Site icon MANATELANGANAA

SIR ఓటరు నమోదు: 2002 జాబితా గందరగోళం.. గడువు సమీపిస్తున్నా తొలగని ఇబ్బందులు

SIR’ అంటేనే హడల్….
అడుగడుగునా అవరోధాలే…!
2002 జాబితాలో కానరాని ఎపిక్ నంబర్లు….!!
2008, 2014 లో పేర్లున్నా..సున్నానే…!!!
ముంచుకొస్తున్న గడువు…
VIP కేంద్రాల్లో స్పీడప్…
హెడ్క్వార్టర్స్ లో నత్తనడక…
చేస్తున్నవారికే అదనపు పనులు…
కనీసం 35 శాతం ఓట్లు గల్లంతేనా..
మారుమూల ప్రాంతాల్లో అయోమయం..
వలస వెళ్లినోళ్ల ఓట్లు హుళక్కే..

*_అచ్యుత రఘునాథ్_* 

*ప్రత్యేక ప్రతినిధి *హన్మకొండ / వరంగల్*

ఓటరు నమోదు… సవరణ కోసం భారత ఎన్నికల సంఘం (Election Commission of India – ECI ) ప్రవేశపెట్టిన ‘Special Intensive Revision ( SIR )’ ప్రక్రియ ప్రహసనం గా మారింది…. దీనిలో భాగంగా ఇచ్చే ‘ఎన్యూమరేషన్ దరఖాస్తు ఫారం’ నింపడంలో అడుగడుగునా ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. ఒకపక్క ముంచుకొస్తున్న గడువు…మరోపక్క కానరాని ఎన్యూమరేషన్ ఫారాలు…కనీసం రెండున్నర దశాబ్దాల క్రితం నాటి ఓట్లు ఎక్కడ ఉన్నాయో తెలియని దుస్థితి…కొత్త జాబితాలో తమ అనుకూల ఓటర్లకు చోటు కోసం ప్రధాన పార్టీల సర్కస్ ఫీట్లు…అధికార బృందాల క్షేత్రస్థాయి పర్యటనలతో పల్లె.. పట్టణాల్లో సందడి నెలకొంది.

SIR India Phase 2…ఎన్యుమరేషన్ ఫామ్‌ నింపేందుకు వీలుగా గుర్తించిన దీనిని తెలుగులో ‘గణన/ఓటరు వివరాల ఫారం’ అని పిలుస్తారు. ఓటర్ల జాబితాను సరిగ్గా అప్‌డేట్ చేయడానికి, కొత్త పేర్లను చేర్చడానికి, పాత రికార్డుల్లోని తప్పులను సరిదిద్దడానికి ఈ ఎన్యూమరేషన్ ఫారంను ఉపయోగించాలని నిర్దేశించారు. దీనికోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించిన ఎన్నికల కమిషన్ గ్రామ,పట్టణ,మండల నియోజకవర్గ, జిల్లా స్థాయిలో అధికార బృందాలను నియమించారు. ఈ నెల 24 వ తేదీ వరకు ప్రక్రియ ముగించాలన్న గడువు విధించడం విశేషం. అయితే క్షేత్ర స్థాయిలో అడుగడుగునా ఇటు సిబ్బందికి…అటు ఓటర్లకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రధానంగా ఎప్పుడో రెండున్నర దశాబ్దాల క్రితం ఉన్న గత 2002 SIR నాటి ఓటర్ల జాబితాలో తమ పేర్లు తెలుసుకోవడం… వాటిని ఇప్పటి 2026 SIR ఓటర్ల జాబితాతో.. మ్యాపింగ్ చేయడమే తలకు మించిన భారంగా మారింది.

కానరాని ఓటర్ల ఐడి నెంబర్లు…
ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు తనిఖీ చేసి నమోదు చేయాల్సిన 2002 కీలకమైన ఓటర్ ఐడి నెంబర్లు కానరావడంలేదు. కనీసం అప్పటి జాబితాలో ఎపిక్ నెంబర్ల కాలమ్ కూడా ఖాళీగా ఉండడం తలనొప్పిగా మారింది. ఇలా అన్ని పోలింగ్ కేంద్రాల్లో అప్పటి ఎపిక్ నంబర్లు కనిపించకపోవడం తో… నియోజకవర్గం, పోలింగ్ కేంద్రం, జిల్లా కోడ్ నంబర్లూ అప్పటికీ..ఇప్పటివాటికీ మధ్య కనీస సారూప్యం లోపించడం తో అంతా గందరగోళం గా మారింది. 24 సంవత్సరాల క్రితం జాబితా నుంచి ఎపిక్ కోడ్ నెంబర్ల వరకూ అన్నీ పూర్తిగా మారిపోవడమే ఈ ఇబ్బందులకు కారణమవుతోందనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

2008…2014 ఓటరు ఐడిలుఉన్నా…వృధాయే…!
తాజా ఓటర్ల జాబితాలో పేర్లు ఉండి…గత 2008, 2014 ఓటర్ ఐడి లు ఉండి వరుసగా…2009, 2014, 2018, 2023ఎన్నికల్లో ఓటు వేసినప్పటికీ 2002 నాటి ఓటర్ల జాబితాలో పేర్లు లేకుంటే మాత్రం అంతా వృధాయే కావడం ఆందోళన కలిగిస్తోంది. ఖచ్చితంగా 2002 ఓటర్ల జాబితానే 2026 SIR కు ప్రామాణికం కావడం విశేషం.

ముంచుకొస్తున్న గడువు…
ప్రధానంగా SIR ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ పూర్తయిందని ఆధికార యంత్రాంగం చెబుతున్నా…ఇంకా అనేక ప్రాంతాల్లో ఫారాలు కానరావడం లేదు. ఇక పంపిణీ చేసిన ఫారాలు అన్ని వివరాలతో పూర్తి చేసి తిరిగి సమర్పించే వారి సంఖ్య కూడా పడిపోయింది. 2002 ఓటర్ల కుటుంబాలకు సంబంధించి ఎలా నింపాలి…ఏయే వివరాలు ఇవ్వాలి… అప్పటి కానరాని కార్డుల నెంబర్లూ..ప్రతి ఒక్కరినీ వెక్కిరిస్తున్నాయి. ఇంకా సమర్పించాల్సిన ఎన్యూమరేషన్ ఫారాలు తమ వద్ద ఉన్నాయని… కేవలం రెండువారాల గడువు మాత్రమే ఉన్నందువల్ల ఏం చేయాలో పాలు పోవడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఇదే…
హన్మకొండ…వరంగల్ ప్రధాన కేంద్రాల్లోని క్షేత్ర స్థాయి పరిస్థితిని పరిశీలిస్తే.. పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి.. వీఐపీ పోలింగ్ కేంద్రాల్లో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పుంజుకోగా..ఇతర ప్రాంతాల్లో కనీసం ఇప్పటికీ ఒక్క ఫారం అందని దుస్థితి ఆందోళన కలిగిస్తోంది. అయితే… ఇటు హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, అటు వరంగల్ కలెక్టర్ సత్య శారద స్వయంగా అధికార యంత్రాంగం తో కలిసి పల్లె, పట్టణాల్లో కలియ తిరుగుతూ ఓటర్లకు SIR ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ లో సహాయ సహకారాలు అందించడమే కాకుండా…ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయి సమస్యలను పరిశీలించి త్వరితగతిన అవసరమైన ఆదేశాలు జారీచేయడం ఆసక్తికరంగా మారింది.

కాకతీయ కాలనీ ఫేజ్-2 జోలికెళ్లని బృందం…
హన్మకొండ – వరంగల్ కు వారధి గా ఉండే..ములుగు రోడ్ కు కూత వేటు దూరంలో ఉన్న కాకతీయ కాలనీ ఫేస్ -2 లో కనీసం ఒక్క ఎన్నికల బృందం పర్యటించకపోవడం విమర్శలకు తావిస్తోంది. గ్రేటర్ లో 9వ డివిజన్ పరిధిలోనే ఉన్న ఇక్కడ విద్యావంతులు అధికంగా ఉన్నప్పటికీ …SIR ఎన్యూమరేషన్ ఫారాలు ఇప్పటికీ అందకపోవడం విశేషం. ఒక పక్క సమర్పించేందుకు తుది గడువు సమీపిస్తున్నా ఎన్యూమరేషన్ బృందాలు కన్నెత్తి చూడకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

సుబేదారి లో జోరు…
హన్మకొండ, వరంగల్ కలెక్టరేట్ల తో పాటు అధికార, ప్రజాప్రతినిధులు, వీఐపీలు అధికంగా ఉండే సుబేదారి ప్రాంతాల్లో మాత్రం ఎన్యూమరేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఇక్కడ 90 శాతంకు పైగానే ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ జరిగిందంటున్నారు. తాజాగా… గురువారం ఎన్యూమరేషన్ ఫారాలు దాఖలు చేసే ప్రక్రియ జరుగుతోందని చెబుతున్నారు. అన్నీ భర్తీ చేసి సమర్పిస్తున్న వారికోసం అధికార బృందాలు ప్రత్యేకంగా ఇక్కడ తిరగడం విశేషం. ఈ సందర్భంగా SIR ఎన్యూమరేషన్ కార్యాచరణకు సంబంధించిన బృందానికి నాయకత్వం వహిస్తున్న R I మరుపట్ల మల్లయ్య, BLO కే.రాణి స్వయంగా తాజా పరిస్థితిని వివరిస్తూ…నిర్ణీత గడువులోగానే నిర్దేశిత లక్ష్యాలను సాధించేందుకు క్షేత్ర స్థాయిలో తిరుగుతున్నామని చెప్పారు.

వలస వెళ్లినోళ్ల ఓట్లు గల్లంతే…
ఎన్యూమరేషన్ సమయంలో స్థానికంగా లేని వారి ఓట్లు గల్లంతే…అంటున్నారు. కనీసం కుటుంబ సభ్యుల్లో ఒక్కరున్నా…SIR ఫార్మ్స్ నింపి కుటుంబ పెద్దగా ధృవీకరించవచ్చని అంటున్నారు. ఒక్కరూ లేకుంటే మాత్రం వాళ్ళ ఓట్లు కొత్త సవరణ జాబితాలో చోటు చేసుకోక పోవచ్చని స్పష్టమవుతోంది. జూలై 24 వ తేదీ లోగా ఆయా ఎన్యూమరేషన్ ఫార్మ్స్ తీసుకుని సమర్పించాల్సిందేనని ఎన్నికల అధికారులు చెబుతున్నారు.

పార్టీల హడావుడి…
ఎన్యూమరేషన్ ప్రక్రియలో పార్టీల హడావుడి అన్ని ప్రాంతాల్లో కనిపిస్తోంది. కనీసం ఎన్యూమరేషన్ ఫారాలు రాని వారికి తెచ్చి ఇవ్వడం…అంతే స్థాయిలో వాటిని భర్తీ చేసి సమర్పించడం.. తమకు అనుకూలమైన ఓట్ల వివరాలు సేకరించి భద్ర పరచుకునేందుకు నడుం బిగించిన పార్టీ నేతలు అడుగడుగునా కనిపిస్తున్నారు. ఇలా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలే పోటీపడడం విశేషం. ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ ఓటర్ల ఎన్యూమరేషన్ ప్రక్రియ కు చేయూత ఇస్తున్న వీరంతా ఆయా ఓట్లు నిలుపుకొని..ఓటర్లను తమకు అనుకూలంగా ఎలా ప్రసన్నం చేసుకుంటారో..వేచి చూడాల్సిందే..!

Share this post
Exit mobile version