Site icon MANATELANGANAA

వినయ్ భాస్కర్ పై మండి పడిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

భద్రకాళి మాడ వీధుల అభివృద్ధిపై వివాదం

మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఆరోపణలను ఖండించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

హనుమకొండలోని భద్రకాళి మాడ వీధుల అభివృద్ధి కార్యక్రమంపై రాజకీయ వివాదం చెలరేగింది. ఆలయ ప్రాంగణంలో నివసిస్తున్న దళిత కుటుంబాల గుడిసెల తొలగింపు మరియు వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్ల విషయంలో మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మరియు బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలను ప్రస్తుత ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.

ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రకటనలో పేర్కొన్న ప్రకారం, దళిత గుడిసెల తొలగింపు ప్రక్రియను ప్రారంభించింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మరియు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌నేనని ఆరోపించారు. 2022లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆధ్వర్యంలో, మాజీ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఈ ప్రక్రియకు సంబంధించిన తీర్మానం తీసుకున్నట్లు తెలిపారు. 14-02-2023 తేదీన గుడిసెల తొలగింపుకు సంబంధించి అధికారిక చర్యలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు.

దళిత కుటుంబాలను మోసం చేసి, వారి గుడిసెల తొలగింపుకు ఆజ్యం పోసిందీ అప్పటి టీఆర్‌ఎస్/బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే విమర్శించారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కుటుంబాలకు అన్యాయం జరగకుండా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కేటాయిస్తూ న్యాయం చేయడానికి కృషి చేస్తోందని తెలిపారు.

టీఆర్‌ఎస్ ప్రభుత్వం గతంలో తీసుకున్న తీర్మానాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్ష నాయకులు ఉన్నత న్యాయస్థానాలు మరియు మానవ హక్కుల సంఘాలను ఆశ్రయిస్తున్నారని ఆరోపించారు. ఈ అంశానికి సంబంధించి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న అధికారిక తీర్మానాలను సాక్ష్యాలతో సహా జతపరుస్తున్నామని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు.

Share this post
Exit mobile version