న్యూఢిల్లీ – పార్లమెంట్
తేది: 18 డిసెంబర్ 2025
వరంగల్‌లో స్మార్ట్ సిటీ పనులు, ఎస్సీ గృహాలు, ప్రజాభాగస్వామ్యంపై పార్లమెంట్‌లో ప్రశ్నించిన వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య
వరంగల్ నగరంలో అమలవుతున్న స్మార్ట్ సిటీ కార్యక్రమాల పురోగతి, షెడ్యూల్డ్ కాస్ట్ (ఎస్సీ) వర్గాలకు అందుబాటు ధరల్లో గృహాల కల్పన, నగరాభివృద్ధి ప్రణాళికల్లో ప్రజల భాగస్వామ్యం అంశాలపై వరంగల్ లోక్‌సభ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పార్లమెంట్‌లో కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా డా. కడియం కావ్య మాట్లాడుతూ, వరంగల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల అమలు కేవలం మౌలిక సదుపాయాల అభివృద్ధికే పరిమితం కాకుండా సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి దిశగా సాగాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఎస్సీ వర్గాలకు అందుబాటు ధరల్లో గృహాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. అలాగే నగర ప్రణాళికల్లో ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని, వార్డు స్థాయి సమావేశాలు, ప్రజాభిప్రాయ సేకరణ, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పౌరుల సూచనలు తీసుకోవాలని సూచించారు. వరంగల్‌ను ప్రజల అవసరాలకు అనుగుణంగా సమగ్రంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ఆమె పేర్కొన్నారు.
వరంగల్ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల సహాయ మంత్రి తోఖాన్ సాహు సమాధానమిస్తూ, తెలంగాణ రాష్ట్రం నుంచి గ్రేటర్ వరంగల్ మరియు కరీంనగర్ నగరాలు స్మార్ట్ సిటీస్ మిషన్‌కు ఎంపికయ్యాయని తెలిపారు. డిసెంబర్ 1, 2025 నాటికి గ్రేటర్ వరంగల్‌లో మొత్తం ₹1,800 కోట్ల వ్యయంతో 119 ప్రాజెక్టులు చేపట్టగా, వాటిలో ₹1,498 కోట్ల విలువైన 103 ప్రాజెక్టులు (87 శాతం) పూర్తయ్యాయని చెప్పారు. మిగిలిన ₹302 కోట్ల విలువైన 16 ప్రాజెక్టులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని వెల్లడించారు.
ఎస్సీ వర్గాల గృహాల అంశంపై మంత్రి స్పందిస్తూ, భూముల కేటాయింపు మరియు కాలనీల అభివృద్ధి రాష్ట్రాల పరిధిలోని అంశమని, ఆయా రాష్ట్రాలు తమ ప్రజల అవసరాలకు అనుగుణంగా పథకాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. స్మార్ట్ సిటీస్ మిషన్ మొత్తం నగర అభివృద్ధి కాకుండా, ఏరియా ఆధారిత అభివృద్ధి విధానాన్ని అనుసరిస్తుందని, ఇందులో రిట్రోఫిట్టింగ్, రీడెవలప్‌మెంట్, గ్రీన్‌ఫీల్డ్ అభివృద్ధి మరియు పాన్-సిటీ స్మార్ట్ సొల్యూషన్స్ ఉంటాయని వివరించారు. ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలిచే అభివృద్ధి నమూనాలను రూపొందించడమే ఈ మిషన్ లక్ష్యమని చెప్పారు.
ప్రజాభాగస్వామ్యంపై మంత్రి వివరిస్తూ, ప్రతి నగరంలో స్థానిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని స్మార్ట్ సిటీ ప్రతిపాదనలు రూపొందిస్తారని, ఇందుకు ప్రజలు, నిపుణులు, వివిధ వర్గాల ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతారని తెలిపారు. ప్రతి స్మార్ట్ సిటీలో స్మార్ట్ సిటీ అడ్వైజరీ ఫోరం ఏర్పాటు చేస్తారని, ఇందులో జిల్లా కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యే, మేయర్, ఎస్పీవీ సీఈఓ, యువత ప్రతినిధులు, సాంకేతిక నిపుణులు సభ్యులుగా ఉంటారని చెప్పారు.
ఈ సందర్భంగా డా. కడియం కావ్య మాట్లాడుతూ, వరంగల్‌లో సమగ్రంగా, సమానంగా అభివృద్ధి జరగాలంటే మౌలిక వసతులతో పాటు అందరికీ అందుబాటులో గృహాలు కల్పించడంతోపాటు ప్రజల భాగస్వామ్యంతో నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో సామాజిక, ఆర్థిక అసమానతలు తగ్గించడమే తన ప్రధాన లక్ష్యమని ఎంపీ పేర్కొన్నారు.

