మేడారం ను ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కింద అభివృద్ధి చేసేలా శాశ్వత కట్టడాలు…రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
బాసర నుంచి భద్రాచలం వరకు 2500 కోట్లతో టెంపుల్ సర్క్యూట్ అభివృద్ధి
70 ఎకరాలలో కాటేజీలు, కళ్యాణ మండపం ఏర్పాటు చర్యలు
మీడియా సెంటర్ లో పాత్రికేయులతో మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి పొంగులేటి
మేడారం, జనవరి- 29:
మేడారం ను ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కింద అభివృద్ధి చేసేలా శాశ్వత కట్టడాలు చేపట్టామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురువారం మేడారం జాతర లోని మీడియా సెంటర్ లో మంత్రి దనసరి అనసూయ (సీతక్క) తో కలిసి మీడియా వారితో మాట్లాడారు.
ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, కుంభమేళా మరిపించే విధంగా లక్షలాది మంది భక్తులు ఇప్పటికే సమక్క సారలమ్మ జాతర కు విచ్చేసారని, 10 కిమి రేడియస్ పరిధిలో భక్తులు పెద్ద ఎత్తున కనిపిస్తున్నారని , జాతర ఏర్పాట్లను మంత్రి వర్యులు సీతక్క ప్రత్యేకంగా
పర్యవేక్షిస్తున్నారని అన్నారు.
జాతరకు వచ్చిన కేంద్రం మంత్రులకు ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించామని అన్నారు. సమక్క సారలమ్మ జాతరకు దేశంలో అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తున్నారని, జాతరకు అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులు ముందుగానే చేపట్టామని అన్నారు.
నేడు సాయంత్రం 6 గంటల తర్వాత సమ్మక్క గద్దె మీదకు వస్తుందని అప్పుడు భక్తులు తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంటుందని, ఒకేసారి కోటి పైగా ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున అవసరమైన మేర చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. సామాజిక మాధ్యమాలలో దుష్ప్రచారులను నమ్మవద్దని మంత్రి తెలిపారు.
జాతరకు 10 కిలోమీటర్ల రేడియస్ పరిధిలో రోడ్లను ఫోర్ లైన్ చేశామని అన్నారు. 29 ఎకరాల భూ సేకరణ చేసి మరో 40 పైగా ఎకరాల భూ సేకరణ జరుగుతుందని, 70 ఎకరాల వరకు సేకరించి అవసరమైన కాటేజీలు, వివాహాలు జరిపించుకునేందుకు వీలుగా కళ్యాణ మండపాలు, టాయిలెట్స్, జంపన్న వాగు పై శాశ్వతంగా చెక్ డ్యాం నిర్మాణానికి ప్రణాళికలు తయారు చేస్తున్నామని తెలిపారు.
365 రోజులు జంపన్న వాగులో నీరు ఉండే విధంగా రామప్ప నుంచి లక్నావరం మీదుగా జంపన్న వాగుకు లింక్ చేసేలా చర్యలు చేపడుతున్నామని అన్నారు.
బాసర నుంచి భద్రాచలం వరకు 2500 కోట్లతో టెంపుల్ సర్క్యూట్ అభివృద్ధి చేసేందుకు ప్రజా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, టెంపుల్ సర్కిల్ మేడారం ను కూడా భాగస్వామ్యం చేస్తామని అన్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న దేవాలయాలను సకల వసతులతో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటుందని అన్నారు.
మంత్రి దనసరి అనసూయ (సీతక్క) మాట్లాడుతూ,
సమ్మక్క సారలమ్మ జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని అన్నారు. 45 రోజుల నుంచి మేడారం కు భక్తులు భారీ ఎత్తున వస్తున్నారని అన్నారు. ప్రభుత్వం పట్టుదలతో రికార్డు సమయంలో సమక్క సారలమ్మ ఆశీర్వాదంతో జాతర శాశ్వత పనులు పూర్తి చేశామని అన్నారు.
2010 నుంచి సీఎం రేవంత్ రెడ్డి సమక్క సారలమ్మ జాతరకు వస్తున్నారని, ముఖ్యమంత్రి కాగానే ఇక్కడ మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారని తెలిపారు. రోడ్డు విస్తరణ 4 లైన్లు చేయడం వల్ల భక్తులకు చాలా ఇబ్బందులు తగ్గాయని అన్నారు. మంచి నీటి వ్యవస్థ, టాయిలెట్స్ శాశ్వతంగా కల్పించేలా చర్యలు చేపట్టామని అన్నారు. సమక్క సారలమ్మ జాతర ప్రదేశంలో పచ్చదనం ఉండేలా చెట్ల పెంపకం చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాత్రికేయులు, సమాచార శాఖ సంయుక్త సంచాలకులు, డి.ఎస్. జగన్ , తదితరులు పాల్గొన్నారు.

