పోచమ్మకుంట, హనుమకొండ | 26 డిసెంబర్ 2025:
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా అమలు చేస్తున్నామని, ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం జరుగుతుందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు.
శుక్రవారం హనుమకొండ 54వ డివిజన్ పరిధిలోని పోచమ్మకుంట ప్రాంతంలో విశ్వ బ్రాహ్మణ మరియు సగర (ఉప్పర) కుల సంఘాలకు కమ్యూనిటీ హాల్‌ల నిర్మాణం కోసం ప్రభుత్వం మంజూరు చేసిన భూ కేటాయింపు పత్రాలను ఆయా కుల సంఘాల పెద్దలకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అందజేశారు.
ఈ సందర్భంగా ముందుగా కమ్యూనిటీ హాల్‌లకు కేటాయించిన స్థలాలను ఆయన పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో పోచమ్మకుంట ప్రజలు పార్టీలకు అతీతంగా తనపై విశ్వాసంతో ఓటు వేశారని గుర్తు చేశారు. ప్రజలు చూపిన నమ్మకానికి తగినట్టుగా అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు.
కమ్యూనిటీ హాల్‌ల కోసం కేటాయించిన స్థలాలను త్వరితగతిన అభివృద్ధి చేసి నిర్మాణ పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. అవసరమైతే స్థలాలను చదును చేయించేందుకు తన సొంత నిధులను కూడా వినియోగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కుల సంఘాలకు సొంత భవనాలు ఉంటే సామాజిక కార్యక్రమాలు, సమావేశాలు సక్రమంగా నిర్వహించుకోవడానికి ఎంతో ఉపయోగపడుతాయని అన్నారు.
ప్రజా ప్రభుత్వంలో ఏ వర్గానికీ అన్యాయం జరగదని, అభివృద్ధి ఫలాలు అన్ని కులాలు, అన్ని వర్గాలకు సమానంగా చేరేలా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు.
అదే విధంగా పోచమ్మకుంటలోని పోచమ్మతల్లి ఆలయ అభివృద్ధికి తన పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. డివిజన్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.15 లక్షలు మంజూరు చేస్తామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ, సగర కుల సంఘాల నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అధికారులు మరియు పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు.

