అమరావతిలో శ్రీవారి ఆలయ విస్తరణకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన
రూ.260 కోట్లతో రెండు దశల్లో అభివృద్ధి – రెండేళ్లలో పనులు పూర్తి చేయాలని ఆదేశం
అమరావతిలోని వెంకటపాలెం వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని తిరుమల నమూనాలో అత్యంత వైభవంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రూ.260 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న విస్తరణ పనులకు ఆయన గురువారం శంకుస్థాపన చేశారు. ఈ భారీ ప్రాజెక్టును రెండున్నరేళ్లలో పూర్తిచేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులను సీఎం ఆదేశించారు.
రెండు దశల్లో అభివృద్ధి పనులు
టీటీడీ రూపొందించిన ప్రణాళిక ప్రకారం ఆలయ అభివృద్ధి రెండు దశల్లో పూర్తి కానుంది.
మొదటి దశ – రూ.140 కోట్లు
- ఆలయం చుట్టూ ప్రాకారం
- ఏడు అంతస్తుల మహారాజ గోపురం
- ఆర్జిత సేవా మండపం
- అద్దాల మండపం, వాహన మండపం, రథ మండపం
- ఆంజనేయస్వామి ఆలయం
- పుష్కరిణి నిర్మాణం
- కట్ స్టోన్ ఫ్లోరింగ్
రెండో దశ – రూ.120 కోట్లు
- శ్రీవారి మాడ వీధులు, అప్రోచ్ రోడ్లు
- మహత్తర అన్నదాన సముదాయం
- యాత్రికుల విశ్రాంతి గృహాలు
- అర్చకులు–సిబ్బందికి నివాస గృహాలు
- పరిపాలన భవనం, ధ్యానమందిరం
- విస్తృత వాహన పార్కింగ్ సౌకర్యాలు
రాజధాని రైతులకు సీఎం ధన్యవాదాలు
ఈ సందర్భంగా జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ, అమరావతిని దేవతల రాజధాని అనే గుర్తింపుతో నిర్మించాలన్న సంకల్పాన్ని గుర్తుచేశారు.
“రాజధాని నిర్మాణానికి 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారు. గత ఐదేళ్లలో వారికి ఎన్నో కష్టాలు వచ్చాయి. ‘న్యాయస్థానం టు దేవస్థానం’ అంటూ వారు చేసిన పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుంది” అని అన్నారు.
వ్యక్తిగత అనుభూతులను పంచుకున్న సీఎం
తాను శ్రీవారి భక్తుడినని, తమ ఇంటిదైవం కూడా వేంకటేశ్వరుడే అని చంద్రబాబు పేర్కొన్నారు.
“మా ఇలి నుంచి శేషాచలం కనిపిస్తుంది. చిన్నప్పటి నుంచే స్వామివారి ఆశీస్సులు ఉన్నాయి. నక్సలైట్లు క్లైమోర్ మైన్లు పేల్చిన ఘటనలో నేను బతికినందుకు కూడా స్వామివారిదే దయ” అని గుర్తుచేశారు.
దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాల నిర్మాణానికి సంకల్పం
రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలో ఆలయాలను అభివృద్ధి చేయాలని, దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని సీఎం తెలిపారు. ముంబైలో రేమాండ్స్ సంస్థ రూ.100 కోట్లతో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తున్న విషయాన్ని ఆయన ఉదహరించారు. భక్తులందరూ ఆలయ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, ఆనందం, అభివృద్ధి కోసం స్వామివారి ఆశీస్సులు కోరుతూ కార్యక్రమాన్ని ముగించారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, నారాయణ, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఎమ్మెల్యేలు, టీటీడీ బోర్డు సభ్యులు, రైతులు, భక్తులు పాల్గొన్నారు.

