Site icon MANATELANGANAA

కేసీఆర్‌ ఆరోగ్యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా

pmmodi kcr

కేసీఆర్‌ ఆరోగ్యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా


న్యూఢిల్లీ, డిసెంబర్‌ 19:
బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. తనను కలిసిన బీఆర్‌ఎస్‌ ఎంపీలతో మాట్లాడుతూ, ‘‘కేసీఆర్‌ ఎలా ఉన్నారు? ఆరోగ్యం బాగుందా? ఆయన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోమనండి. ఇవన్నీ నేను ప్రత్యేకంగా చెప్పమన్నానని ఆయనకు తెలియజేయండి’’ అని ప్రధాని సూచించారు.

బీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యులు కేఆర్‌ సురేశ్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, ధీకొండ దామోదర్‌రావు శుక్రవారం పార్లమెంట్‌లో ప్రధాని కార్యాలయంలో నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా సిరిసిల్ల వరకూ నిర్మిస్తున్న నేషనల్‌ హైవే 365బిని వేములవాడ మీదుగా కోరుట్ల వరకూ విస్తరించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.

ఈ అంశాన్ని ఇప్పటికే పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన విషయాన్ని ఎంపీలు ప్రధానికి గుర్తు చేశారు. రహదారి విస్తరణకు సంబంధించి కేంద్ర మంత్రి ఇప్పటికే అధికారికంగా హామీ ఇచ్చిన విషయాన్ని వివరించారు. ఈ రహదారి విస్తరణ వల్ల వేములవాడ ప్రాంతంలో ఆధ్యాత్మిక పర్యాటకం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు.

అలాగే ధవళేశ్వరం బ్రిడ్జ్‌ తరహాలో మిడ్‌ మానేరుపై రోడ్‌ కమ్‌ రైల్‌ బ్రిడ్జిని నిర్మించి, వేములవాడ మీదుగా కోరుట్లలో ఎన్‌హెచ్‌–63ను కలిపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కరీంనగర్‌ పట్టణాన్ని సిద్దిపేట మీదుగా హైదరాబాద్‌తో నేరుగా అనుసంధానించే మనోహరాబాద్‌–కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టులో భాగంగా వంతెన నిర్మాణానికి సహకరించాలని కూడా విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో ప్రధాని మోదీ కేసీఆర్‌ ఆరోగ్యంపై ప్రత్యేకంగా ప్రశ్నించడం, తన మాటగా ఆయనకు చెప్పాలని ఎంపీలకు సూచించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఇటీవల తెలంగాణ బీజేపీ ఎంపీలకు ప్రధాని క్లాస్‌ తీసుకున్న నేపథ్యంలో, కేసీఆర్‌ గురించి ఇలా ఆప్యాయంగా ఆరా తీయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Share this post
Exit mobile version