Site icon MANATELANGANAA

శ్రీనగర్‌లో భారీ ఎన్‌కౌంటర్: పహల్గామ్ దాడి ప్రధాన నిందితులు మృతి

operation sindhur

శ్రీనగర్‌లో భారీ ఎన్‌కౌంటర్: పహల్గామ్ దాడి నిందితులు హతం

శ్రీనగర్, జులై 28, 2025: జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో భారత భద్రతా బలగాలు నిర్వహించిన ‘ఆపరేషన్ మహాదేవ్’లో పహల్గామ్ ఉగ్రదాడి నిందితులైన ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. ఈ ఎన్‌కౌంటర్ హిర్వాన్-లిద్వాన్ ప్రాంతంలో జరిగింది. హతమైన ఉగ్రవాదులు ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబు తల్హాలుగా గుర్తించారు. వీరిపై ఒక్కొక్కరిపై రూ. 20 లక్షల రివార్డ్ ఉన్నట్లు అధికారులు తెలిపారు.

మూడు నెలల క్రితం పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన తెలిసిందే. ఈ దాడి వెనుక ఉన్న పాకిస్థాన్ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకొని భద్రతా బలగాలు ఈ ఆపరేషన్‌ను చేపట్టాయి. లిద్వాస్ జనరల్ ఏరియాలోని మౌంట్ మహాదేవ్ సమీపంలో ముగ్గురు విదేశీ ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో ఇండియన్ ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను నిర్వహించాయి.

భద్రతా బలగాలను గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడగా, వెంటనే అప్రమత్తమైన బలగాలు ప్రతిస్పందించి, తీవ్రమైన కాల్పుల మధ్య ముగ్గురు ఉగ్రవాదులను మట్టుపెట్టాయి. రెండు రోజుల క్రితం దచిగామ్ అడవిలో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో, స్థానిక సంచార జాతుల వారు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. దీంతో భద్రతా బలగాలు ‘ఆపరేషన్ మహాదేవ్’ను వేగంగా చేపట్టాయి.

ఈ ఎన్‌కౌంటర్ సమయంలో పార్లమెంట్‌లో పహల్గామ్ దాడి, ఆపరేషన్ సిందూర్ అంశంపై చర్చ జరగనున్న నేపథ్యంలో ఈ ఆపరేషన్ విజయం కేంద్ర ప్రభుత్వానికి కీలక పరిణామంగా నిలిచింది. పహల్గామ్ దాడి నిందితులను పట్టుకోవడంలో కేంద్రం విఫలమైందని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల నడుమ ఈ ఎన్‌కౌంటర్ కేంద్రానికి ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు.

Share this post
Exit mobile version