Site icon MANATELANGANAA

టైగర్ నల్లా నరసింహులు స్ఫూర్తితో బి.సి వాటా సాధిద్దాం


…………………………….

పోరాటమే జీవితంగా సాగిన ప్రజా యోధుడు అణచివేతపై తిరుగుబాటు చేసిన తెలంగాణ విప్లవ సింహం నల్లా నర్సింహులు నేటి బి.సి ఉద్యమాలకు స్ఫూర్తిగా మారాల్సిన అవసరముంది. చరిత్ర అనేది కేవలం రాజులు, రాజ్యాలు, అధికార పీఠాల కథ కాదు. అన్యాయాన్ని ఎదిరించి, అణగారిన ప్రజల ఆత్మగౌరవం కోసం తమ జీవితాలనే పోరాట బాటలో అంకితం చేసిన సామాన్యుల అసామాన్య చరిత్ర కూడా ఉంది. అలాంటి పోరాట చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన పేరు నల్లా నరసింహులు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రలో ఆయన ఒక ధైర్యానికి ప్రతీక. నిరంకుశత్వానికి ఎదురొడ్డి నిలిచిన తెగువకు నిదర్శనం. పీడిత ప్రజల విముక్తి కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన మహోన్నత పోరాట యోధుడు.

పేదరికం నుంచి పోరాట పంథా వరకు…

1926 అక్టోబర్ 2న అప్పటి జనగామ తాలూకాలోని కడవెండి గ్రామంలో నల్లా లచ్చయ్య, లచ్చమ్మ దంపతులకు జన్మించిన నల్లా నరసింహులు నిరుపేద పద్మశాలి చేనేత కుటుంబం ఆయనది. ఏడవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నప్పటికీ, జీవిత పాఠాలు ఆయనకు సమాజాన్ని చదివే విజ్ఞానాన్ని అందించాయి.

ఆ రోజుల్లో తెలంగాణ ప్రాంతం నిజాం నిరంకుశ పాలనలో మగ్గుతోంది. దేశ్‌ముఖ్‌లు, జమీందార్లు, భూస్వాముల దోపిడీ, వెట్టిచాకిరీ, రజాకార్ల దౌర్జన్యాలు పేద ప్రజల జీవితాలను ఛిద్రం చేస్తున్నాయి. కడవెండి గ్రామం కూడా విసునూరు దేశ్‌ముఖ్ ఆధిపత్యంలో అణచివేతకు గురవుతోంది. తన కళ్లముందు పేదలపై జరుగుతున్న అన్యాయాలు, తన కుటుంబం ఎదుర్కొన్న కష్టాలు, ముఖ్యంగా తండ్రి భూస్వామ్య దౌర్జన్యాలకు బలికావడం ఆయనలో తిరుగుబాటు స్ఫూర్తిని రగిలించాయి. అప్పటివరకు సామాన్య చేనేత కార్మికుడిగా ఉన్న నరసింహులు, అన్యాయాన్ని ప్రశ్నించే ప్రజా ఉద్యమకారుడిగా మారారు.

ఆంధ్ర మహాసభతో నల్లా నరసింహులు ఉద్యమ ప్రస్థానం

తెలంగాణ ప్రజల్లో సామాజిక, రాజకీయ చైతన్యం పెంపొందించడంలో ఆంధ్ర మహాసభ కీలక పాత్ర పోషించింది. భువనగిరిలో జరిగిన పదకొండవ ఆంధ్ర మహాసభ ప్రభావంతో నరసింహులు ప్రజా ఉద్యమంలో మరింత చురుకుగా పాల్గొన్నారు. గ్రామగ్రామాన ప్రజలను సంఘటితం చేయడం, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా చైతన్యం కల్పించడం, భూస్వాముల దౌర్జన్యాలను ప్రశ్నించడం ఆయన ఉద్యమ జీవితంలో ప్రధాన భాగాలయ్యాయి. తన జీవిత సహచరి వజ్రమ్మను కూడా ఉద్యమంలో భాగస్వామిని చేశారు. కుటుంబ బంధాలకంటే ప్రజా విముక్తి లక్ష్యమే గొప్పదని భావించి, ఇద్దరూ అజ్ఞాత జీవితాన్ని ఎంచుకున్నారు. గ్రామ దళాల నిర్మాణం, ప్రజలకు శిక్షణ, మహిళల్లో పోరాట చైతన్యం పెంపొందించడం వంటి కార్యక్రమాల్లో నరసింహులు కీలక పాత్ర పోషించారు.
నల్లా నర్సింహులు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అలుపెరుగని వీరోచిత పాత్ర పోషించారు

1946 నుంచి 1951 వరకు సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం భారతదేశ చరిత్రలో ఒక విశిష్ట అధ్యాయం. దొడ్డి కొమురయ్య అమరత్వంతో మరింత ఉధృతమైన ఈ పోరాటంలో నల్లా నరసింహులు జనగామ ప్రాంత దళ నాయకుడిగా ఎదిగారు. దున్నేవాడికే భూమి కావాలని

వెట్టిచాకిరీ అంతం కావాలని
దోపిడీ, దౌర్జన్యాలకు స్వస్తి పలకాలననే ఆశయాలు ఆయన పోరాటానికి ప్రధానంగా ప్రేరణనిచ్చినవి. గ్రామీణ పేదలను సంఘటితం చేస్తూ, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటాన్ని విస్తరించారు. ప్రజల ఆత్మగౌరవం, భూమి హక్కులు, సామాజిక సమానత్వం కోసం తన సహచరులతో కలిసి పోరాటాన్ని కొనసాగించారు.
ఆయన నాయకత్వంలో దళాల నిర్మాణం, గెరిల్లా పోరాట వ్యూహాలు, ప్రజా రక్షణ కార్యక్రమాలు విస్తరించాయి.
నరసింహులు పేరు వినగానే నిరంకుశ పాలకులకు, వారి అనుచరులకు వణుకు పుట్టేది. ఆయన ధైర్యసాహసాలు, పోరాట పటిమకు గుర్తింపుగా ‘తెలంగాణ టైగర్’ అనే బిరుదు స్థిరపడింది. నల్లా నర్సింహులుది ఉరికంబం ఎదురైనా వెనుకడుగు వేయని ధైర్యం. ఒక వ్యక్తి తన ప్రాణాలను కాపాడుకోవడం కోసం పోరాటాన్ని వదిలిపెట్టవచ్చు. కానీ నరసింహులు తన ప్రాణాలకంటే ప్రజల హక్కులకే ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన జీవితంలో అరెస్టులు, చిత్రహింసలు, జైలు జీవితం, న్యాయస్థానాల్లో కేసులు నిత్యకృత్యాలయ్యాయి. అనేక కేసులను ఎదుర్కొన్నారు. ఏకంగా మూడుసార్లు మరణశిక్షను ఎదుర్కొన్నారు. అయినా ఆయన ధైర్యం సడలలేదు. న్యాయస్థానాల్లోనూ తన రాజకీయ, సామాజిక భావజాలాన్ని ధైర్యంగా వినిపించారు. ఒక సామాన్య చేనేత కుటుంబంలో పుట్టిన వ్యక్తి, నిరంకుశ పాలనను ఎదిరించి, ఉరికంబాన్ని సైతం లెక్కచేయని పోరాట యోధుడిగా ఎదగడం అసాధారణమైన విషయం.

1951లో సాయుధ పోరాట విరమణ ప్రకటన వెలువడినప్పటికీ, నరసింహులు ఎదుర్కొంటున్న న్యాయపరమైన సమస్యలు వెంటనే ముగియలేదు. చివరకు 1959 జనవరి 26న సుదీర్ఘ జైలు జీవితం నుంచి విడుదలయ్యారు.
ఆయన జైలు జీవితం కేవలం వ్యక్తిగత కష్టాల చరిత్ర కాదు. ఒక సామాజిక వ్యవస్థ మార్పు కోసం పోరాడిన వ్యక్తి ఎదుర్కొన్న త్యాగాల చరిత్ర. నరసింహులు పోరాట జీవితాన్ని ప్రస్తావించేటప్పుడు ఆయన భార్య వజ్రమ్మ త్యాగాన్ని విస్మరించలేం. భర్తతో పాటు అజ్ఞాత జీవితం గడిపారు. ఉద్యమంలో భాగస్వామిగా నిలిచారు. జైలు జీవితాన్ని అనుభవించారు. ఆమె జైలులో ఉన్న సమయంలోనే ఒక ఆడ శిశువుకు జన్మనివ్వడం ఆ కుటుంబం ఎదుర్కొన్న విషాద పరిస్థితులకు నిదర్శనం. ఒకవైపు భర్త ప్రజా పోరాటం, మరోవైపు కుటుంబ బాధ్యతలు, ఇంకోవైపు నిర్బంధ జీవితం. ఇన్ని కష్టాల మధ్య కూడా వజ్రమ్మ తన సహచరి ఆశయాలకు అండగా నిలిచారు. వారి జీవితాలు వ్యక్తిగత సుఖసంతోషాల కంటే ప్రజా ప్రయోజనాలకే అంకితమైన అరుదైన దాంపత్యానికి ప్రతీకలు.
ఆ దంపతులకు ముగ్గురు అడ బిడ్డలు అందులో ఒకరు మరణించారు. తండ్రి అశయాలను అతని బిడ్డ అరుణమ్మ కొనసాగిస్తున్నది.
నల్లా నర్సింహులు పోరాట చరిత్రను భావితరాలకు అందించిన రచయిత కూడా. తను కేవలం పోరాట యోధుడే కాదు తాను జీవించిన కాలాన్ని, అనుభవించిన సంఘటనలను భావితరాలకు అందించాలనే తపన కలిగిన చరిత్రకారుడు కూడా. 1987లో తెలంగాణ సాయుధ పోరాటం నలభైవ వార్షికోత్సవం సందర్భంగా తన అనుభవాలను విస్తృతంగా నమోదు చేశారు. ఆ రచన 1989లో ‘తెలంగాణ సాయుధ పోరాటం – నా అనుభవాలు’ అనే పుస్తకంగా వెలువడింది. ఆ పుస్తకం ద్వారా తెలంగాణ రైతాంగ పోరాటంలోని అనేక చారిత్రక సంఘటనలు, అమరుల త్యాగాలు, ప్రజల పోరాట పటిమ భావితరాలకు పరిచయమయ్యాయి.
ఇది ఆయన జీవితంలో మరో గొప్ప విజయంగా చెప్పుకోవచ్చు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వేలాది మంది ప్రాణత్యాగాలకు సాక్ష్యంగా నిలిచింది. ఆ పోరాట ఫలితంగా భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం పెరిగింది. లక్షలాది ఎకరాల భూమి పేద రైతుల చేతుల్లోకి వెళ్లడానికి ఉద్యమం దోహదపడింది. నరసింహులు జీవితమంతా ఈ పోరాట స్ఫూర్తిని తనలో నిలుపుకున్నారు. చివరి శ్వాస వరకు ఉజ్వలమైన తన ఆశయాలను, సహచరుల త్యాగాలను స్మరించుకుంటూ జీవించారు. 1993 నవంబర్ 5న ఆయన భౌతికంగా మనకు దూరమైనప్పటికీ, ఆయన పోరాట స్ఫూర్తి మాత్రం చరిత్రలో సజీవంగా నిలిచిపోయింది.

నల్లా నరసింహులు జీవితం మనకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది.
పేదరికం ప్రతిభకు అడ్డంకి కాదని, చదువుకున్న తరగతులకే చరిత్రను సృష్టించే అవకాశం పరిమితం కాదని, సామాజిక చైతన్యం, ధైర్యం, నిబద్ధత ఉంటే ఒక సామాన్యుడు కూడా అసామాన్య చరిత్రను నిర్మించగలడని ఆయన జీవితం నిరూపించింది. అధికారం ముందు తలవంచని ఆత్మగౌరవం, అన్యాయం ముందు మౌనం వహించని పోరాట పటిమ, వ్యక్తిగత ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలకే ప్రాధాన్యతనిచ్చే త్యాగనిరతి ఆయన వ్యక్తిత్వంలో కనిపించే విశిష్ట లక్షణాలు.అవే అతన్ని చిరస్మరణీయునిగా చేసినవి. నేటి తరానికి ఆయన జీవితం ఒక చారిత్రక పాఠం. సమాజంలోని అసమానతలను ప్రశ్నించే చైతన్యానికి ఒక స్ఫూర్తి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేసే ఒక సందేశం. ఆయన జీవితం ఒక పోరాటం. ఆయన ప్రయాణం ఒక చరిత్ర. ఆయన త్యాగం ఒక స్ఫూర్తి. ఆయన ఆశయం భావితరాలకు ఒక మార్గదర్శకం. నల్లా నరసింహులు వంటి మహనీయుల జీవిత చరిత్రలను అధ్యయనం చేయడం, వారి పోరాట వారసత్వాన్ని భావితరాలకు అందించడం మనందరి బాధ్యత.
నల్లా నర్సింహులు
భౌతికంగా దూరమైనా భావజాలంలో చిరంజీవి. ప్రజా పోరాట చరిత్రలో అజరామరుడు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో
నల్లా నరసింహులు తెలంగాణ టైగర్ గా ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయాడు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, స్వాతంత్రం లేక నిత్య నిర్బంధంలో పోరాటం చేసి ప్రజలకు ఎన్నో హక్కులను సాధించిన నల్ల నర్సింహులు స్ఫూర్తితో నేటి ప్రజాస్వామ్య దేశంలో బి.సి ల వాటా సాధించడానికి ఐక్య పోరాటాలు చేయాల్సిన అవసరముంది.

(నవంబర్ 5న నల్ల నర్సింహులు 33వ వర్ధంతి)

… సుధీర్ వలుస
న్యాయవాది, వరంగల్
9908763710

Share this post
Exit mobile version