Site icon MANATELANGANAA

కులగణన ప్రకటనపై బిసి సంఘాల హర్షం -ప్రధానమంత్రి మోదీకి కృతజ్ఞతలు

thanks pm modiji
స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లు దాటినా భారతదేశంలో మెజార్టీ ప్రజలైన బి.సి కుల జనగణన లేదని, తరతరాలుగా ఉత్పత్తి, శ్రమలో ఎన్నో త్యాగాలు చేసిన బి.సి సమాజాన్ని గుర్తించి బి.సి కులగణను చేస్తామని కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ స్వాగతిస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలియజేశారు. హనుమకొండ జిల్లా కేంద్రం కాకతీయ విశ్వవిద్యాలయం ఎస్డిఎల్సి, పూలే ప్రాంగణంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 95 సంవత్సరాల క్రితం బ్రిటిష్ ప్రభుత్వం చేసిన కులగణన తర్వాత నేటికి బి.సి జనాభా లెక్కలు చేయలేదని, కుల జనగణన కోసం బి.సి సంఘాలు చేసిన వీరోచిత పోరాటాలు, ప్రతిపక్షాల డిమాండ్ ను గౌరవించి మోడీ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని అన్నారు. బి.సి ల సమస్యను, సామాజిక న్యాయన్ని గత నాలుగు సంవత్సరాల నుండి ఒక ప్రధాన అంశంగా, నినాదంగా తీసుకొని దేశమంతా తిరిగి ప్రజల డిమాండ్ గా ప్రస్తావించి ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి చేసిన కాంగ్రెస్ అక్రనేత రాహుల్ గాంధీకి  ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారని అన్నారు. ఇల్లు అలకగానే పండుగ అయినట్టు కాదని కేవలం కుల గణన చేస్తామని నామమాత్రంగా చేసి చేతులు దులుపుకోవడం ద్వారా సామాజిక, ఆర్థిక, రాజకీయ, న్యాయం జరగదని అది ఆచరణాత్మకంగా అన్ని రంగాల్లో ఇంతకాలం తీవ్ర వివక్షతకు గురైన బీసీ ప్రజలకు సమన్యాయం జరిగినప్పుడే ప్రజలందరి అభివృద్ధి జరిగి రాహుల్ గాంధీ కోరిన సమన్యాయం జరుగుతుందని భావించాలి. చట్టసభలతో పాటు రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో 76 సంవత్సరాల నుండి నిర్లక్ష్యానికి గురైన ప్రజలకు న్యాయం చేయవలసిన అవసరాన్ని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం గుర్తించినందుకు  సామాజిక వర్గాలు సంతోషిస్తున్నారని అన్నారు. ఈ అంశాన్ని ప్రకటనలతో కాలయాపన చేయకుండా నియమిత కాలములో కులగణన చట్ట సవరణ చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల ముందు బీసీ మేనిఫెస్టో ద్వారా రాహుల్ గాంధీ ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కూడా చట్టసభలలో, నామినేటెడ్ పదవులలో, ఆర్థిక అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలలో తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాలకులు కేవలం కులగణన చేసి సమన్యాయం జరిగిందని భావించడంతో సరిపోదని అన్నారు.

ఈ సమావేశంలో డాక్టర్ సంఘాని మల్లేశ్వర్, డాక్టర్ నల్లని శ్రీనివాసు, డాక్టర్ కొట్టే భాస్కర్, డాక్టర్ మంద వీరస్వామి లు పాల్గొన్నారు.

Share this post
Exit mobile version