Site icon MANATELANGANAA

బి.సి రిజర్వేషన్ల కోసం హిందూ బి.సి మహాసభ అధ్యక్షులు బత్తుల సిద్దేశ్వర్మ ఆమరణ దీక్ష

బి.సి రిజర్వేషన్ల కోసమే నా ఆమరణ దీక్ష

హిందూ బి.సి మహాసభ అధ్యక్షులు బత్తుల సిద్దేశ్వర్

బి.సి రిజర్వేషన్ల చట్టం చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలి

ఆమరణ దీక్ష చేస్తున్న సిద్ధేశ్వర్ కు సంఘీభావం తెలిపిన ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్

నా ఆమరణ దీక్షతో స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం రిజర్వేషన్లు సాధిస్తానని, తెలంగాణలోని బి.సి ఉద్యమ శక్తులతో పాటు ఎస్సీ, ఎస్టీ సంఘాలు నా పోరాటానికి మద్దతుగా నిలవాలని హిందూ బి.సి మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు బత్తుల సిద్ధేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ లో బి.సి లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఆ ప్రక్రియ పూర్తి కాకుండానే సర్పంచ్ ఎన్నికలకు వెళ్ళడాన్ని నిరసిస్తూ రెండు రోజుల క్రితం ఆమరణ నిరహార దీక్ష చేపట్టిన సిద్ధేశ్వర్ ను హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో శనివారం ప్రజా సంఘాల నాయకులు పరామర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. 
తెలంగాణలో ఆగమేఘాల మీద 17 శాతం బీసీ రిజర్వేషన్ లతో ఎన్నికలకు వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి  బీసీలకు మిగిల్చుతుంది నమ్మకద్రోహం, నయవంచన, మోసమని వారి లెక్కల ప్రకారమే 56 శాతం ఉన్న బీసీలకు 42 శాతం ఇస్తామన్న హామీని తుంగలో తొక్కి తప్పనిసరి పరిస్థితుల్లో 23 శాతం ఇవ్వాల్సి వస్తుందని చెబుతూ చివరికి 17 మాత్రమే బీసీలకు రిజర్వ్ చేశారని అన్నారు. ఎనకటికి ఒక సామెత ఉంది " పంచ పాండవులంటే మంచం కోళ్లోలాగ ముగ్గురనీ" అని రెండు వేళ్ళు చూపినట్టు తెలంగాణలో నమ్మకద్రోహాన్ని సమర్థించుకోవడానికి పార్టీ తరఫున 60 శాతం ఇవ్వనున్నట్లు చెబుతున్నారని విమర్శించారు. 
  కానీ పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తుల మీద జరిగేవి కావని, వారి పార్టీ తరఫున ఎవరికి ఇచ్చారనేది లెక్క పత్రం ఏది ఉండదని, ఒకవేళ ఏదైనా గ్రామంలో వారి పార్టీ తరఫున బీసీ అభ్యర్థి ఫలానా అని పైకి చెబుతూ లోలోపల మరో ఆధిపత్య అభ్యర్థిని రెబల్ గా నిలబెట్టి గెలిపించుకొని తిరిగి పార్టీలో కలుపుకునే కుట్రలే ఉంటాయని, ఇటువంటి కుట్రలు ఎన్నో చేసినవారే బీసీలను మరోసారి మోసగించడానికి వారి వ్యూహం ఉందని అన్నాడు.
  ఉదయపూర్ డిక్లరేషన్ అమలు నుండి తప్పించుకోవడానికి కామరెడ్డి డిక్లరేషన్ ముందుకు తెచ్చారని, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ ఆశ చూపుతూ ఎమ్మెల్యే సీట్లు, మంత్రి పదవులు, కార్పొరేషన్ పదవులు, నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్సీలు అన్నిట్లో అగ్రభాగం వారి వర్గానికే ఇచ్చుకున్నాడని అన్నారు. చివరికి 42 శాతం రిజర్వేషన్లు నాన్చి, నాన్చి అనేక విన్యాసాలు చేసి చట్టబద్ధంగానే 42 శాతం ఇస్తామని మాయమాటలు చెప్పి సడిసప్పుడు లేకుండా తడి గుడ్డతో బీసీల గొంతు కోశారని అన్నారు. 42 శాతం రిజర్వేషన్ కోసం, కులగణన కోసం నేను రెండుసార్లు ఆమరణ ద్దీక్ష చేసిన విషయం మీకు తెలిసిందేనని, చట్టసభల్లో బి.సి వాటా కోసం 400 కిలోమీటర్ల పాదయాత్ర చేసి లక్షలాది ప్రజలను చైతన్యం చేశామని పూలే, అంబేద్కర్, గాంధీ, పెరియార్ లాంటి  మహనీయుల స్పూర్తితో శాంతియుత పోరాటాలతో బి.సి హక్కుల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. 
  కొద్దిపాటి తేడాతో అన్ని అగ్రకుల నాయకత్వ పార్టీలు బీసీలకు ద్రోహం చేస్తూనే వస్తున్నాయని, ద్రోహం కంటే నమ్మక ద్రోహం బరించలేనంత మోసమని, అంతటి నమ్మక ద్రోహం చేస్తున్న వాడిగా రేవంత్ రెడ్డి మిగిలిపోనున్నాడని అన్నారు. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్న బీసీ రాజకీయ ఆశావాహుల పరిస్థితి నేడు అగమ్య గోచరంగా మారిందని, పల్లెల్లో గెలుపుతోనే ఢిల్లీ గెలుపు ముడిపడి ఉంటుందని, పల్లెల్లో గెలవలేనప్పుడు భవిష్యత్ లో ఎంపీటీసీ, జెడ్పిటిసి, ఎమ్మెల్యే, ఎంపీ ఎలా గెలవగలమని అన్నారు. బీసీ ఆశావహుల ఆశలకు పల్లెల్లో బొంద పెట్టిన రేవంత్ రెడ్డి కుట్రలను, నమ్మక ద్రోహాన్ని ఎండగడుతూ పల్లెల్లో బీసీల ఐక్యతను నిలబెట్టుకోవాడానికి, బీసీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ఉద్యమించాల్సిన సమయమని అన్నారు. దీని కోసం పల్లె నుండి పట్నం వరకు రిలే దీక్షలతో, ఆమరణ దీక్షలతో ఎవరికి తోచిన విధంగా వారు బీసీ ఉద్యమంలో కదలిక రావడం కోసం తను మళ్ళీ ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నానని అన్నారు. 
 ఆమరణ దీక్ష చేస్తున్న బత్తుల సిద్దేశ్వర్ కు గాంధీ ఆసుపత్రిలో సంఘీభావం తెలిపిన ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్ మాట్లాడుతూ బి.సి రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించిన తర్వాతనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని, అలా కాకుండా ముందుకు వెళితే బత్తుల సిద్దేశ్వర్ లాగా రాష్ట్రంలో అన్ని చోట్ల ఆమరణ దీక్షలకు దిగుతామని హెచ్చరించారు. బి.సి రిజర్వేషన్లను చట్టం చేయాల్సిన కేంద్రంలోని బిజెపి పార్టీని ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. సిద్దేశ్వర్ సంఘీభావం తెలిపిన వారిలో ఆల్ ఇండియా ఒబిసి జాక్ వైస్ చైర్మన్ పటేల్ వనజక్క, ప్రజాస్వామ్య  బి.సి ఉద్యమ వేదిక రాష్ట్ర కన్వీనర్ గాలీబు అమరేందర్, బి.సి న్యాయవాదులు సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి పొన్నం  దేవరాజ్ గౌడ్, న్యాయవాదులు టి.లక్ష్మీదేవి, కె సురేష్, తౌడబోయిన రేణుక, వివిధ సంఘాల నాయకులు నందు, కొంగర నరహరి, దుబ్బకోటి ఆంజనేయులు, అలీం, పర్వత సతీష్ పటేల్, పంతుల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
Share this post
Exit mobile version