Site icon MANATELANGANAA

సావిత్రిబాయి పూలే స్పూర్తితో వాటాలో కోటా సాధిద్దాం

సావిత్రిబాయి పూలే స్పూర్తితో వాటాలో కోటా సాధిద్దాం

శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించి, ఎంతో నాగరికతను సాధించామని చెప్పుకునే సమాజం మహిళా సమాజం పట్ల వివక్షతను రూపుమాపలేకపోతుంది. కుల వివక్ష, వర్గ వివక్ష తో పాటు లింగ వివక్ష కొనసాగుతూనే ఉంది. ఇంటా బయట మహిళలపై హత్యలు, హత్యాచారాలు, హింస కొనసాగుతూనే ఉంది. ప్రతి 10 నిమిషాలకు ఒక మహిళ లేదా బాలిక హత్యకు గురవుతున్నారు. 2023లో ప్రపంచవ్యాప్తంగా 85,000 మంది మహిళలు మరియు బాలికలు ఉద్దేశపూర్వకంగా హత్యకు గురయ్యారు. ఈ హత్యలలో 60 శాతం 51,000 మంది సన్నిహిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల చేతుల్లోనే హత్యకు గురయ్యారు. ప్రతిరోజూ 140 మంది మహిళలు మరియు బాలికలు తమ భాగస్వామి లేదా దగ్గరి బంధువుల చేతుల్లో మరణిస్తున్నారని డేటా చూపిస్తుంది. వివక్ష, కుల ఆధారిత హింస, అసమాన అధికార సంబంధాలు, హానికరమైన పద్ధతులు, అక్రమ రవాణా ద్వారా స్త్రీ హత్య జరుగుతుంది.
సావిత్రిబాయి పూలే జన్మించిన శూద్ర సమాజం కూడా ఈ వివక్షత బావాజాలానికి, అనుభవానికి దూరం కాలేకపోయింది. ఆమె ప్రదర్శించిన సాంఘీక చైతన్యం ఈ సమాజానికి ఎంత అవసరమో మొదటగా గుర్తించాల్సింది మహిళలే. ఆమె మహిళ విద్యకు ఆది గురువన్న విషయం విద్యాధికులైన మహిళా సమాజానికే తెలియని పరిస్థితి నెలకొని ఉంది. సాంఘీక చైతన్యం లేని సమాజం నిరంతరం ఘర్షణ పడి హింసల పాలవుతుందన్నది చారిత్రక సత్యం. ఈ సత్యాన్ని మొదటగా గ్రహించిన సావిత్రిబాయి పూలే దంపతులు 180 ఏండ్ల క్రితమే సమస్య పరిష్కారానికి సమాజాన్ని జాగృతం చేశారు.
ఎన్నో శతాబ్దాలుగా దేశంలోని చాకిరి కులాలు విద్యకు దూరం చేయబడ్డారు. మానవ చైతన్యానికి విద్య ఎంతటి గొప్ప సాధనమో వీరు ముందుగా గుర్తించారు. లింగ వివక్షత కారణంగా మహిళలను దూరం చేయడాన్ని సామాజిక అభివృద్ధికి గొప్ప ఆటంకంగా భావించిన వీరు మొదటగా స్త్రీలకు విద్య నేర్పే విషయంలో క్రియాశీలక పాత్ర నిర్విహించారు. సామాజిక మద్దతు లభించని తరుణంలో తన ఆడపడుచు సుగుణాబాయి తో కలిసి భర్త జ్యోతిరావు పూలే వద్ద విద్య నేర్చుకొన్నారు. ఆ విధంగా వారి లక్ష్య సాధనలో తన విజయవంతమైన మొదటి అడుగు వేసారు. 1848 లో శూద్ర కులాల మహిళలను సమీకరించి పూణేలో వీరు మహిళా మొదటి పాఠశాలను స్థాపించారు. ఈ పాఠశాలకు శూద్ర కులాల మహిళలనుండి ఆదరణ లభించి చాలామంది చేరి విద్య నేర్చుకుంటుండంతో ఈ విషయం దేశ వ్యాపితంగా సంచలన చర్చగా మారింది. మహిళలు విద్య నేర్వడం మహా పాపమని ప్రచారం చేస్తూ వచ్చిన బ్రాహ్మణ వాదానికి తిరుగులేని దెబ్బ తగిలినట్లైంది. దాంతో బ్రాహ్మణులు అహం దెబ్బ తిన్నట్లుగా భావించి వారంతా కలిసికట్టుగా శూద్ర కులాల మహిళలకు విద్యను కొనసాగించే క్రమాన్ని విచ్చిన్నం చేయడానికి ఎన్నో కుట్రలు కుతంత్రాలు పన్ని, ఆటంకాలు కల్పించారు. ఈ క్రమంలో బ్రాహ్మణుల ఒత్తిడితో పూలే దంపతులు వారి ఇంటి నుండి బయటకు నెట్టివేయబడ్డారు. అయినా సావిత్రిబాయి పూలే దంపతులు వెనక్కి తగ్గకుండా మరో అడుగు ముందుకు వేసి విద్యాభివృద్ధికి కృషి చేసారు. సమాజములో అంటరానివారుగా చూడబడుతున్న దళిత మహిళలకు విద్యను అందించడానికి వారి గూడాలకు తరలిపోయారు. సాటి దళిత మహిళకు విద్యను అందించే క్రమంలో శూద్రుల నుండి కూడా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. లోపాయికారి బ్రాహ్మణముల ప్రోద్బలంతో సావిత్రిబాయి దళిత గూడేనికి వచ్చిపోయే దారిలో పేడ నీళ్లను, మురికి నీళ్లను చల్లి, రాళ్లు రువ్వి ఆమెను శారీరకంగా, మానసికంగా ఎంతగానో హింసించి భయపెట్టారు. అయినా ఆమె సంకల్పం నుండి ఒక అడుగు కూడా వెనక్కి తగ్గలేదు ఆమె సాహసం ముందు దుర్మార్గమే ఓడి పోయింది. ఒక సామాజిక అభివృద్ది కోసం, సాంఘీక చైతన్యం కోసం ఆమె ప్రదర్శించిన ధైర్యం, సాహసం, సంకల్పం యావత్ సమాజం గుర్తుంచుకోవాల్సిన గొప్ప విషయం.
ఆ కాలంలోనే సావిత్రిబాయి పూలే చాకిరి, అంటరాని కులాలకు విద్య అందించిన నేటికి ఆమె ఆశయం నెరవేరకపోగా తిరిగి శూద్ర దళిత కులాలు విద్యకు దూరమయ్యే సామాజిక పరిస్థితులు దాపురిస్తున్నాయి. ప్రభుత్వం విద్యను వ్యాపారం చేసి తన సామాజిక బాద్యతనుండి తప్పుకుంటున్నది. బ్రతకడం కోసమే తండ్లాడుతున్న అనేక దళిత బహుజన కులాలు విద్యను కొనలేక అనివార్యంగా విద్యకు దూరం కావాల్సిన పరిస్తులు దాపురిస్తున్నాయి. రూపం మారిన సామాజిక జీవనములో బ్రాహ్మణ వాదం బహుజన సమాజాన్ని నేటికి పీడిస్తూనే ఉంది.
ఆనాటి సామాజిక దుర్మార్గాలను వ్యతిరేకించిన పూలే సత్యశోధక్ సమాజాన్ని స్థాపించి కుల, వర్గ వివక్షతను, లింగ వివక్షతను, వితంతు వివక్షతను రూపుమాపడం కోసం చేసిన కృషికి ఆమె తోడ్పాటు చాలా గొప్పది. వీరు చేస్తున్న సామాజిక చైతన్య కార్యక్రమాలను ఆపలేని బ్రాహ్మణ వర్గాలు తన పై ప్రత్యక్ష దాడులకు దిగిన ధైర్యంగా ఎదుర్కోవడమే కాకుండా బ్రాహ్మణుల సూచనలతో జ్యోతిరావు పూలే ను హత్య చేయడానికి వచ్చిన దళితను నిలువరించి వారికి బోధించి వారిని సత్యశోధక్ సమాజ్ లో చేరే విధంగా మార్చివేసిన ఘనత కూడా సావిత్రిబాయికి ఉంది. జ్యోతిరావుపూలే మరణానంతరం కూడా ఆయన స్థాపించిన సత్యశోధక్ సమాజ్ కార్యకలపాలను కొనసాగిస్తూ వచ్చిందంటే ఆమె ఎంతటి దృఢ చిత్తురాలో మనం అర్ధం చేసుకోవచ్చు.
ఆ కాలంలోనే ఎన్నో విలువలు బోధించి ఆచరణాత్మక ఉద్యమం చేసిన పూలే దంపతుల చరిత్ర నేటి సమాజంలో విస్తృత పరచకపోవడం వల్లనే నేటి సమాజంలో ఇంకా వివక్షత కొనసాగుతుంది. ప్రతి ఇంటా ఒక సావిత్రిబాయి పూలే తయారు కావల్సిన అవసరముంది. తల్లి జ్ఞానం చైతన్యం కలిగి ఉంటే భవిషత్ సమాజం విలువల సమాజంగా మారుతుందనే విషయం గమనించాలి. స్త్రీల పట్ల సమానత్వం గౌరవం పెంచే సమాజం సావిత్రిబాయి పూలే జీవితం నుండి నేర్చుకోవాలి.

పూలే దంపతుల కాలం నుండి ఎందరో మహానీయుల త్యాగపూర్తిగా పోరాటాల వల్ల దేశంలోని మహిళలు కొంత మేరకు అభివృద్ధి చెందినప్పటికీ అభివృద్ధి ఆధిపత్య వర్గాల మహిళలకే పరిమితమైంది. రాజకీయంగా జాతీయ స్థాయి నాయకులుగా ఎదిగిన స్త్రీలంతా ఆదిపత్య కులస్తులే. బహుజన రాజకీయ చైతన్యం వల్ల బేహన్ జీ మాయావతి, మాన్యశ్రీ మీరా కుమారి మాత్రమే అందుకు మినహాయింపు. రాజకీయంగా ఎదగాలని ఆరాటపడుతున్న ఆధిపత్య కులాల స్త్రీలు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించుకుంటూ చట్టం చేశారు. ఈ రిజర్వేషన్ల వల్ల ఆదిపత్య కులాల స్త్రీలే బాగుపడతారని బహుజన నాయకులు చేస్తున్న విమర్శను ఖాదర్ చేయకుండా బిజెపి ప్రభుత్వం చట్టం చేసింది. మహిళా కోటాలో బహుజన కోటా కోసం జరుగుతున్న పోరాటాన్ని ఆధిపత్య కులాల వారు అవహేళన చేస్తున్నారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ లేకపోవడం వల్ల జరిగిన నష్టం కళ్ళ ముందు కనబడుతుంటే మహిళలకు కల్పిస్తున్న రిజర్వేషన్లు బీసీ మహిళల వాటా ఎంతో స్పష్టంగా చెప్పాలని అడగడంలో తప్పేముంది.
భారత జనజీవనములో సగభాగమైన మహిళను దశాబ్దాలుగా అణచివేసిన చరిత్ర వెనుక మనుధర్మమనే (అ)ధర్మశాస్త్రం ప్రధానంగా పని చేసిందన్న సత్యం మరువలేనిది. “న స్త్రీ స్వాతంత్ర మర్హతి”, “న స్త్రీ విద్యార్హతి” అంటూ రాజా శాసనంగా మహిళపై పురుషాధిక్యతను స్థిరపరిచింది. ఈ కారణంగా అనేక సాంఘిక కట్టుబాట్లకు వివక్షలకు మహిళలు గురికావాల్సి వచ్చింది. ముఖ్యంగా అభివృద్ధికి దోహదపడే విద్యకు స్త్రీలను వేల సంవత్సరాలు దూరం చేశారు. ఇప్పటికీ విద్య ఉద్యోగ రాజకీయ రంగంలో స్త్రీలు అణచివేతకు గురవుతున్నారు. ఈ స్థితి న్యాయ వ్యవస్థలో కూడా కొనసాగుతుంది. జాతీయ స్థాయి న్యాయ కళాశాలల్లో చదువుతున్న ఆధిపత్య కులాల వారు నేరుగా న్యాయమూర్తులుగా నియమితులవుతున్నారు. మహిళా న్యాయమూర్తులలో మెజార్టీగా ఆధిపత్య కులాల వారు ఉన్నారంటే రాజకీయాల్లో, చట్టసభల్లో, బ్యూరోక్రాట్స్ లలో, అత్యున్నత పదవులతో పాటు న్యాయవ్యవస్థలో కూడా ఆధిపత్య వర్గాల ఆధిపత్యం కొనసాగుతుంది. ఇటీవల బార్ కౌన్సిల్, బార్ అసోసియేషన్ ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించినప్పటికీ ఆ రిజర్వేషన్ల వల్ల ఆధిపత్య మహిళలే లబ్ధిపొందుతున్నారు. కోర్టుల్లో ప్రభుత్వ సిఫారసులతో నియమించే పోస్టుల్లో సైతం పురుషాధిక్యతతో పాటు ఆధిపత్య వర్గాల వారి అవకాశవాదం స్పష్టంగా కనిపిస్తోంది. 80 ఏండ్ల స్వాతంత్ర భారతదేశంలో అన్ని రంగాల్లో బహుజన మహిళా వాటా కోసం పోరాటం చేయడంలో న్యాయవాదులు ముందుండాలి. చట్టసభలు మొదలుకొని న్యాయవ్యవస్థ వరకు మహిళా వాటాలో బహుజన కోటా కోసం సావిత్రిబాయి పూలే స్పూర్తితో పోరు చేయాల్సిన అవసరముంది.
ఆమె 1831 జనవరి 3 న దక్షిణ మహారాష్ట్ర లోని సతార జిల్లాలోని నాయగావ్ పల్లెటూరులో ఖండోజి సేవేనే పాటిల్, లక్ష్మీబాయి దంపతులకు జన్మించారు. ఆమె తన తొమ్మిది సంవత్సరాల వయస్సులో జ్యోతిరావు పూలే ను వివాహమాడింది. 1897 లో పూణే నగరాన్ని ప్లేగు వ్యాధి సోకిన క్రమంలో రోగులకు సేవాలందిస్తూ ఆ ప్లేగు వ్యాధికి గురై తను మార్చి 10, 1897 న మరణించింది. ఆమె మరణం బహుజన సమాజానికి తీరని లోటు. ఆమె సాగించిన కృషి బహుజన సమాజానికి స్ఫూర్తిదాయకం. సావిత్రిబాయిపూలే జయంతి సందర్బంగా ఆమె ఆశయ సాధనకోసం బహుజన సమాజం ప్రతిన బూనుదాం.

( మార్చి 10 న సావిత్రిబాయి పూలే 129వ వర్ధతి సందర్బంగా)

…. టి లక్ష్మీదేవి, న్యాయవాది
ఐ ఎల్ పి ఎ రాష్ట్ర మహిళ కన్వీనర్
9704935427

Share this post
Exit mobile version