Site icon MANATELANGANAA

వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన

uk protests

లండన్ వీధులు శనివారం రోజున బ్రిటన్‌లో వలస వ్యతిరేక భావజాలానికి వేదికగా మారాయి. రైట్వింగ్ ఆక్టివిస్ట్ నాయకుడు టామీ రాబిన్సన్ నేతృత్వంలో జరిగిన “యునైట్ ద కింగ్‌డమ్” ర్యాలీకి లక్షల్లో జనాలు హాజరయ్యారు. పోలీసులు అంచనా ప్రకారం 1.10 లక్షల నుండి 1.50 లక్షల వరకు ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు.

“ఫ్రీ స్పీచ్ ఫెస్టివల్” పేరుతో జరిగిన ఈ ర్యాలీలో ప్రసంగాలు జాతి ఆధారిత కుట్ర సిద్ధాంతాలు, ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలతో నిండిపోయాయని ది గార్డియన్ పేర్కొంది. వలసదారులపై తీవ్రమైన విమర్శలు చేస్తూ, యూరప్ అంతటి నుండి వచ్చిన రైట్ వింగ్ భావజాల నేతలు వేదికను ఆక్రమించారు.

ర్యాలీ సమయంలో కొన్ని చోట్ల పోలీసులు మరియు నిరసనకారుల మధ్య ఘర్షణలు జరిగాయి. కొంతమంది పోలీసులు బాటిల్స్ విసరడం, కొట్టడం, తన్నడం వంటి గొడవలకు పాల్పడినట్లు లండన్ పోలీసులు తెలిపారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు వెయ్యికి పైగా పోలీసులు హెల్మెట్లు, రయట్‌ షీల్డ్స్‌తో విధులు నిర్వర్తించారు.

ఇదే సమయంలో, స్టాండ్ అప్ టు రేసిజం నిర్వహించిన ప్రత్యామ్నాయ ర్యాలీ “మార్చ్ అగెనస్ట్ ఫాసిజం”లో సుమారు 5,000 మంది పాల్గొన్నారు.

రాబిన్సన్ (అసలు పేరు స్టీఫెన్ యాక్స్‌లీ-లెనన్), ఇంగ్లీష్ డిఫెన్స్ లీగ్ వ్యవస్థాపకుడు. ఆయన వలసదారులపై తీవ్ర విమర్శలు చేస్తూ, “వలసదారులకు న్యాయస్థానాల్లో స్థానిక బ్రిటిష్ ప్రజలకంటే ఎక్కువ హక్కులు ఉన్నాయ”ని వ్యాఖ్యానించారు.

ర్యాలీలో పాల్గొన్న ఫ్రాన్స్ కుడి భావజాల నేత ఎరిక్ జెమూర్ మాట్లాడుతూ, “యూరప్ దేశాలు వలసదారుల చేత కాలనీలు అవుతున్నాయి. ముస్లిం సంస్కృతి మాకు ముప్పు” అని అన్నారు.

టెస్లా CEO, X యజమాని ఎలాన్ మస్క్ వీడియో ద్వారా ర్యాలీలో పాల్గొని, “అనియంత్రిత వలసలు బ్రిటన్‌ను క్రమంగా కుంగదీస్తున్నాయి” అని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

ప్రదర్శనలో “స్టాప్ ద బోట్స్”, “సెండ్ దెమ్ హోమ్”, “సేవ్ అవర్ చిల్డ్రన్” వంటి నినాదాలతో బోర్డులు పట్టుకున్నారు. అదే సమయంలో ప్రత్యామ్నాయ నిరసనకారులు “రిఫ్యూజీస్ వెల్కమ్”, “స్మాష్ ద ఫార్ రైట్” అంటూ ప్రతిస్పందించారు.

ప్రస్తుతం బ్రిటన్‌లో చానెల్ ద్వారా పడవలలో అక్రమ వలసలు వస్తుండటంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రాజకీయ చర్చలు జరుగుతున్నాయి. ఇటీవలి నెలల్లో వలస వ్యతిరేక నిరసనలు హింసాత్మకంగా మారి అరెస్టులకు దారితీశాయి.

Share this post
Exit mobile version