ఏసీబీ అధికారుల ముసుగులో వసూళ్లకు పాల్పడిన … ఐదుగురిని వరంగల్ పోలీస్ లు అరెస్ట్ చేసారు.
ఏసీబీ అధికారులుగా చెప్పుకుంటూ ప్రభత్వ అధికారులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న ముఠా ను పోలీస్ లు అరెస్ట్ఐ చేసారు.
వరంగల్ పోలీసు కమిషనరేట్ టాస్క్ ఫోర్స్, మిల్స్ కాలనీ పోలీసులు సంయుక్తంగా నేర పరిశోదన జరిపి ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు.
మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉండగా, నిందితుల వద్ద నుంచి ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టు అయిన నిందితులు:
• రాచంపల్లి శ్రీనివాస్ అలియాస్ మంగళ శ్రీను అలియాస్ వాసు (45), వేలమద్ధి గ్రామం, నల్లమాడ మండలం, సత్యసాయి పుట్టపర్తి జిల్లా, ఆంధ్రప్రదేశ్
• నవీన్ JR, హరోహళ్లీ తాలుకా, రామనగర్ జిల్లా, కర్ణాటక
• మంగళ రవీందర్, యశ్వంతపూర్, బెంగుళూరు
• మురళి, బెంగుళూరు
• N. ప్రసన్న, బెంగుళూరు
పరారీలో ఉన్నవారు: సూర్యప్రకాశ్, తాటిమర్రి వేణు, కొత్తకోట రమణ.
వరంగల్ పోలీస్ కమిషనర్ షన్‌ప్రీత్ సింగ్ వివరాల ప్రకారం ప్రధాన నిందితుడు శ్రీనివాస్, ప్రభుత్వ శాఖల్లో ఉన్నతాధికారులు, పదవీ విరమణకు దగ్గరలో ఉన్న ఉద్యోగులను టార్గెట్ చేసేవాడు. ఏసీబీ డీఎస్పీ అని చెప్పి ఫోన్ చేసి “మీపై అవినీతి కేసు నమోదైంది… బయటపడాలంటే డబ్బు ఇవ్వాలి” అంటూ బెదిరించి భారీగా వసూళ్లు చేయడం అతని పద్ధతి.
ఇలా వరంగల్ ఆర్టిఏలో మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న తుమ్మల జైపాల్ రెడ్డిను బెదిరించి ₹9.96 లక్షలు వసూలు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో మిల్స్ కాలనీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
టెక్నాలజీ సహాయంతో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో శ్రీనివాస్ 2002లో ద్విచక్ర వాహనాల దొంగతనాలతో నేరాలకు శ్రీకారం చుట్టినట్లు అంగీకరించాడు. ఆ తరువాత నకిలీ పోలీస్ అధికారిగా నటిస్తూ రాయలసీమ ప్రాంతంలో కుటుంబాలను బెదిరించి బంగారం, డబ్బు దోచుకునేవాడు. అతని మీద అప్పటికే 50కుపైగా కేసులు నమోదయ్యాయి.
తరువాత బెంగుళూరు, రాయలసీమల్లో 41కి పైగా చైన్ స్నాచింగ్ కేసుల్లో పాల్గొని మళ్లీ జైలు పాలయ్యాడు.
జైలు నుండి విడుదలైన తర్వాత మళ్లీ నకిలీ ఏసీబీ డీఎస్పీగా మారి సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించడం మొదలుపెట్టాడు. ఇప్పటివరకు అతనిపై 19 కేసులు, దోపిడీ మొత్తం ₹50 లక్షలకు పైగా నమోదయ్యాయి. తెలంగాణలో 9, ఆంధ్రప్రదేశ్‌లో 10 నేరాలకు పాల్పడ్డాడు.
గోవా, బెంగుళూరులో ఆన్లైన్ బెట్టింగ్, కాసినోలు, వ్యభిచార గృహాల్లో దోచుకున్న డబ్బు ఖర్చు చేసినట్టు నిందితుడు విచారణలో ఒప్పుకున్నాడు.
ఈ ముఠాను పట్టుకున్నందుకు సెంట్రల్ జోన్ డీసీపీ డి. కవిత, వరంగల్ ఏసీపీ ఎన్. శుభం ప్రకాష్ IPS, టాస్క్ ఫోర్స్ ఏసీపీ ఏ. మధుసూదన్, ఇన్‌స్పెక్టర్లు ల్. పవన్ కుమార్, కె. శ్రీధర్, ల్. మంగిలాల్, మిల్స్ కాలనీ ఇన్‌స్పెక్టర్ బి. రమేష్, ఎస్‌ఐలు ఎస్. మహేష్, ఎం. సురేష్ తదితరులను పోలీస్ కమిషనర్ అభినందించి రివార్డులు అందజేశారు.

