Site icon MANATELANGANAA

విమానాశ్రయాల అభివృద్ధిపై పార్లమెంట్ లో ప్రశ్నించిన వరంగల్ ఎంపీ కడియం కావ్య

తెలంగాణలో విమానాశ్రయాల మౌలిక వసతుల అభివృద్ధిపై వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య పార్లమెంట్‌లో ప్రశ్నించారు.

ప్రయాణికుల సౌకర్యాలు, భద్రతా మౌలిక వసతుల పెంపుపై ఎంపీ లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర పౌర విమానయాన శాఖ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది.

హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల సామర్థ్యాన్ని 12 మిలియన్ నుంచి 34 మిలియన్‌కు పెంచినట్లు కేంద్రం వెల్లడించింది. కార్గో టెర్మినల్–2, ట్రాన్సిట్ లౌంజ్ ప్రారంభించడంతో పాటు సుమారు రూ.1,325 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపింది. ప్రధాన రహదారి విస్తరణ, బ్రావో టాక్సీవే పొడిగింపు పనులు కొనసాగుతున్నాయని పేర్కొంది. అలాగే బేగంపేట విమానాశ్రయంలో రన్‌వే రీసర్ఫేసింగ్, పేవ్‌మెంట్ అప్‌గ్రేడేషన్, పెరిమిటర్ రోడ్ విస్తరణ వంటి పనులు పూర్తయ్యాయని, వీటికి రూ.42 కోట్ల వ్యయం చేసినట్లు కేంద్రం అంగీకరించింది.
తెలంగాణలో విమాన రాకపోకలు వేగంగా పెరుగుతున్నప్పటికీ, కేంద్రం ఇప్పటివరకు దశలవారీ అభివృద్ధి పేరుతో ఆలస్యం చేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య ప్రశ్నతో రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి అంశం జాతీయ స్థాయిలో చర్చకు వచ్చింది.

ప్రాంతీయ అనుసంధానం పెంపు కోసం మరిన్ని నిధులు, వేగవంతమైన పనులు అవసరమని, తెలంగాణకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య కేంద్రాన్ని కోరారు.

Share this post
Exit mobile version