Site icon MANATELANGANAA

టీటీడీలోనల్ల బంగారం రికార్డు –

tirumala

మే నెలలో తలనీలాల సమర్పించిన 12లక్షల భక్తులు

భక్తులకు నిరంతర క్షౌర సేవలు అందిస్తున్న టీటీడీ

పారిశుద్ధ్యం, భద్రతా చర్యలకు ప్రాధాన్యం

తిరుమల, మే 28, 2026:

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి భక్తులు సమర్పించే తలనీలాల రూపంలోని “నల్ల బంగారం” ఈ మే నెలలో తిరుమలలో కొత్త రికార్డులు సృష్టించింది. భారీగా తరలివచ్చిన భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 24 గంటల పాటు నిరంతర క్షౌర సేవలను అందిస్తోంది.

ఈ ఏడాది మే 27వ తేదీ వరకు మొత్తం 12,43,063 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించారు. గతంలో మే 2024లో 10,65,729 మంది, మే 2025లో 10,18,370 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు టీటీడీ తెలిపింది.

వేసవి సెలవులు, వరుస వారాంతపు సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ముఖ్యంగా మే 18 నుంచి మే 23 వరకు ఆరు రోజుల పాటు ప్రతిరోజూ 50 వేల మందికి పైగా భక్తులు తలనీలాలు సమర్పించారు. అందులో మే 23న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 57,580 మంది భక్తులు మొక్కుబడిగా తలనీలాలు సమర్పించడం విశేషం.

తిరుమలలో పలు కళ్యాణకట్ట కేంద్రాలు

భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా, సౌకర్యవంతంగా సేవలు పొందేందుకు టీటీడీ తిరుమల వ్యాప్తంగా పలు కళ్యాణకట్ట కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రధాన కళ్యాణకట్టతో పాటు PAC-1, PAC-2, PAC-3, PAC-5, GNC, హెచ్‌వీసీ, సప్తగిరి రెస్ట్ హౌస్, నందకం రెస్ట్ హౌస్, కౌస్తుభం రెస్ట్ హౌస్, శ్రీ వెంకటేశ్వర రెస్ట్ హౌస్, శ్రీ పద్మావతి రెస్ట్ హౌస్‌లలో మినీ క్షౌర కేంద్రాలు పనిచేస్తున్నాయి.

క్షౌర సేవల్లో 1,152 మంది బార్బర్లు

తిరుమలలో మొత్తం 1,152 మంది బార్బర్లు భక్తులకు సేవలందిస్తున్నారు. వీరిలో 269 మంది మహిళా బార్బర్లు ఉన్నారు. సాధారణంగా ఒక్కో బార్బర్ ఆరు గంటల షిఫ్టులో సుమారు 40 మందికి సేవలందిస్తారు. అయితే భక్తుల రద్దీ పెరగడంతో సుమారు 250 మంది బార్బర్ల పని గంటలను పెంచి, ఒక్కో బార్బర్ అదనంగా మరో 50 మందికి సేవలందించేలా టీటీడీ చర్యలు చేపట్టింది.

పారిశుద్ధ్యానికి అత్యధిక ప్రాధాన్యం

భక్తులు, బార్బర్ల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని అన్ని కళ్యాణకట్ట కేంద్రాల్లో పారిశుద్ధ్య చర్యలను కట్టుదిట్టం చేశారు. క్షౌరానికి ఉపయోగించే బ్లేడ్లను ముందుగా సోడియం ద్రావణంలో శుభ్రపరచి, అనంతరం డెట్టాల్‌తో పరిశుభ్రం చేసి వినియోగిస్తున్నారు.

భక్తులు సమర్పించిన తలనీలాలను సురక్షితంగా భద్రపరుస్తున్నారు. ప్రతి కళ్యాణకట్టలో స్నాన సదుపాయాలు, వేడి నీటి వసతి కల్పించారు. తలనీలాల సమర్పణ అనంతరం భక్తులకు చందనం బిళ్లలు కూడా పంపిణీ చేస్తున్నారు.

భారీ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని క్షౌర కేంద్రాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి వసతి, కూర్చునే ఏర్పాట్లు, టోకెన్ విధానాన్ని మరింత బలోపేతం చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

Share this post
Exit mobile version