Site icon MANATELANGANAA

రక్తతర్పణంనుండి పుట్టిన అమరత్వం -శేర్ సింగ్.. శహీద్ ఉద్ధమ్ సింగ్

Singh


శహీద్ భగత్ సింగ్ లాగే ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ ఉరికంబాన్ని ముద్దాడి అమరత్వం పొందిన త్యాగశీలి.

డిసెంబర్ 26 న శహీద్ ఉద్ధమ్ సింగ్ జన్మదినం….. ఉద్దమ్ సింగ్ ఒక తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన బిడ్డ కాదు –భారతమాత రక్తంలో పుట్టిన అమరత్వానికి చిహ్నం.

డిసెంబర్ 26, 2025 – సునం (పంజాబ్): ఈ రోజు భారత స్వాతంత్ర్య సమరంలో అసమాన త్యాగం చేసిన మహాన్ విప్లవకారుడు శేర్ సింగ్… శహీద్ ఉద్ధమ్ సింగ్ జన్మదినం (జయంతి).
ఈ సంవత్సరం ఆయన 126వ జయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు.

జలియన్‌వాలాబాగ్ హత్యాకాండకు ప్రతీకారంగా బ్రిటిష్ లెఫ్టినెంట్ గవర్నర్ మైఖేల్ ఓ’డ్వయర్‌ను లండన్‌లో కాల్చి చంపిన ధీరుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయాడు.

చిన్నతనం నుండే అమితమైన దేశభక్తి
. 1899 డిసెంబర్ 26న పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లా సునం పట్టణంలో షేర్ సింగ్‌గా జన్మించిన ఉద్ధమ్ సింగ్ చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయాడు.

ఆ తర్వాత అమృత్‌సర్‌లోని సెంట్రల్ ఖాల్సా యతీమ్‌ఖానాలో చేరి సిక్కు సంస్కృతి, చరిత్రను నేర్చుకున్నాడు. అక్కడే ఆయన పేరు ఉద్ధమ్ సింగ్‌గా మారింది.

1919 ఏప్రిల్ 13న అమృత్‌సర్‌లోని జలియన్‌వాలాబాగ్‌లో జరిగిన మారణకాండ ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.

బ్రిగేడియర్ జనరల్ రెజినాల్డ్ డయ్యర్ ఆదేశాల మేరకు భారతీయులపై కాల్పులు జరిపి వందలాది మందిని హతమార్చాడు.
ఈ ఘటన పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైఖేల్ ఓ’డ్వయర్ ప్రోత్సాహంతో జరిగింది.
ఈ అమానుష హత్యలు చూసి ఉద్ధమ్ సింగ్ హృదయం తల్లడిల్లి పోయింది.
“ఈ రక్తం వృధా కాదు… ప్రతీకారం తీర్చుకుంటా” అని ప్రతిజ్ఞ చేశాడు.

ప్రతిన బూనిన ఉద్ధమ్ సింగ్ 21 ఏళ్ల తీర్థయాత్రలు సాగించి … ప్రతీకారం కోసం
ఆ తర్వాత గదర్ పార్టీలో చేరి విప్లవ కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. అమెరికా, జర్మనీ, ఆఫ్రికా, భారతదేశం అనేక దేశాల్లో సంచరించి స్వాతంత్ర్య ఉద్యమ కాంక్షను రగిలించాడు.

భగత్ సింగ్‌ను తన గురువుగా భావించి, ఆయన చిత్రాన్ని తన వాలెట్‌లో ఎల్లప్పుడూ ఉంచుకునేవాడు.

చివరకు 1940 మార్చి 13న లండన్‌లోని క్యాక్స్‌టన్ హాల్‌లో జరిగిన సమావేశంలో మైఖేల్ ఓ’డ్వయర్‌పై కాల్పులు జరిపి ప్రతీకారం తీర్చుకున్నాడు. పట్టుబడిన తర్వాత కోర్టులో ఉద్ధమ్ సింగ్ తన పేరును రాం మహమ్మద్ సింగ్ ఆజాద్గా ప్రకటించుకుని హిందూ-ముస్లిం-సిక్కు ఐక్యతను, భారత స్వాతంత్ర్య ఆకాంక్షను దేశ భక్తిని ప్రపంచానికి చాటాడు.
తనకుశిక్షలంటే భయం లేదని ఏశిక్షకైనా సిద్దమేనని వందలాదిమందిని చంపించిన మైఖేల్ ఓ’డ్వయర్ ను చంపినందుకు తాను ఏమాత్రం పశ్చాత్తాపం చెందడంలేదని దేశం కోసం గర్వపడుతున్నానని అన్నాడు.

 “ అవును నేనే చంపాను ఎందుకంటే అతనిపై నాకు కోపం ఉంది. అతడికి ఇదే సరైన శిక్ష”. మరణ తీర్పు సమయంలో న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఏమాత్రం జంకు లేకుండా “నేను మరణానికి భయపడను……దేశం కోసం మరణించడం నాకు గర్వకారణం… ఇంగ్లాండ్ కార్మికులతో నాకు అనురాగం ఉన్నా, నేను ఈ దుష్టమైన బ్రిటిష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నానంటూ ఆగ్రహంతో రగిలి పోయాడు ఉద్ధమ్ సింగ్ .


ఉద్ధమ్ సింగ్ ను 1940 జులై 31న లండన్‌లోని పెంటన్‌విల్ జైలులో ఉరితీసారు. ఆ తర్వాత 1974లో ఆయన అస్థిపాత్రాను భారత్‌కు తీసుకొచ్చారు. జలియన్‌వాలాబాగ్ మ్యూజియంలో ఒక భాగంలో భద్రపరిచారు. ఉత్తరాఖండ్‌లో ఒక జిల్లాకు ఉద్ధమ్ సింగ్ నగర్ అని పేరు కూడ పెట్టారు. ఆయన అమరత్వం పొందిన రోజు పంజాబ్, హర్యానాల్లో జులై 31ను సెలవు దినంగా పాటిస్తున్నారు.
ఈ రోజు దేశవ్యాప్తంగా వివిధ సంస్థలు, పాఠశాలలు, రాజకీయ నాయకులు శహీద్ ఉద్ధమ్ సింగ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఆయన త్యాగం, ధైర్యం, దేశభక్తి యువతకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది.

Share this post
Exit mobile version