Site icon MANATELANGANAA

ట్యూబెక్టమీ వికటించి మృతి చెందిన ఘటనలో రూ.8 లక్షల పరిహారం -TGHRC

ట్యూబెక్టమీ వికటించి మృతి చెందిన ఘటనలో రూ.8 లక్షల పరిహారం సిఫార్సు
మృతురాలి భర్తకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వానికి సూచన: TGHRC

వనపర్తి: ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో నిర్వహించిన ట్యూబెక్టమీ శస్త్రచికిత్స వికటించి మహిళ మృతి చెందిన ఘటనలో తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో వైద్య నిర్లక్ష్యమే మృతికి కారణమని నిర్ధారించిన కమిషన్, బాధిత కుటుంబానికి అదనంగా రూ.8 లక్షల పరిహారం చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సిఫార్సు చేసింది. అలాగే మృతురాలి భర్తకు తగిన ఉపాధి కల్పించాలని సూచించింది.

H.R.C. నం.2355/2018 కేసులో భాగంగా, 06.01.2026న జారీ చేసిన ఉత్తర్వుల్లో గౌరవ డా. జస్టిస్ షమీమ్ అక్తర్ అధ్యక్షతన ఉన్న కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. వనపర్తి జిల్లాలోని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో శ్రీమతి ఎం. లలితకు నిర్వహించిన ట్యూబెక్టమీ శస్త్రచికిత్స సమయంలో ileal perforation జరగడం, దాన్ని సకాలంలో గుర్తించడంలో జరిగిన ఆలస్యం వల్ల సెప్టిక్ పెరిటోనైటిస్ ఏర్పడి చివరకు కార్డియో–పల్మనరీ అరెస్ట్‌కు దారితీసినట్లు కమిషన్ స్పష్టం చేసింది.

ఇది సాధారణ శారీరక ప్రతిచర్య మాత్రమే అన్న వాదనను కమిషన్ తోసిపుచ్చుతూ, ఇది పూర్తిగా వైద్య నిర్లక్ష్యమేనని తేల్చింది. ఇప్పటికే ప్రభుత్వం చెల్లించిన రూ.2 లక్షల పరిహారం మృతురాలి వికలాంగ భర్త, ఇద్దరు మైనర్ కుమారుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుంటే సరిపోదని పేర్కొంది. అందువల్ల అదనంగా రూ.8 లక్షల పరిహారం చెల్లించాలని సిఫార్సు చేసింది.

అలాగే బాధిత కుటుంబం గౌరవంగా జీవించేందుకు వీలుగా మృతురాలి భర్తకు తగిన ఉపాధి కల్పించాలని కూడా ప్రభుత్వానికి సూచించింది.

Share this post
Exit mobile version