ఒడిశా రాష్ట్రంలోని జార్సుగూడలో జరిగిన వేడుకలో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4జీ నెట్‌వర్క్‌ను ప్రారంభించారు. స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన టెలికాం పరికరాల ద్వారా ఈ 4జీ సేవలను అందించనున్నారు.
బీఎస్ఎన్ఎల్ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఈ సేవలను ప్రారంభించిన మోదీ, దేశీయ సాంకేతికతకు ఇది పెద్ద విజయమని పేర్కొన్నారు. ఆయన 97,500 బీఎస్ఎన్ఎల్ మొబైల్ 4జీ టవర్లను ఆవిష్కరించారు. వీటిలో 92,600 సైట్లు 4జీ టెక్నాలజీకి చెందగా, సుమారు 22 మిలియన్ల మంది ప్రజలు వీటి ద్వారా కనెక్ట్ కానున్నారని తెలిపారు.
“బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4జీతో దేశీయ ఆత్మవిశ్వాసం మరింత బలోపేతం అవుతుంది” అని మోదీ అన్నారు.
ఒడిశా, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, అస్సాం, గుజరాత్, బీహార్ రాష్ట్రాల్లో ఈ టవర్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఒడిశాలో సుమారు 60 వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన కూడా చేశారు.