Site icon MANATELANGANAA

సామాజిక ఉద్యమకారులు న్యాయవాద వృత్తిలోకి రావాలి

advocates profession

  రాజ్యాంగంలో పొందుపరచిన సామాజికన్యాయం, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను కాపాడుకోవాలంటే సామాజిక ఉద్యమకారులు న్యాయవాద వృత్తిలోకి రావాలని హనుమకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు పులి సత్యనారాయణ అన్నారు. కొత్తగా న్యాయవాద వృత్తిలోకి వచ్చిన ఐరబోయిన బిక్షపతి, అడ్లూరి పద్మ లకు శుక్రవారం హనుమకొండ కోర్టు బార్ హాలులో నెక్ బ్యాండ్ కట్టి న్యాయవాద వృత్తిలోకి స్వాగతిస్తూ ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం అమలు ద్వారానే సామాజిక న్యాయం జరిగి సమసమాజం ఏర్పడుతుందని, సామాజిక ఉద్యమాల్లో ఉన్నవారు న్యాయవాద వృత్తిలోకి వస్తె సమాజానికి మేలు జరుగుతుందని అన్నారు. న్యాయవాదులకు రాజ్యాంగం పట్ల అవగాహనతో పాటు సామాజిక అవగాహన, సామాజిక చైతన్యంతో ఉండాలని అన్నారు. కొత్తగా న్యాయవాద వృత్తిలోకి వచ్చిన ఐరబోయిన బిక్షపతి, అడ్లూరి పద్మలు క్రమశిక్షణతో వృత్తిలో రాణించాలని, సమాజంలోనున్న రుగ్మతలను రూపుమాపడంలో, మనుషుల మధ్యనున్న తగాదాలను, కక్షలను ప్రాధమిక స్థాయిలోనే పరిష్కరించి మొదటి న్యాయమూర్తులుగా నిలవాలని సూచించారు.


ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు సాయిని నరేందర్ మాట్లాడుతూ రాజ్యాంగ విలువలు, రాజ్యాంగంలో పొందుపరచిన విషయాలను సామాన్య ప్రజలకు తెలియజెప్పి చైతన్యం చేయడంలో న్యాయవాదులు ముందుండాలని విజ్ఞప్తి చేశారు. సకల అసమానతలు రూపుమాపి సమసమాజ నిర్మాణం కోసం వ్రాసుకున్న భారత రాజ్యాంగం పట్ల మెజార్టీ న్యాయవాదులకు అవగాహన లేదని, న్యాయవాద వృత్తికి సంబంధించిన అవగాహనతో పాటు సమాజానికి రాజ్యాంగానికి ఉన్న సంబంధాన్ని, రాజ్యాంగంలో పొందుపరచిన మానవ హక్కులను న్యాయవాదులు నిశితంగా అధ్యయనం చేయడమే కాకుండా రాజ్యాంగ అమలుకు ప్రజల భాగస్వామ్యంతో రాజ్యంపై ఒత్తిడి తేవాలని అన్నారు. 

ఈ కార్యక్రమంలో హనుమకొండ, వరంగల్ బార్ అసోసియేషన్ మహిళా సంయుక్త కార్యదర్శులు నాగేంద్ర, శశిరేఖ, న్యాయవాదులు ఆశీర్వాదం, బండి మొగిలి, ఉమ గౌడ్, జన్ను పద్మ, డాక్టర్ జిలకర శ్రీనివాస్, బి ఎస్ పాణి, దండు మోహన్, ఎగ్గడి సుందర్ రామ్, గుడిపాటి లక్ష్మీ, ఆరేపల్లి త్రివేణి, బండ రేష్మ, సుకన్య, మమత తదితరులు పాల్గొన్నారు.

Share this post
Exit mobile version