Site icon MANATELANGANAA

ట్రాన్స్‌జెండర్ల కు చెక్ బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు..డిజిపి

ట్రాన్స్‌జెండర్ల పేరిట బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు..

-డీజీపీ సీవీ ఆనంద్

-ఆగడాలు, దందాలపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సీపీలకు ఆదేశం

-సమాజంలో గౌరవప్రదమైన స్థానం కల్పిస్తుంటే, కొందరి వల్లే చెడ్డపేరు

-చింతల్ గృహప్రవేశం ఘటనపై స్పందించిన రాష్ట్ర పోలీస్ బాస్

తెలంగాణ రాష్ట్రంలో ట్రాన్స్‌జెండర్ల పేరిట జరుగుతున్న బలవంతపు వసూళ్లు, బెదిరింపులపై తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ తీవ్రంగా స్పందించారు.

గృహప్రవేశాలు, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల సమయాల్లో కొందరు ట్రాన్స్‌జెండర్ల సమూహాలు ప్రజలను ఇబ్బంది పెడుతూ పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు వస్తున్న ఫిర్యాదులపై ఆయన స్పందించారు.

ఈ..తరహా వసూళ్లు, యాచక ముఠాల ఆగడాలను అరికట్టేందుకు తక్షణమే ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించాలని రాష్ట్రంలోని అందరు పోలీస్ కమీషనర్లకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.

చింతల్ ఘటనతో కదిలిన యంత్రాంగం

   ఇటీవల హైదరాబాద్‌లోని చింతల్ ప్రాంతంలో ఒక కుటుంబం కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తుండగా, కొందరు ట్రాన్స్‌జెండర్లు అక్కడికి చేరుకుని రూ. 50,000 ఇవ్వాలని గొడవకు దిగారు. బాధితులు అంత ఇచ్చుకోలేమని చెప్పడంతో అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా, నానా హంగామా సృష్టించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో పోలీస్ శాఖ అలర్ట్ అయింది. గతంలో తాను హైదరాబాద్ సీపీగా ఉన్న సమయంలోనూ ఇలాంటి వసూళ్లపై ఉక్కుపాదం మోపానని, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ ఈ ముఠాల ఆటకట్టించేందుకు చర్యలు తీసుకుంటామని డీజీపీ స్పష్టం చేశారు.

ప్రభుత్వ ఉద్దేశాన్ని పాడుచేయొద్దు

ట్రాన్స్‌జెండర్లను సమాజంలో గౌరవప్రదమైన ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని డీజీపీ గుర్తుచేశారు. ఇప్పటికే వారిని ట్రాఫిక్ అసిస్టెంట్లుగా (Traffic Marshals), హైడ్రా (HYDRAA) విధుల్లోకి తీసుకుని ప్రోత్సహిస్తున్నామని, అక్కడ బాధ్యతలు చేపట్టిన వారు ఎంతో సమర్థవంతంగా పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారని ప్రశంసించారు. ప్రభుత్వం వారికి గౌరవప్రదమైన ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నప్పటికీ, కొందరు ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు, దందాలకు పాల్పడి కమ్యూనిటీ మొత్తానికి చెడ్డపేరు తెస్తున్నారని మండిపడ్డారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రజలను వేధించే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు ఉంటాయని డీజీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు.

Share this post
Exit mobile version