వరంగల్: ఊరికి వెళ్తున్నారా? ఇల్లు భద్రంగా ఉంచుకోండి – పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్
సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు వెళ్లే ప్రజలు, అలాగే మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు వెళ్లే వారి ఇండ్లలో చోరీలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ సూచించారు.
ఈ సందర్భంగా సీసీఎస్ పోలీసులు రూపొందించిన కరపత్రాలను కమిషనర్ విడుదల చేశారు. ఇంటి భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన పలు సూచనలు చేశారు.
సెలవులకు బయటికి వెళ్లే సమయంలో సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సర్లు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ఇంటికి సెంట్రల్ లాక్ లేదా డిజిటల్ లాకింగ్ సిస్టమ్ అమర్చుకోవాలని సూచించారు. బీరువా తాళాలను ఇంట్లో దాచకుండా వెంట తీసుకెళ్లాలని తెలిపారు.
తాళం వేసి ఊరికి వెళ్లాల్సి వస్తే స్థానిక పోలీస్ స్టేషన్‌కు లేదా గ్రామ పోలీస్ అధికారికి ముందుగా సమాచారం ఇవ్వాలని అన్నారు. బంగారు, వెండి ఆభరణాలు, నగదు బ్యాంక్ లాకర్లలో భద్రపర్చుకోవాలని లేదా వెంట తీసుకెళ్లాలని సూచించారు. పక్కింటి వారికి లేదా పరిచయస్తులకు ఇచ్చి మోసపోవద్దని హెచ్చరించారు.
వాహనాలను ఇంటి ఆవరణలోనే పార్క్ చేసుకోవాలని, ద్విచక్ర వాహనాలకు చైన్ లాక్ వేయాలని చెప్పారు. ఇంటి ముందు గేటుకు తాళం వేయవద్దని, తాళం వేసిన ఇంట్లో ఎవరు లేరని దొంగలు గుర్తించే అవకాశం ఉంటుందని తెలిపారు.
నమ్మకమైన వ్యక్తులనే వాచ్‌మన్, సెక్యూరిటీ గార్డ్ లేదా పనిమనుషులుగా నియమించుకోవాలని అన్నారు. 15 రోజుల స్టోరేజ్ ఉన్న సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని మొబైల్‌లో లైవ్‌గా ఇంటి పరిసరాలను చూడవచ్చని తెలిపారు.
ఊరికి వెళ్లేటప్పుడు పక్కింటి వారికి ఇంటి పరిసరాలను గమనించాలని చెప్పాలని సూచించారు. తాళం వేసిన తర్వాత తాళం కనిపించకుండా డోర్ కర్టెన్ వేయాలని, ఇంట్లో ఏదైనా ఒక గదిలో లైట్ వేసి ఉంచాలని అన్నారు.
సోషల్ మీడియాలో మీ లొకేషన్, ప్రయాణ వివరాలు పెట్టవద్దని చెప్పారు. ఇంట్లో లేనప్పుడు పనిమనుషులు ఉంటే రోజూ వాకిలి ఊడ్చమని చెప్పాలని, ఇంటి ముందు చెత్త, న్యూస్‌పేపర్లు, పాల ప్యాకెట్లు పేరుకుపోకుండా చూడాలని సూచించారు.
కాలనీ లేదా గ్రామంలో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని, డయల్ 100కు కాల్ చేయాలని తెలిపారు. ఇంటి తాళాలను తలుపుల దగ్గర, పూలకుండీలలో లేదా మ్యాట్స్ కింద దాచిపెట్టవద్దని చెప్పారు. ఇంట్లో పనిచేసే వారి వివరాలను పోలీస్ స్టేషన్‌లో వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, క్రైమ్స్ అదనపు డీసీపీ బాలస్వామి, ఏసీపీలు సదయ్య, మధుసూదన్, ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.

