Site icon MANATELANGANAA

వరంగల్‌లో ఇంధన ప్రాజెక్టుల పురోగతిపై లోక్‌సభలో ప్రశ్నించిన వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య

న్యూఢిల్లీ, డిసెంబర్ 11,2025:

వరంగల్ ప్రాంతంలో ఇంధన వనరుల అభివృద్ధి, ప్రజలకు అందుబాటులో ఉండే ఇంధన సదుపాయాల మెరుగుదలపై వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య లోక్‌సభలో పలు కీలక ప్రశ్నలు లేవనెత్తారు.

ప్రధానంగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రాంతంలో సీఎన్‌జీ (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) స్టేషన్ల ఏర్పాటు, వాటి ప్రస్తుత స్థితి, భవిష్యత్ విస్తరణ ప్రణాళికలు గురించి కేంద్ర ప్రభుత్వాన్ని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య వివరణను కోరారు. సీఎన్‌జీ వాహనాలు పెరుగుతున్న నేపథ్యంలో, వరంగల్ నగరంతో పాటు పరిసర పట్టణాల్లో కూడా ఈ సేవలు వేగంగా పెరగాల్సిన అవసరం ఉందని ఎంపీ స్పష్టం చేశారు.

అలాగే ఎల్పీజీ సబ్సిడీల పంపిణీ, లబ్ధిదారులకు సబ్సిడీలు నిరంతరంగా చేరుతున్నాయా, డైరెక్ట్‌బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) వ్యవస్థలో ఎలాంటి సమస్యలు ఉన్నాయా అనే అంశాలపై ఎంపీ స్పష్టత కోరారు. పేద కుటుంబాలకు ఎల్పీజీ కనెక్షన్లు, రిఫిల్లులపై సబ్సిడీ కీలకమని, ఏ చిన్న అంతరాయం జరిగినా అది ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందన్న విషయాన్ని ప్రధానం చేశారు.

ఇంధన భద్రతకు సంబంధించి, చమురు, సహజ వాయువు అన్వేషణ పురోగతి, వరంగల్ జిల్లాలో ఏవైనా సర్వేలు జరుగుతున్నాయా, భవిష్యత్ ప్రణాళికలు ఏంటన్న దానిపై కూడా కేంద్రం వివరణ ఇవ్వాలని డాక్టర్ కడియం కావ్య కోరారు. అదే విధంగా, పునరుత్పాదక శక్తి రంగంలో వరంగల్ కీలకంగా ఎదగాలంటే ఎలక్ట్రికల్ ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగాలని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ప్రగతిలో ఉన్న సౌర ప్రాజెక్టుల స్థితి, కొత్త ప్రతిపాదనలు, వాటి అమలు వేగంపై వివరాలు వెల్లడించాలని కోరారు. వరంగల్ అభివృద్ధి కోసం ఆధునిక ఇంధన మౌలిక వసతులు అత్యంత కీలకమని, ప్రజలకు తక్కువ ఖర్చుతో మెరుగైన ఇంధనం అందాలంటే కేంద్రం మరింత దృష్టి పెట్టాలని ఎంపీ డా. కడియం కావ్య లోక్‌సభలో కోరారు.

వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి లోక్‌సభలో సమాధానమిచ్చారు.

2018లో మెఘా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థకు వరంగల్‌–జంగావ్–భూపాలపల్లి–మహబూబాబాద్ జియోగ్రాఫికల్ ఏరియా కేటాయించబడింది. 2028 నాటికి 12 సీజీఎన్‌జీ స్టేషన్లు ఏర్పాటు చేయాలి. ఇందులో ఇప్పటి వరకు 10 స్టేషన్లు పనిచేస్తున్నాయి. లక్ష్యానికి మించి పురోగతి సాధించారని మంత్రి తెలిపారు. పీఎం ఉజ్వల యోజన కింద దేశవ్యాప్తంగా 10.33 కోట్ల లబ్ధిదారులు ఉండగా, వరంగల్ జిల్లాలో 0.42 లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని చెప్పారు. పేద కుటుంబాలకు సిలిండర్‌పై 2025–26లో 9 రిఫిల్లుల వరకు రూ.300 సబ్సిడీ ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. చమురు అన్వేషణ విషయానికొచ్చేసరికి — తెలంగాణలో ప్రస్తుతం ఎటువంటి OALP బ్లాక్‌లు లేవని, కడప బేసిన్‌లో ఉన్న ఓఎన్‌జీసీ బ్లాక్ వరంగల్‌కు 350 కి.మీ దూరంలో ఉందని చెప్పారు.

పునరుత్పాదక శక్తిలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 ముఖ్య పాత్ర పోషిస్తోందని మంత్రి పేర్కొన్నారు. రూఫ్‌టాప్ సౌరశక్తి కింద వరంగల్‌లో డిసెంబర్ 9, 2025 వరకు 596 సౌర ప్యానెల్ వ్యవస్థలు అమర్చినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా బయోఫ్యూయెల్, సౌరశక్తి, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు వేగంగా విస్తరిస్తున్నాయని అన్నారు.

Share this post
Exit mobile version