ప్రతినిధులు వెంకయ్య నాయుడిని సన్మానించారు. హాల్‌ను సమకూర్చిన కొత్తమాస్ వెంకటేశ్వర రావు (KV Rao, SIFAS), నేషనల్ పబ్లిక్ స్కూల్ సిబ్బంది, స్పాన్సర్లు మరియు వాలంటీర్లకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

గాయకులు, కళాకారులను వెంకయ్య నాయుడు శాలువాలతో సత్కరించారు. కార్యక్రమానికి సుబ్బు వి. పాలకుర్తి వ్యాఖ్యానం అందించగా, సాంకేతిక సహకారం, వాలంటీర్ సేవలతో కార్యక్రమం విజయవంతమైంది. అనంతరం విందు భోజనంతో కార్యక్రమం ముగిసింది.

సింగపూర్‌లో వెంకయ్య నాయుడుతో ఆత్మీయ సమావేశం
Share this post
Exit mobile version