- తిరుమలలో ఏఐతో శీఘ్ర దర్శనం – తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు
- 1-2 గంటల్లో శ్రీవారి దర్శనం చుసుకునేలా చర్యలు: బీఆర్ నాయుడు
- అన్యమత ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు – తితిదే హెచ్చరిక
హైదరాబాద్: తిరుమలలో భక్తుల దర్శనాన్నిసులభతరం చేయడానికి ఏఐ సాంకేతికతను ఉపయోగించి 1–2 గంటల్లో శ్రీవారి దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. హైదరాబాద్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పలు ముఖ్య విషయాలను వెల్లడించారు.
అన్యమత సిబ్బంది విషయమై మాట్లాడుతూ, వారికి వేరే విభాగాల్లో బదిలీలు ఇవ్వడం లేదా వాలంటరీ రిటైర్‌మెంట్ స్కీమ్ కింద పంపేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ‘‘ఎవరైనా అన్యమత ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు’’ అని ఆయన హెచ్చరించారు.
సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఒంటిమిట్టలో అన్నదానం నిరంతరం కొనసాగుతోందని, తితిదే రూ.4 కోట్లు కేటాయించిందని నాయుడు వివరించారు. గతంలో హోటళ్ల కేటాయింపు మాఫియా స్థాయికి వెళ్లిందని, ఇప్పుడు ఈ-టెండర్ల ద్వారా పారదర్శకంగా హోటళ్లు కేటాయిస్తున్నామని తెలిపారు. తిరుమలలో త్వరలో కొత్త క్యాంటీన్లు ప్రారంభించనున్నట్లు చెప్పారు.
భక్తుల సౌకర్యార్థం దర్శన సమయాల్లో మార్పులు చేస్తున్నామని, ఉదయం టికెట్లు తీసుకున్నవారు సాయంత్రం దర్శనం చేసుకునే విధంగా సిస్టమ్ అమలు చేస్తామని వివరించారు. అలాగే, ప్రసాదాలు మరియు దర్శన టికెట్లపై జరుగుతున్న సైబర్ మోసాలను అరికట్టేందుకు ప్రత్యేక సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. గత ఏడాదిలో 30 వేల నకిలీ వెబ్‌సైట్లను క్రాష్ చేసినట్లు తెలిపారు.
అదేవిధంగా, అలిపిరి వద్ద భద్రతా చర్యల్లో భాగంగా స్కానర్లు అప్‌డేట్ చేస్తున్నామని, ఇకపై వీఐపీ దర్శనం ఉదయం 8 నుంచి 8.30 లోపు పూర్తయ్యేలా మార్పులు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
అటవీ విస్తరణ, ఆధునిక పరికరాలు, కొత్త ఆలయాల నిర్మాణం విషయాలను ప్రస్తావిస్తూ, దేశవ్యాప్తంగా మరో వెయ్యి ఆలయాల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ‘‘తిరుమలలో రాజకీయాలు నిషేధించాం… మంచి ఫలితాలు వస్తున్నాయి’’ అన్నారు.
వైకాపా నేతలపై విమర్శలు చేస్తూ, ‘‘తిరుమల వచ్చి జగన్, భారతి ప్రసాదం తింటారా? తప్పు జరిగితే మాట్లాడండి కానీ లేని పోని ఆరోపణలు సరికాదు. రోజా ఒక్కో టికెట్‌ను రూ.5 వేలకి అమ్మారు. ఎవరేం చేశారో నాకు రికార్డులున్నాయి. చర్చకు సిద్ధమా?’’ అని బీఆర్ నాయుడు సవాల్ విసిరారు.