Site icon MANATELANGANAA

మిస్ వరల్డ్ కంటెస్టంట్లను అలరించిన సెక్రటేరియట్ డ్రోన్ షో

ప్రభుత్వ ప్రాధాన్యతలు, పథకాల పరిచయంతో ఆకాశంలో అద్భుతం

తెలంగాణ జరూర్ ఆనా నినాదం వినిపించిన మిస్ వరల్డ్ ప్రతినిధులు

రాష్ట్ర పాలనా కేంద్రం సెక్రటేరియట్ ను మిస్ వరల్డ్ కంటెస్టంట్లు సందర్శించారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ వినిపిస్తుండగా సచివాలయం ఆవరణలోని తెలంగాణ తల్లి విగ్రహానికి మిస్ వరల్డ్ ప్రతినిధులు పుష్పాంజలి ఘటించారు. కంటెస్టెంట్ల అందరి సమక్షంలో 10 దేశాలకు చెందిన ప్రతినిధులు తెలంగాణ తల్లికి పుష్పాంజలి అర్పించారు. మిస్ ఇండియా నందిని గుప్తా ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు.

ఆ తర్వాత పాతబస్తీ గుల్జార్ హౌస్ ఫైర్ ఆక్సిడెంట్ మృతులకు సచివాలయంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు, మంత్రులు, అధికారులు కొద్ది నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. తెలంగాణ తల్లి విగ్రహంతో మిస్ వరల్డ్ మగువలు సెల్ఫీలు తీసుకున్నారు. టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మిస్ వరల్డ్ కంటెస్టంట్లకు సాదర స్వాగతం పలికారు. ప్రజల అభీష్టం మేరకు తమ పాలన సాగుతోందని, పాలనా కేంద్రమైన సచివాలయం సాక్షిగా ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని తెలిపారు. తెలంగాణ పర్యాటక ప్రాంతాలను సుస్థిర అభివృద్దిలో భాగంగా పర్యావరణ హితంగా డెవలప్ చేస్తున్నామని, వాటిలో చాలా ప్రాంతాలను సందర్శించిన మిస్ వరల్డ్ కంటెస్టంట్లు తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రపంచవ్యాప్తంగా పనిచేయాలని మంత్రి కోరారు. సచివాలయం సాక్షిగా తెలంగాణ జరూర్ ఆనా (Must Visit Telangana) అంటూ మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు నినదించారు.

ఆ తర్వాత ఆకాశంలో అద్భుతంగా కొనసాగిన డ్రోన్ షో ఆహుతులను విశేషంగా ఆకర్షించింది. ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యతలు, పథకాల అమలు తీరును మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు పరిచయం చేసేలా డ్రోన్ షో కొనసాగింది. రైజింగ్ తెలంగాణ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటం ఆకాశంలో డ్రోన్లతో ఆవిష్కరించినప్పుడు ఆహుతులంతా చప్పట్లతో ఆహ్వానించారు. యువతకు స్కిల్ యూనివర్సిటీ, తెలంగాణ తల్లి, రాజీవ్ ఆరోగ్య శ్రీ, రేవంతన్న సన్నబియ్యం, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, సబ్సిడీ సిలిండర్, ఇందిరా మహిళాశక్తి తదితర పథకాలను తెలిపేలా ఆకాశంలో డ్రోన్ల ద్వారా ప్రదర్శించారు. సుమారు వేయి డ్రోన్లతో చేసిన విన్యాసాలు మిస్ వరల్డ్ కంటెస్టంట్లతో పాటు హాజరైన ప్రముఖులను అలరించాయి.

కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర ప్రజాప్రతినిధులు, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Share this post
Exit mobile version