Site icon MANATELANGANAA

ములుగు కాంగ్రెస్ నేతల ఇసుక దందా – నొక్కేసుడు తొక్కుడు

ములుగు జిల్లాలో ఇసుక రీచుల సబ్‌కాంట్రాక్టుల వ్యవహారంలో తనను మోసం చేశారని మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం దేవులవాడకు చెందిన కాంట్రాక్టర్ బెల్లకొండ వెంకటేశ్వర్ రావు ఆరోపించారు. ట్రైబల్ సొసైటీల పేరుతో ఇసుక రీచుల కాంట్రాక్టులు ఇప్పిస్తామని నమ్మించి లక్షల రూపాయలు తీసుకుని చివరకు తనను రోడ్డున పడేశారని ఆయన వాపోయారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

శుక్రవారం మీడియాతో మాట్లాడిన వెంకటేశ్వర్ రావు, తాను 2010 నుంచి ఇసుక రీచుల కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నానని చెప్పారు. ములుగు జిల్లా మంగపేట మండలం చుంచుపల్లి గ్రామానికి చెందిన చుంచులక్ష్మి ట్రైబల్ సొసైటీ ప్రతినిధులు ఇసుక రీచుల సబ్‌కాంట్రాక్టు ఇస్తామని చెప్పడంతో వారి కోసం రూ.8 లక్షలు ఖర్చు పెట్టినట్లు తెలిపారు. సొసైటీ రిజిస్ట్రేషన్, సభ్యుల బ్యాంకు ఖాతాలు, క్వారీ అనుమతుల కోసం తానే ఖర్చు చేసి అధికారుల వద్ద తిరిగినట్లు చెప్పారు. అయితే అనుమతులు వచ్చిన తర్వాత ఇతరులతో ఒప్పందాలు చేసుకుని తనను పక్కన పెట్టారని ఆరోపించారు.

తర్వాత మళ్లీ సబ్‌కాంట్రాక్టు ఇస్తామని చెప్పడంతో మరోసారి అనుమతుల కోసం ప్రయత్నించినట్లు వెంకటేశ్వర్ రావు తెలిపారు. అయితే అప్పటి టీఆర్ఎస్ నాయకులు బెదిరించి ఇసుక రీచులను ఇతరులకు అప్పగించారని ఆరోపించారు. ఈ పరిణామాల వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురై అనారోగ్యం పాలయ్యానని, కిడ్నీలు దెబ్బతిని ప్రస్తుతం వారానికి రెండుసార్లు డయాలిసిస్ చేయించుకుంటున్నానని చెప్పారు.

2024లో మరోసారి చుంచులక్ష్మి, నరసింహస్వామి సొసైటీల ప్రతినిధులు తనకు సబ్‌కాంట్రాక్టు ఇస్తామని చెప్పారని ఆయన తెలిపారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకుడు కొండం బాలకృష్ణ ద్వారా డీసీసీ అధ్యక్షుడు అశోక్‌ను కలిశానని చెప్పారు. రెండు క్వారీల బాధ్యతలు ఇస్తామని చెప్పడంతో బాలకృష్ణ, సొసైటీ ప్రతినిధులకు విడతల వారీగా డబ్బులు ఇచ్చినట్లు తెలిపారు. అయితే తర్వాత ఆ క్వారీలను ఇతరులకు అప్పగించినట్లు తెలిసిందన్నారు.

తర్వాత 7, 9 పాయింట్లలో క్వారీలు ఇస్తామని చెప్పి మరోసారి నమ్మించారని వెంకటేశ్వర్ రావు ఆరోపించారు. ఈ సందర్భంగా ములుగు కలెక్టరేట్ ఎదుటే రూ.38 లక్షల నగదును బాలకృష్ణకు ఇచ్చినట్లు తెలిపారు. డబ్బులు తీసుకున్న తర్వాత తన ఫోన్ కాల్స్‌కు స్పందించడం మానేశారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ప్రశ్నించగా తనపై తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

తన వద్ద డబ్బులు తీసుకుని సబ్‌కాంట్రాక్టు ఇవ్వకుండా మోసం చేశారని బాలకృష్ణ, అబ్బయ్య, కార్తీక్‌లపై వెంకటేశ్వర్ రావు ఆరోపించారు. ఈ వ్యవహారంలో డీసీసీ అధ్యక్షుడు అశోక్ పాత్రపై కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం తాను ఆర్థికంగా పూర్తిగా నష్టపోయి అనారోగ్యంతో బాధపడుతున్నానని, అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు.

Share this post
Exit mobile version