Site icon MANATELANGANAA

మరుగునపడ్డ మన వీరతెలంగాణ స్వాతంత్ర సమర యోధులు .

మరుగునపడ్డ మన వీరతెలంగాణ స్వాతంత్ర సమర యోధులు ….

బాలెంల కటకం పిచ్హయ్య, ఉరుమడ్ల చొల్లేటి రామాచారి. రామన్నగూడెం మోరా బ్రహ్మయ్య… ఇలా ఎందరో


    తెలంగాణా రైతుల సాయుధ పోరాటం (1946-1951) భూస్వాముల దోపిడీకి, జాగీర్దార్ల అన్యాయాలకు వ్యతిరేకంగా జరిగిన మహా రైతాంగ తిరుగుబాటు. ఈ మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభమై సరిగ్గా 75 సంవత్సరాలు. ప్రపంచ ఉద్యమాల చరిత్రలో తెలంగాణా సాయుధ పోరాటానికి ప్రత్యేకత ఉంది. ఈ ఉద్యమంలో సుమారు 4,000 మంది రైతులు చంపబడ్డారు.  10,000 మందికి పైగా రైతు నాయకులను  3-4 సంవత్సరాలు జైళ్లలో ఉంచారు. సుమారు 50,000 మంది రైతులు, పోరాట సానుభూతిపరులను డిటెన్షన్ క్యాంపుల్లో (ఓపెన్ జైళ్లు లాంటివి) ఉంచారు. 5,000 మందికి పైగా సంవత్సరాల పాటు జైళ్లలో బంధించారు. వేలాది మంది కట్టు,  బట్టలతో  ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. 
     కారంపొడితో, రోకలి బండలు ఎత్తిన పల్లెలు.. వీరుల గన్నమ్మో ఇది వీర తెలంగాణ." బాంచన్ నీ కాల్మొక్త అని జోడించిన చేతులు బందూకు చేతబట్టి నిజాం నిరంకుశ పాలనపై సాగించిన సమరంఇప్పటికీ, ఎప్పటికీ  స్ఫూర్తిదాయకం
  తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో చరిత్ర కెక్కని బడుగు బలహీన వర్గాల యోధులపై ఇప్పటికీ మరింత పరిశోధన జరగాల్సిన  అవసరం ఉంది. ప్రసిద్ధి చెందిన కొద్దిమంది పేర్లతోనే ఈ పోరాట  చరిత్రను ముగించలేం. గ్రామాల మట్టిలో కలిసిపోయిన ఎన్నో పేర్లు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. చరిత్ర కెక్కని యోధుల  కథలను వెలికి తీయడం అంటే గతాన్ని మాత్రమే గుర్తు చేసుకోవడం కాదు. చరిత్రను ఎవరు రాశారు? ఎవరి అనుభవాలు నమోదు కాలేదు? ఎవరి త్యాగాలు కుటుంబ జ్ఞాపకాలకే పరిమితమయ్యాయి? అనే ప్రశ్నలను కూడా అడగడం. వీరి  పోరాట చరిత్రను చరిత్రలో ప్రముఖంగా ఉన్న నాయకుల చరిత్రకు అనుబంధంగా కాకుండా, స్వతంత్ర చారిత్రక ప్రవాహంగా చూడాలి. అప్పుడే తెలంగాణ సాయుధ పోరాటం సంపూర్ణంగా కనిపిస్తుంది. 
  ఈ నేపథ్యంలో తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటంలో కీలకపాత్ర ఉన్న  మా కుటుంబానికి అత్యంత సన్నిహిత బంధువులైన ముగ్గురి పోరాట చరిత్రను క్లుప్తంగా తెలియచేస్తాను. 

బాలెంల యోధుడు కటకం పిచ్హయ్య

  నైజామ్ రాష్ట్రంలో రజాకార్లకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల పిలుపు మేరకు పోరాడిన తెలంగాణా గ్రామాల్లో ప్రధానమైనది బాలెంల గ్రామము.  ప్రస్తుత సూర్యాపేట జిల్లా సమీపంలోని బాలెంల గ్రామానికి చెందిన కటకం పిచ్చయ్య తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకార్లను ఎదిరించడంలో ముందు వరుసలో ఉన్నారు. మంచి ఆసామిగా ఉన్న కటకం  పిచ్హయ్య కమ్యూనిస్టు సిద్ధాంతాలను త్రికరణ శుద్దితో పాటించి రజాకార్లను ఎదిరించే సాయిధ దళాల్లో చేరి చురుకుగా పాల్గొన్నాడు.  ఈనేపథ్యంలో  1947 జేష్ట మాసం బహుళ షష్టి రోజు, అంటే దాదాపు జూన్ మాసంలో వస్తుంది. ఈ రోజున రజాకార్లు రైతాంగ పోరాట యోధులకై బాలెంల గ్రామంలో వెతకగా, ఒక బ్రాహ్మణుల ఇంట్లో తలదాచుకున్న కటకం పిచ్చయ్యతో సహా కామ్రేడ్లు  గార్లపాటి అనంత రెడ్డి, కా.పటేల్ మట్టారెడ్డి, కా.గవ్వ రాంరెడ్డి, కా.మేకల ముత్తయ్య, కా.పటేల్ అమృత రెడ్డి, కా.కన్నెబోయిన మల్లయ్య లతో సహా  మరో ఐదుగురిని పట్టుకుపోయి సమీపంలోని ఎనుమాముల పల్లె శివారులోని గుట్టల వద్ద కాల్చి వేశారు.     అప్పుడు కటకం పిచ్చయ్య భార్య కటకం మాణిక్యమ్మ గర్బంతో ఉంది.  కటకం మాణిక్యమ్మ తన చంటి  పిల్లవాడిని  ఎన్నో కష్టాలు పడి పెంచింది.   కమ్యూనిస్టు సిద్ధాంతాలను, విలువలను  కడవరకూ పాటించిన మాణిక్యమ్మ స్వతంత్ర సమర యోధులకు ఇచ్చే పింఛను కూడా తీసుకోలేదు. కటకం పిచ్చయ్య, మాణిక్యాంబ ఒక్కగానొక్క కొడుకు కటకం రాజాచారి అనంతర కాలంలో హైదరాబాద్ మౌలాలీలోని HMT బేరింగ్ కంపెనీలో ఉద్యోగిగా చేరి ట్రేడ్ యూనియన్ నాయకుడిగా సేవలందించారు. ప్రస్తుతం విశ్రాంత ఉద్యోగిగా మౌలాలి హోసింగ్ బోర్డు లో నివాసముంటున్నారు. 

   *ఉరుమడ్ల చొల్లేటి (అవుసలి)  రామాచారి*   

ఈ కోవలోనే, ఎందరో వెలికిరాని, మరుగున పడ్డ స్వతంత్ర సమర యోధుల్లో ఒకరు చొల్లేటి రామాచారి గారు. వీరిని అవుసలి రామాచారి గా పిలుస్తారు. పోరాటాల ఖిల్లా నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన రామాచారి నైజాం కు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేయడంతో పాటు స్వతాహాగా ఉపాధ్యాయుడైనందున అనేక మంది వయోజనులను, యువతను రాత్రి బడుల ద్వారా అక్షరాస్యులను చేసి వారిలో స్వాతంత్ర కాంక్షను రేకెత్తించారు. ఒక్క ఉరుమడ్ల గ్రామమే కాకుండా పరిసర గ్రామాలైన ఎలికట్టె, సంగెమ్ చిన్న కాపర్తి, వెలువర్తి, చౌటుప్పల్ తదితర గ్రామాల్లో అనేక మందిని అక్షరాస్యులను చేశారు.
చిట్యాల మండలంలో చైతన్యానికి మరోపేరైన ఉరుమడ్ల గ్రామంలో 1928 జూన్ 18 వ తేదీన చొల్లేటి నారాయణ చారి, వెంకటమ్మ దంపతులకు రామాచారి జన్మించారు. తన పాఠశాల విద్య పూర్తి అవుతుండగానే మిర్యాలగూడలో ఎలిమెంటరీ టైనింగ్ కోర్స్ ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేశారు. వెంటనే ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది. ముందుగానే చెప్పినట్టే, టీచర్ ఉద్యోగాన్ని తన గ్రామంతోపాటు ఉద్యోగ భాద్యతలు నిర్వర్తించిన ప్రాంతాల్లో యువతను, నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా చేయడం వారికి రాష్ట్ర విముక్తి పోరాటాల చైతన్య కార్యక్రమాలను రహస్యంగా చేపట్టారు.
కాగా అప్పటికే, నైజాం వ్యతిరేక పోరాటంలో అగ్రగామిగా ఉన్న నర్రా రాఘవ రెడ్డి, సీతాంరాజు, నాతి చినమల్లయ్య, చెన్నోజు పుష్పగిరి (చిట్యాల ), సుంకరి లింగయ్య, కంచర్ల రాంరెడ్డి తదితర సహచర ఉద్యమ కారులతో కలసి నిజాం వ్యతిరేక పోరాటాల్లో భాగస్వాములయ్యారు. వీరి హయంలో జరిగిన ఈ క్రింది పోరాటాలన్నింటిలో ప్రత్యేకంగా, పరోక్షంగా పాల్గొన్నారు.
ఈ ఉద్యమాలలో ప్రధానమైన 1946 జూలై 4 నుండి 1947 జూన్ 12 భూస్వాములు,దొరలకు వ్యతిరేకంగా సాయుధ పోరాటంలోనూ, 1947 జూన్ 12 నుండి 1948 సెప్టెంబర్‌ 17 వరకు జరిగిన నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటంలోనూ, 1948 సెప్టెంబర్‌ 17 – 1951 అక్టోబర్‌ 21 : భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలోనూ చొల్లేటి రామాచారి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ పాల్గొన్నారు.
దీనితో, అప్పటి నిజాం ప్రభుత్వం రామాచారికి దేశద్రోహ చట్టం కింద నల్గొండ జైలుకు పంపించింది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని జైలులో దాదాపు నెల రోజుల కారాగార శిక్ష అనుభవించాడు. చొల్లేటి రామాచారి నైజాం రాష్ట్ర విముక్తి లోభాగం చేసిన పోరాటాలను అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ స్వతంత్ర సమర యోధుడిగా గుర్తించి 1984 నవంబర్ ఒకటవ తేదీన స్వతంత్ర సన్మాన్ సైనిక్ పింఛన్ ను మంజూరి చేసింది. ముందు నుండి జాతీయ భావాలు కలవాడిగా, నిజాం వ్యతిరేక పోరాటంలో తన వంతు కీలక పాత్ర వహించిన రామాచారి గారు స్వాతంత్య్రానంతరం తాను ఉద్యోగ భాద్యతలు నిర్వహించిన సంగెమ్ గ్రామంలో జాతిపిత మహాత్మా గాంధీ, కస్తూరి భాయి విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాలు ఇప్పటికీ గ్రామంలో ఉన్నాయి.
ప్రస్తుతం తెలంగాణా శాసన మండలి చైర్మన్ గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త ముత్యం రెడ్డి లతో సహా ఎందరో రామాచారి శిష్యులుగా ఉన్నారు. రామాచారి గారి పెంపకంలోవారి మార్గదర్శకంలో పెరిగిన వారి కుమారుడు బాలరాజు ఉన్నత విద్య అభ్యసించి పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా గ్రూప్ 2 ఏ ద్వారా ఎంపికై 1990 లో సహకార శాఖలో అత్యున్నత అడిషనల్ రిజిస్ట్రార్ కాడర్ అధికారి స్థాయికి చేరుకొని ఇటీవలే ఉద్యోగ విరమణ చేశారు.
నైజాం విముక్తి పోరాట యోధుడిగా, ఉత్తమ ఉపాధ్యాయుడిగా, గాంధీజీ సిద్ధాంతాల ప్రచారకుడిగా తన జీవితాన్ని ధారపోసిన అవుసలి రామాచారి చొల్లేటి (కేంద్ర ప్రభుత్వ రికార్డులో ఇదే విధంగా పేరు ఉంది ) 16 4 .1997 న కాలధర్మం చెంది మరుగున పడ్డ మహనీయుల్లో ఒకరిగా చరిత్రలో నిలిచిపోయారు.
చితికిన బతుకుతో వలస వెళ్లిన మరో యోధుడు మోరా పెద్ద బ్రహ్మయ్య
అర్వపల్లి మండలం రామన్న గూడెం కు చెందిన మోరా పెద్ద బ్రహ్మయ్య భీం రెడ్డి నరసింహా రెడ్డి నేతృత్వంలో రజాకార్లకు వ్యక్తి రేకంగా పోరాడాడు. ఉర్దూ మీడియం లో చదువుకొన్న ఆయన, బీ. ఎన్ రెడ్డి క్యాంప్ లోసభ్యుడిగా రజాకార్లపై దాడి చేయడం, వారి నుండి ఆయుధాలు స్వాధీనం చేసుకోవడంలో కీలక పాత్ర వహించాడు. గుర్రపు స్వారీ లో సిద్ద హస్తుడైన బ్రహ్మయ్య గుర్రంపై వెళ్లి రజాకార్లపై దాడులు నిర్వహించేవారు. దీంతో, స్వర్ణకార కుల వృత్తి పైనే ఆధారపడ్డ బ్రహ్హ్మయ్య ఇంటి పై తరచుగా రజాకార్లు దాడిచేసి ఇంట్లోని బటువులు, ఇతర వస్తువులను ఎత్తుకెళుతుండడం, ఆర్దికంగా అంతతగానే ఉన్న బ్రహ్మయ్య తన కుటుంబ సభ్యుల ఒత్తిడితో కన్న ఊరిని వదిలి నల్లగొండ పొరుగు జిల్లా అయిన బ్రిటిష్ ప్రభుత్వం పాలనలో ఉండే గుంటూరు జిల్లాలోని నడికుడి కి కట్టుబట్టలతో వలస వెళ్ళాడు. నడికుడి, మాచర్ల, విజయ వాడ లలో ఉండి కుల వృత్తి చేసుకొంటూ, సూర్యాపేట ఇతర గ్రామాలలోని సహచర ఉద్యమకారులకు రహస్యంగాఆయుధాలను, ఇతర సేవలందించారు. రజాకార్లపై పోరాటంజరిపి ఆర్థికంగా నష్టపోయినా, తానూ పాటించిన విలువల కనుగుణంగా స్వతంత్ర సమర యోధుల పింఛనుకు కూడా దరకాస్తు చేసుకోలేదు. మోరా పెద్ద బ్రహ్మయ్య కుమారుడు మిర్యాలగూడ సమీపంలోని యాదాద్రి పవర్ స్టేషన్ లో ఇంజనీరుగా ఉద్యోగ భాద్యతలు నిర్వహిస్తున్నారు.
వీరే కాకుండా విశ్వబ్రాహ్మణ వర్గంలో ఎంతో మంది నిజాం వ్యతిరేక పోరాట యోధులున్నారు. వీరందరి చరిత్ర వెలికితీయాల్సిన అవసరం ఉంది. ఇక, ‘తెలంగాణ ట్వెల్వ్‌’గా ప్రఖ్యాతికెక్కి ఉరిశిక్ష పడ్డ పన్నెండు మందిలో వడ్ల మల్లయ్య, వడ్ల పాపయ్యలు కూడా ఉన్నారు. ఈ ‘మరణశిక్ష పది మందిపై ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన వ్యతిరేకత వల్ల వీరికి ఉరి శిక్ష నుండి యావజ్జివ మరణ శిక్షను వేశారు. వీరిలో వడ్ల మల్లయ్య, వడ్ల పాపయ్య ల చరిత్ర తెలియాల్సిన అవసరం ఉంది. ( మీ ప్రాంతంలోని విశ్వ బ్రాహ్మణులకు చెందిన తెలంగాణా రైతాంగ పోరాటాల యోధుల గురించి తెలియచేయండి )


కన్నెకంటి వెంకట రమణ తేదీ. 17.9.2026, వీర తెలంగాణా సెల్. 9849905900

Share this post
Exit mobile version