Site icon MANATELANGANAA

థాయిలాండ్ షటిల్ టోర్నమెంట్ లో సత్తా చాటిన తెలంగాణ క్రీడా కారులు

థాయిలాండ్ లో మనోళ్ల గెలుపు..
సత్తా చాటిన బొద్ధి రెడ్డి ప్రభాకర్ రెడ్డి, గడ్డం కేశవ మూర్తి
చైనా, మలేషియా క్రీడాకారులపై గెలుపు
థాయిలాండ్ పై నువ్వా నేనా అన్నట్లు సాగిన పోటీ
ఘనంగా సన్మానించిన తోటి క్రీడాకారులు

వరంగల్ వాయిస్, హనుమకొండ : హనుమకొండకు చెందిన వెటరన్ షటిల్ క్రీడాకారులు బోద్ధి రెడ్డి ప్రభాకర్ రెడ్డి, గడ్డం కేశవమూర్తి థాయిలాండ్ లోని పట్టాయా మహానగరంలో ప్రతిభను చాటారు. ఈనెల 21 నుంచి 23 వరకు జరిగిన ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ‘సవాస్ ది కప్ 2025లో రన్నరపుగా నిలిచారు. కన్నుల పండుగగా జరిగిన ఈ అంతర్జాతీయ షటిల్ టోర్నమెంట్లో ప్రపంచ దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. 60 ప్లస్ డబుల్స్ లో ప్రభాకర్ రెడ్డి, కేశవమూర్తి జంట చైనా, మలేషియా దేశాల క్రీడాకారులపై విజయం సాధించారు. నిర్వాహక దేశమైన థాయిలాండ్ క్రీడాకారులతో నువ్వా నేనా అన్నట్లు సాగిన పోటీలో ఓటమిని చవిచూసి రన్నరప్ గా నిలిచారు. జట్టు మేనేజర్ ముచ్చ రాజిరెడ్డి ప్రోత్సాహంతో వీరి జంట అద్భుతంగా ఆడింది. థాయి చైనీస్ ఫ్రెండ్షిప్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోర్నే దబ్బరాన్సి ఆధ్వర్యంలో పట్టాయ మహానగరంలో సవాస్ ది కప్ 2025 బ్యాడ్మింటన్ టోర్నీని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. అంతర్జాతీయ క్రీడాకారుల కోసం ఘనమైన ఏర్పాట్లను చేసింది. నభూతో నాభవిష్యత్తు అన్న రీతిలో కొనసాగిన ఈ అంతర్జాతీయ సెటిల్ క్రీడోత్సవాల్లో బోద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, గడ్డం కేశవ మూర్తిలు పతకాలు సాధించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. షటిల్ టోర్నీలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన వీరిని పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు అభినందించారు.

అభినందనల వెల్లువ..

థాయిలాండ్ లోని పట్టాయ మహానగరంలో జరిగిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సవాస్ ది కప్ 2025 టోర్నీలో సమిష్టిగా రాణించి రన్నరప్ గా నిలిచిన ఓరుగల్లు షటిల్ క్రీడాకారులు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, గడ్డం కేశవ మూర్తిని జి డబ్ల్యూ ఎంసీ ఇండోర్ స్టేడియంలో తోటి క్రీడాకారులు ఘనంగా సన్మానించారు. శుక్రవారం జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో వీరికి శాలువా కప్పి, బొకేలు ఇచ్చి అభినందించారు. ఎంతో అట్టహాసంగా జరిగిన ఈ అభినందన సభలో కొత్తగట్టు సుధాకర్, మార్త శ్రీధర్, పూతాటి రవి, కొత్తగట్టు శివ, పూసల సంతోష్, కేతిరెడ్డి లక్ష్మారెడ్డి, చదలవాడ నితిన్, చింతాకుల ప్రభాకర్, రోహన్ సింగ్, శివ , దుస్స వినయ్, పీసు రాజిరెడ్డి, కోట రమణారెడ్డి, పూజారి విజయ్, వైవీ రాజేందర్ తో పాటు తదితరులు పాల్గొని విజేతలను అభినందించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీతలు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, గడ్డం కేశవమూర్తి మాట్లాడుతూ తమ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. జట్టు మేనేజర్ ముచ్చ రాజిరెడ్డి అందించిన ప్రోత్సాహం మరువలేనిది అన్నారు. వరంగల్ కార్పొరేషన్ ఇండోర్ స్టేడియం క్రీడాకారులందరికి పేరుపేరునా వారు ధన్యవాదాలు తెలిపారు.

Share this post
Exit mobile version