ములుగు జిల్లా నుంచి ఇద్దరు అభ్యర్థులు ప్రతిష్టాత్మకమైన గ్రూప్–1 పరీక్షల్లో విజయం సాధించి డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికయ్యారు. కడు పేదరికంలో పుట్టి పెరిగి ఎంతో పట్టుదలతో ఇద్దరూ గ్రూప్ వన్ కు ఎంపిక కావడంతో పలువురు వారిని అభినందనలతో ముంచెత్తారు. రాష్ర్ట మహిళా శిశుసంక్షేమ,పంచాయితిరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూర్య సీతక్క వారికి అభినందనలు తెలిపారు.
ఏటూరునాగారం – దైనంపల్లి ప్రవీణ్‌కుమార్- రాష్ట్రస్థాయిలో 105వ ర్యాంకు సాధించి డీఎస్పీగా
ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన దైనంపల్లి ప్రవీణ్‌కుమార్ రాష్ట్రస్థాయిలో 105వ ర్యాంకు సాధించి డీఎస్పీగా ఎంపికయ్యారు. . చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన ప్రవీణ్ నాయనమ్మల పెంపకంలో వారి సాయంతో చదువులు కొనసాగించాడు. ప్రవీణ్ నాయనమ్మలు ఒకరు గ్రామపంచాయితీ పారిశుధ్యపనులు నిర్వహించగా మరోనాయనమ్మ ఆర్టీసి బస్ స్టాండ్ లో స్వీపర్ గా విధులు నిగ్వహించారు. ఎంతో కష్టపడి వారు ప్రవీణ్ ను చదివించారు.
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివిన ఆయన హైదరాబాద్‌లోని ఎస్సీ స్టడీ సర్కిల్‌లో శిక్షణ పొందారు. ఇప్పటికే రెండు సార్లు యూపీఎస్సీ ప్రిలిమ్స్, మెయిన్స్ విజయవంతంగా పూర్తి చేసి ఇంటర్వ్యూ వరకు వెళ్లిన ప్రవీణ్ ప్రస్తుతం మరోసారి యూపీఎస్సీ మెయిన్స్ రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే గ్రూప్–1లో డీఎస్పీగా ఎంపిక కావడం కుటుంబానికి ఆయనకు ఎంతో గర్వకారణంగా మారింది. ప్రవీణ్ గ్రూప్ వన్ కు ఎంపికికావడం పట్ల ఏజెన్సీవాసులు అభినందనలు తెలియ చేశారు.
మల్లంపల్లి మండల కేంద్రానికి చెందిన అల్లెపు మౌనిక రాష్ట్రస్థాయిలో 50వ ర్యాంకు
మల్లంపల్లి మండల కేంద్రానికి చెందిన అల్లెపు మౌనిక రాష్ట్రస్థాయిలో 50వ ర్యాంకు సాధించి డీఎస్పీగా ఎంపికయ్యారు. బీఏ డిగ్రీ పూర్తిచేసిన ఆమె బీసీ స్టడీ సర్కిల్‌లో శిక్షణ తీసుకుని ప్రతిరోజూ 12 గంటలు కష్టపడి చదివారు. తొలి ప్రయత్నంలోనే డీఎస్పీ ఉద్యోగం సాధించటం మౌనిక పట్టుదలకు నిదర్శనం.
మౌనిక తల్లిదండ్రులు కూలీ పనులు, టైర్ల పంచర్ దుకాణం ద్వారా కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. చెల్లెలు మానస ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగం కోసం హైదరాబాదులో శిక్షణ పొందుతోంది. విజయం సాధించిన మౌనిక భవిష్యత్తులో కలెక్టర్ కావడమే తన లక్ష్యమని వెల్లడించారు.
పేదరికం మధ్య కష్టపడి చదివి, ప్రభుత్వ సదుపాయాలను సద్వినియోగం చేసుకుని డీఎస్పీగా ఎంపికైన ఈ ఇద్దరు ములుగు జిల్లా యువతరానికి ఆదర్శంగా నిలిచారు.