Site icon MANATELANGANAA

ధరణి–భూభారతి రిజిస్ట్రేషన్ల కుంభకోణంలో: 15 మంది అరెస్టు

ధరణి–భూభారతి రిజిస్ట్రేషన్ల కుంభకోణంలో: 15 మంది అరెస్టు

జనగామ/యాదాద్రి భువనగిరి:

ఫరారీలో మరో తొమ్మిది మంది
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ధరణి, భూభారతి రిజిస్ట్రేషన్ల కుంభకోణంలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన ముఠాకు చెందిన 15 మందిని జనగామ పోలీసులు అరెస్టు చేశారు. మరో తొమ్మిది మంది నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. జనగామ, యాదాద్రి జిల్లాల్లో జరిగిన ఈ కుంభకోణంలో సుమారు రూ.3.90 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లినట్లు గుర్తించారు.

నిందితుల వద్ద నుంచి పోలీసులు రూ.63.19 లక్షల నగదు, బ్యాంక్ ఖాతాల్లో ఉన్న రూ.1 లక్ష, సుమారు రూ.1 కోటి విలువైన ఆస్తి పత్రాలు, ఒక కారు, రెండు ల్యాప్‌టాప్‌లు, ఐదు డెస్క్‌టాప్ కంప్యూటర్లు, 17 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

అరెస్టైన నిందితులు:

  1. పసునూరి బసవ రాజు (32) – యాదాద్రి జిల్లా
  2. జెల్లా పాండు (46) – యాదాద్రి జిల్లా
  3. మహేశ్వరం గణేష్ కుమార్ (39) – యాదాద్రి జిల్లా
  4. ఈగజులపాటి శ్రీనాథ్ (35) – జనగామ
  5. యెనగంధుల వెంకటేష్ – జనగామ
  6. కోదురి శ్రావణ్ (35) – జనగామ
  7. కొలిపాక సతీష్ కుమార్ (36) – కొడకండ్ల (ఎం), జనగామ
  8. తడూరి రంజిత్ కుమార్ (39) – నర్మెట్ట, జనగామ
  9. దుంపల కిషన్ రెడ్డి (29) – ఆత్మకూర్ (ఎం), యాదాద్రి జిల్లా
  10. దశరథ్ మేఘావత్ (28) – తురుపల్లి
  11. నారా భాను ప్రసాద్ (30) – యాదగిరిగుట్ట
  12. గొపగాను శ్రీనాథ్ (32) – యాదాద్రి జిల్లా
  13. ఒగ్గు కర్నాకర్ (42) – యాదాద్రి జిల్లా
  14. శివ కుమార్ (33) – అమంగల్, నల్లగొండ
  15. అలేటి నాగరాజు (32) – యాదాద్రి జిల్లా

మోసం చేసిన విధానం:

వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ వివరాల ప్రకారం, ప్రధాన నిందితులైన పసునూరి బసవ రాజు, జెల్లా పాండు యాదగిరిగుట్టలో ఆన్‌లైన్ సర్వీసులు నిర్వహించేవారు. వీరు ధరణి, భూభారతి వెబ్‌సైట్లలో ఇన్‌స్పెక్ట్/ఎడిట్ అప్లికేషన్‌ను ఉపయోగించి చలాన్లను తగ్గించి నకిలీ రసీదులు తయారు చేసేవారు. అనంతరం రైతులకు తక్కువ మొత్తంతో ఎడిట్ చేసిన చలాన్లు పంపించి, ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తాన్ని తగ్గించి మోసాలకు పాల్పడేవారు.

మొబైల్ అప్లికేషన్ల ద్వారా వెబ్‌సైట్‌లో జారీ అయిన రసీదులను మార్పు చేసి, తక్కువ మొత్తాన్ని మాత్రమే ప్రభుత్వానికి చెల్లించినట్లు చూపించి, ఆ నకిలీ చలాన్లను ఎమ్మార్వో, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మధ్యవర్తుల ద్వారా సమర్పించేవారని పోలీసులు తెలిపారు. ఈ విధంగా వచ్చిన డబ్బులో 10 నుంచి 30 శాతం వరకు కమిషన్‌గా ఇతరులకు చెల్లిస్తూ ముఠా వ్యవహారం నడిపినట్లు వెల్లడించారు.

కేసుల నమోదు:

ఈ కుంభకోణానికి సంబంధించి జనగామ, యాదాద్రి జిల్లాల్లో 1,080 పత్రాలకు సంబంధించిన లావాదేవీల్లో మోసాలు జరిగినట్లు గుర్తించారు. మొత్తం 22 కేసులు నమోదు కాగా, జనగామ జిల్లాలో 7, యాదాద్రి జిల్లాలో 15 కేసులు నమోదయ్యాయి.

పోలీసుల అభినందన:

ఈ ముఠాను పట్టుకున్న జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏఎస్పీ పండరి చేతన్, జనగామ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ రెడ్డి, రఘునాథ్‌పల్లి సీఐ శ్రీనివాస్ రెడ్డి సహా ఇతర అధికారులు, సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.

Share this post
Exit mobile version