Site icon MANATELANGANAA

ప్రచార పటాటోపం..మహానాడు యథాలాపం

ప్రచార పటాటోపం..
మహానాడు యథాలాపం..!

రెండేళ్ల పాలనలో ఏం సాధించారు..
కొత్త పెన్షన్లు ఇవ్వకపోగా
పాత వాటిలో కోత..
ఆరోగ్యశ్రీ అమలులో
పూర్తి వైఫల్యంతో పాటు
వైద్య విద్య ప్రైవేటీకరణ..
కొత్త ప్రాజెక్టులు లేకపోగా..
ఉన్న వాటి నిర్మాణంలో
మందకొడి గమనం..
సంపద సృష్టి అంటూ ప్రగల్భాలకు పోయి
సాధించలేకపోగా..
రాష్ట్రాన్ని మరింతగా
అప్పుల ఊబిలోకి
నెడుతూ ఖజానాను
దివాళా తీయించారనే
తీవ్ర ఆరోపణల నడుమ..

రాష్ట్రాన్ని కనీవినీ ఎరుగని
రీతిలో అభివృద్ధి దిశగా
నడిపిస్తున్నామని..
విశాఖలో గూగుల్ సెంటర్ తో
సహా ఎన్నెన్నో ఆధునిక
సెంటర్ల ప్రతిష్టాపన దిశగా
అడుగులు వేస్తున్నామని..
భోగాపురం విమానాశ్రయం
పనులను ఒకనాడు మేమే
ప్రారభించి ఇప్పుడు
ఊహించని వేగంతో
పూర్తి చేసి వచ్చే జూలైలో
ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకువస్తున్నామని..
రాష్ట్రం మునుపెన్నడూ లేనంత పెద్ద సంఖ్యలో
ఉద్యోగాలు రాబోతున్నాయనే
గొప్ప గొప్ప మాటలతో

తెలుగుదేశం పార్టీ మహానాడు
ముచ్చటగా ముగిసింది.
పార్టీ వ్యవస్థాపకుడు..
మాజీ ముఖ్యమంత్రి
నందమూరి తారకరామారావు
తన పుట్టినరోజున మహానాడు జరగాలని
నిర్ణయించుకుని
తన చేతులతో తానే స్వయంగా ఊపిరి పోసిన మహానాడు..1983 మే 28 న
పురుడు పోసుకుని అప్పటి నుంచి కొన్ని సందర్భాలు మినహా ప్రతి ఏటా నిరాటంకంగా..ఘనంగా
జరుగుతూ వస్తోంది.

అధికారంలో ఉన్నప్పుడైనా, లేనప్పుడైనా
మహానాడు అంటే
తెలుగుదేశం పార్టీకి అతి పెద్ద పండుగ..గొప్ప వేడుక..
ఎన్టీఆర్ జీవించి ఉన్న కాలంలో,ఆయన తర్వాత
చంద్రబాబు జమానాలో కూడా క్రమం తప్పకుండా ఏదో
ఒక ప్రాంతంలో మహానాడు
కార్యక్రమం జరుగుతుంది.
పార్టీ నాయకులు..శ్రేణులు
విధిగా పెద్ద సంఖ్యలో
హాజరయ్యే ఈ మహోత్సవంలో పార్టీకి..
ప్రజలకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుని
తదనుగుణంగా తీర్మానాలు చెయ్యడం ఆనవాయితీ.

ఈసారి మహానాడును
ఉత్తరాంధ్రలో నిర్వహించాలని నిర్ణయించుకుని వేదికను
కూడా ఎంపిక చేశారు.
అయితే యుద్ధం పొదుపు
పాటించాలన్న ప్రధాని నరేంద్ర మోడీ పిలుపును అనుసరించి
ఈ ఏడాది మహానాడును
వర్చువల్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించి
పార్టీ ప్రధాన కార్యాలయం నుంచే ఉత్సవాన్ని
జరిపి ముఖ్యమంత్రి ఒక సరికొత్త అధ్యాయానికి
శ్రీకారం చుట్టారు.

అయితే మహానాడు ఎక్కడిక్కడ భారీ జనసందోహం నడుమ జరగడంతో ప్రధాని మోడీ చెప్పిన పొదుపు మంత్రం
పెద్దగా అమలు జరిగిన
సూచనలు కనిపించలేదు.

దగాకోరు మహానాడని
విపక్షం విమర్శల సంగతి
ఎలా ఉన్నా..
యధావిధిగా ఈ మహానాడును
తెలుగుదేశం పార్టీ
షోపీస్ గా చిత్రీకరించడంలో చంద్రబాబు నాయుడు సక్సెస్ అయ్యారు.

రెండున్నర సంవత్సరాల పాలనపై విపక్షాల నుంచి వస్తున్న విమర్శల సంగతి పక్కన పెడితే స్వపక్షంలో, ఆపై కూటమి భాగస్వామ్యపక్షాల్లో ఉన్న అసంతృప్తిని,సందేహాలను ఎంతో కొంతమేర దూరం చేసే ప్రయత్నాన్ని మహానాడు ద్వారా విజయవంతంగా చేశారు చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు మంత్రి లోకేష్.

ఏలుబడిలో గాని,ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో గాని కూటమి ప్రభుత్వం ఎక్కడా వెనుకబడి లేదని,ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్టుగా మనం ఎందులో కూడా తగ్గేదే లేదని కార్యకర్తల్లో జోష్ నింపే విధంగా మహానాడును అట్టహాసంగా నిర్వహించారు చంద్రబాబు నాయుడు.
పార్టీ ప్రధాన కార్యాలయంలో తాను చేసిన ప్రసంగాలే గాక జిల్లాల్లో కూడా తన సందేశం కార్యకర్తలకు పక్కాగా వెళ్లి వారిలో మనోధైర్యం నింపే విధంగా చంద్రబాబు నాయుడు పక్కా ప్రణాలికతో మహానాడును ఒక వేదికగా వాడుకున్నారు.

అంతేగాక తన తర్వాత అన్నీ తన కుమారుడు లోకేష్ బాబే సుమ అన్న విధంగా నాయకులు,కార్యకర్తల ఎదుట లోకేష్ ను ఆవిష్కరించడంలో కూడా ఈ మహానాడు ద్వారా చంద్రబాబు నాయుడు కృతకృత్యుడయ్యారు.

నిజానికి ఈసారి మహానాడు ద్వారా ప్రజలకు జరిగిన ఉపకారం ఏమీ లేదు.ఇది పార్టీ కార్యక్రమమే కావచ్చు. అయితే ఎన్టీఆర్ జీవించి ఉన్న రోజుల్లో గాని ,ఆయన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత గాని మహానాడులో ప్రజలకు సంబంధించిన అత్యంత కీలకమైన తీర్మానాలు చేయడం పరిపాటి. ఈసారి ఆ విషయంలో తెలుగుదేశం పార్టీ వెనుకబడిందని చెప్పక తప్పదు.ప్రధానంగా విపక్షాల నుంచి వస్తున్న విమర్శలను తిప్పికొడుతూ తమ పాలన ఘనంగా ఉందని చెప్పుకోవడానికి మాత్రమే ఈసారి మహానాడు ఉపయోగపడింది.

ఇదిలా ఉండగా మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కేంద్ర సర్కార్ విఫలమైనా గాని మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం పక్కాగా ఉందని మహానాడు ద్వారా ప్రజలకు చెప్పే ప్రయత్నాన్ని చంద్రబాబు నాయుడు గట్టిగా చేశారు.ఈసారి మహానాడులో మహిళా రిజర్వేషన్ని ప్రధాన ఆయుధంగా తీసుకొని చంద్రబాబు నాయుడు తొలి రోజున పెద్ద ఎత్తున మహిళా రిజర్వేషన్ పై ప్రచారం చేసుకొని మహానాడుకు ఘనంగా శ్రీకారం చుట్టినట్టు భావించారు.

ఇది మినహా ఈ ఏడాది మహానాడు గురించి
పెద్దగా చెప్పుకోడానికి
ఏమీ లేనట్టే..!

        *_ఈఎస్కే.._*
Share this post
Exit mobile version