వరంగల్:
ఏటీఎం కేంద్రాల్లో నగదు బయటకు రాకుండా ఇనుప రేకును అడ్డంగా అమర్చి చోరీలకు పాల్పడుతున్న ఓ కొత్త తరహా ముఠాను వరంగల్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. రాజస్థాన్‌కు చెందిన అంతర్‌రాష్ట్ర ముఠాకు సంబంధించిన ఏడుగురు నిందితులను సీసీఎస్, కాజీపేట పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.5 లక్షల 10 వేల నగదు, రెండు కార్లు, ఏడు సెల్‌ఫోన్లు, ఐరన్ ప్లేట్లు, నకిలీ తాళం చెవులను స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టయిన నిందితులు ఆరిఫ్ ఖాన్ (23), సర్ఫరాజ్ (24), ఎం.ఆష్ మహ్మద్ (29), షాపుస్ ఖాన్ (33), షారూఖాన్ (33), అస్లాం ఖాన్ (33), ఎం.షారుఖాస్ (27). వీరంతా రాజస్థాన్ రాష్ట్రం అల్వార్ జిల్లా మాల్కిడా తాలూకాకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు.
ఈ కేసు వివరాలను వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ కవిత వెల్లడించారు. ఒకే ప్రాంతానికి చెందిన ఈ యువకులు పరస్పరం పరిచయంతో కలిసి జల్సాలు చేసేవారని, ఆ ఖర్చులకు డబ్బు సరిపోక సులభంగా సంపాదించాలనే ఉద్దేశంతో ఏటీఎం చోరీలకు దిగినట్లు తెలిపారు. ఓ పరిచయస్తుడి ద్వారా ఎస్‌బీఐ బ్యాంకులకు సంబంధించిన PERTO కంపెనీ పాత ఏటీఎం మిషన్లలో ఉన్న లోపాలను అధ్యయనం చేసి, వాటిని తెరవడానికి నకిలీ తాళం చెవులు తయారు చేసుకున్నట్లు విచారణలో తేలింది.
ముఠా సభ్యులు ముందుగా PERTO కంపెనీ ఏటీఎం ఉన్న కేంద్రాలను గుర్తించి, లోపలికి చొరబడి ఏటీఎం ముందు భాగాన్ని తెరిచి, డబ్బు బయటకు వచ్చే మార్గంలో గమ్‌తో ఇనుప ప్లేటును అమర్చేవారు. దీంతో ఖాతాదారులు నగదు డ్రా చేయగానే డబ్బు బయటకు రాకుండా మిషన్‌లోనే నిలిచిపోతుంది. ఖాతాదారుడు ఏటీఎం లోపంగా భావించి వెళ్లిపోయిన తరువాత, పరిసరాల్లో గమనిస్తూ ఉన్న ముఠా సభ్యులు తిరిగి వచ్చి ఏటీఎం తెరిచి అందులో నిలిచిపోయిన నగదును దోచుకునేవారు. అయితే ఖాతాదారుడికి మాత్రం నగదు డ్రా అయినట్లు మొబైల్‌కు మెసేజ్ వచ్చేది. తర్వాత బ్యాంకులకు ఫిర్యాదులు పెరిగాయి.
ఇదే విధంగా ఈ ముఠా రాజస్థాన్‌తో పాటు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో 40కిపైగా ఏటీఎం చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. పాత ఏటీఎం మిషన్ల స్థానంలో కొత్త మిషన్లు ఏర్పాటు చేయడంతో కొన్ని ప్రాంతాల్లో అవకాశాలు తగ్గడంతో ఇతర రాష్ట్రాలకు విస్తరించారు.
వరంగల్ ట్రైసిటీలో గత నవంబర్ నుంచి ఇప్పటివరకు 7 ఏటీఎం కేంద్రాల్లో ఈ ముఠా రూ.12 లక్షల 10 వేల చోరీ చేసింది. సుబేదారి పోలీస్‌స్టేషన్ పరిధిలో నాలుగు, కాజీపేట, హన్మకొండ, మీల్స్ కాలనీ పరిధిలో ఒక్కొక్క చోరీ జరిగింది. ఖాతాదారుల ఫిర్యాదులపై బ్యాంకులు థర్డ్ పార్టీ సంస్థ FSS లిమిటెడ్ ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వగా, అదనపు డీసీపీ బాలస్వామి పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేశారు.
సాంకేతిక పరిజ్ఞానం, సీసీటీవీ ఆధారాలతో నిందితులపై నిఘా పెట్టిన పోలీసులు, కాజీపేట చౌరస్తా వద్ద మరోసారి చోరీకి ప్రయత్నిస్తున్న సమయంలో పట్టుకున్నారు. విచారణలో నేరాలను అంగీకరించినట్లు తెలిపారు. ఇలాంటి ముఠాలు దేశవ్యాప్తంగా పనిచేస్తున్నాయని, బ్యాంకు ఉన్నతాధికారులను అప్రమత్తం చేసినట్లు డీసీపీ తెలిపారు.
ఈ ముఠాను పట్టుకున్న సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ రాఘవేందర్, కాజీపేట ఇన్‌స్పెక్టర్ సుధాకర్‌రెడ్డి, ఏసీఓ సల్మాన్ పాషా, ఎస్‌ఐలు, సిబ్బందిని వరంగల్ పోలీస్ కమిషనర్ అభినందించి రివార్డులు అందజేశారు.

