జకారం శ్రీ రామలింగేశ్వర ఆలయాన్ని పరిశీలించిన రాష్ట్ర పురావస్తు శాఖ డైరెక్టర్
ములుగు, అక్టోబర్ 17:
తెలంగాణ రాష్ట్ర పురావస్తు శాఖ డైరెక్టర్ ప్రొఫెసర్ అర్జునరావు కూటాడి శుక్రవారం ములుగు జిల్లాలోని జకారం గ్రామంలో ఉన్న రాష్ట్ర రక్షిత స్మారక చిహ్నం శ్రీ రామలింగేశ్వర ఆలయాన్ని సందర్శించారు.
ఆలయ స్థితిని పరిశీలించిన ఆయన, పురావస్తు శాఖ సిబ్బందితో చర్చించి అభివృద్ధి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
భక్తులు, పర్యాటకులు ఆలయ చరిత్రను తెలుసుకునేలా సమాచార బోర్డులు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే, ఆలయ గోడలపై వేసిన చున్నా పూతను రసాయన పద్ధతిలో శుభ్రపరచి శిల్పాలు, శాసనాలు స్పష్టంగా కనిపించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆలయాన్ని సమగ్రంగా పరిశీలించిన అనంతరం, అవసరమైతే ఈ ఆలయ అభివృద్ధి కోసం ఆర్థిక అంచనాలు సిద్ధం చేసి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు పంపుతామని ప్రొఫెసర్ అర్జునరావు తెలిపారు.
ఈ సందర్శనలో ఉపడైరెక్టర్లు డాక్టర్ పి. నాగరాజు, ఎన్. నర్సింహ నాయక్, డైరెక్టర్ పి.ఏ. సాయి కిరణ్, గ్రామస్థులు పాల్గొన్నారు.
జకారం శ్రీ రామలింగేశ్వర ఆలయాన్ని పరిశీలించిన రాష్ట్ర పురావస్తు శాఖ డైరెక్టర్
