పలుకే బంగార మాయెనా….?
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై తన స్వరాన్ని మెల్లగా సవరించుకుంటున్నాడు.
ఇటీవల వరకూ వాణిజ్య సుంకాలు, రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన, ఇప్పుడు స్నేహపూర్వక వ్యాఖ్యలు చేస్తున్నారు.
తాజాగా తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్’లో పోస్ట్ చేసిన ట్రంప్ మాట్లాడుతూ, అమెరికా-భారత్ మధ్య వాణిజ్య సమస్యలను పరిష్కరించడానికి తన బృందం చర్చలు కొనసాగిస్తోందని తెలిపారు.
ఈ అంశంపై త్వరలోనే భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు. ఈ చర్చలు రెండు దేశాలకు మంచి ఫలితాలు ఇస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇటీవల షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌లతో సమావేశం కావడం పట్ల ట్రంప్ కఠిన వ్యాఖ్యలు చేశారు. భారత్ చైనా వలలో పడుతోందని విమర్శించారు. అయితే, కొద్ది గంటల్లోనే తన మాటలు మార్చి, భారత్-అమెరికా సంబంధాలు ఎంతో ప్రత్యేకమని, ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు.
ప్రధాని మోదీని ట్రంప్ ప్రశంసలతో ముంచెత్తుతూ, ఆయన గొప్ప నాయకుడని కొనియాడారు. మోదీ తన మిత్రుడని, ఎప్పుడూ స్నేహపూర్వకంగా ఉంటానని పేర్కొన్నారు.