బెదిరింపులతో ఆత్మహత్య.. ముగ్గురు మహిళలపై కేసు
హైదరాబాద్, సూరారం:
బరి తెగించి భయపెట్టడం, బెదిరించి చివరకు ఓ వ్యకి ప్రాణం తీసుకునేలా చేసారు హైదరాబాద్ లో ఈ మహిళలు. ఏనేరం చేయని వ్యక్తి వెంటబడి డబ్బులు దోచుకునే ప్రయత్నం చేయగా ముగ్గురు మహిళలు అర్ధరాత్రి కత్తులు, కర్రలతో ఒక ఇంటికి వెళ్లి భీభత్సం చేయడంతో ఆ వ్యక్తి భయంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సూరారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని కైసర్‌నగర్ డబుల్ బెడ్‌రూమ్ సముదాయంలో చోటుచేసుకుంది.
వివరాలు ఇలా ఉన్నాయి
కైసర్‌నగర్ 6వ బ్లాక్‌లోని ఫ్లాట్ నం.302లో బియ్యంపల్లి రాజు (55), భార్య జ్యోతి, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తెతో కలిసి నివాసముంటున్నారు. రాజు బాలానగర్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు.
మంగళవారం రాత్రి డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తుండగా, 2వ బ్లాక్‌లో ఉండే నౌసీమ్ అనే మహిళ అతడిని అనుసరించింది. రాజు జేబులో చేయి వేసి డబ్బులు తీసేందుకు ప్రయత్నించగా, ఆమె చేయిని పట్టుకొని ఆపాడు. దీంతో నౌసీమ్ తన తల్లి షహజాన్, 4వ బ్లాక్‌లో ఉండే అంజుమాను పిలిపించుకుని రాజుతో గొడవపడ్డారు. ఆ సమయంలో సొసైటీ సభ్యులు జోక్యం చేసుకుని వారిని వెనక్కి పంపించారు.
అయితే అదే రాత్రి మళ్లీ వారు రాజు ఇంటికి వెళ్లి గొడవపడ్డారు. మళ్లి అర్ధరాత్రి కత్తులు, కర్రలతో వచ్చి “ఉదయానికి చచ్చిపో.. లేకుంటే మా చేతిలో చస్తావు” అంటూ తీవ్రంగా బెదిరించారు. ఈ సంఘటనతో ఆందోళనకు గురైన రాజు, కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా, మరో గదిలోకి వెళ్లి చీరతో ఉరి వేసుకుని చనిపోయాడు.
బుధవారం ఉదయం భార్య జ్యోతి స్థానికులకు సమాచారం అందించింది. వెంటనే ఆగ్రహంతో స్థానికులు నిందితుల ఇళ్ల ఎదుట ఆందోళన జరిపారు.
సమాచారం అందుకున్న సూరారం సీఐ సుదీర్‌కృష్ణ సంఘటనా స్థలానికి చేరుకొని ఉద్రిక్తతలను అదుపు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై ముగ్గురు మహిళలపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఒకరైన అంజుమా, గతంలోనూ ఇదే విదంగా మరొకరితో గొడవకు పాల్పడిందని, వీరు తరచూ అమాయకులను బెదిరించి డబ్బులు వసూలు చేసేవారని స్థానికులు ఆరోపించారు.